APEPDCL Develops meter reading With Cell Phone Details Inside - Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌తో మీటర్‌ రీడింగ్‌.. ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్‌!

Published Sat, Jan 8 2022 8:06 AM | Last Updated on Sat, Jan 8 2022 12:23 PM

APEPDCL Develops meter reading With Cell Phone - Sakshi

సాక్షి, అమరావతి: విద్యుత్‌ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్‌ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్‌ ఫోన్‌తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్‌తో మీటర్‌ రీడింగ్‌ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్‌ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్‌ రీడింగ్‌ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు.

అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్‌ తీస్తున్నారు. గత రెండు వేవ్‌లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్‌ బిల్లింగ్‌ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్‌ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్‌పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్‌ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్‌ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి.



రీడింగ్‌ ఇలా..
ఈపీడీసీఎల్‌ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఈస్టర్న్‌ పవర్‌ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్‌ ఫోన్‌ నంబర్, మెయిల్‌ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్‌వర్డ్‌ ద్వారా లాగిన్‌ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్‌ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్‌ చేస్తే రిజిస్ట్రేషన్‌ పూర్తవుతుంది. మీటరు ఐకాన్‌ రిజిస్ట్టర్‌ సర్వీస్‌ నంబర్‌పై క్లిక్‌ చేసి కెమెరా ఐకాన్‌ ద్వారా మీటర్‌ రీడింగ్‌ స్కాన్‌ చేయాలి. దానిని సబ్మిట్‌ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అందరి క్షేమం కోరి 
వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్‌ అంతరాయాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకునేలా రియల్‌ టైం ఫీడర్‌ మానిటరింగ్‌ సిస్టం (ఆర్‌టీఎఫ్‌ఎంఎస్‌)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్‌కు రీడింగ్‌ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి.
–కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement