Meter reading
-
ఇంటి కరెంట్ బిల్లు రూ.76లక్షలు! మరోసారి రీడింగ్ తీస్తే..
మధిర: ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని పలు ఇళ్లలో విద్యుత్ మీటర్ల రీడింగ్ తప్పులతడకగా మారడంతో వినియోగదారులు గందరగోళానికి గురవుతున్నారు. మధిరలోని వర్తక సంఘం సమీపాన నివసిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు తమ్మారపు నాగమణి ఇంట్లో సోమవారం విద్యుత్‌శాఖ సిబ్బంది మీటర్ రీడింగ్ తీశారు. స్కానింగ్ మిషన్ ద్వారా రీడింగ్ తీసే క్రమంలో పక్కనే ఉన్న మరో మీటర్ రీడింగ్ కూడా చేరడంతో 3090110116 సర్వీస్‌కు రూ.76,46,657గా బిల్లు వచ్చింది. రెండు మీటర్లు కలిసినా 76 లక్షలకు పైగా బిల్లు రావడమేమిటని బాధితులు ఆందోళన చెం దారు. దీంతో సిబ్బం ది మరో స్కా నింగ్ మిషన్ తీసుకొచ్చి రీడింగ్ తీస్తే బిల్లు రూ.58 మాత్రమే వచ్చింది. దీంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. కాగా.. స్కానింగ్మిషన్లలో అవకతవకలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
APEPDCL ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్!
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో సరికొత్త సాంకేతిక విప్లవానికి ఏపీ రాష్ట్ర ఇంధన శాఖ శ్రీకారం చుడుతోంది. ఎవరి ఇంటి మీటర్‌కు వారే రీడింగ్ తీసి బిల్లులు పొందేలా సాంకేతికతను అభివృద్ధి చేసింది. స్మార్ట్ ఫోన్‌తో కరెంటు బిల్లు కడుతున్నట్లుగానే అదే ఫోన్‌తో మీటర్ రీడింగ్ కూడా తీసేయొచ్చు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ బిల్లులు తీసే ప్రక్రియ స్పాట్ బిల్లింగ్ రీడర్ల ద్వారా జరుగుతోంది. కరోనా నేపథ్యంలో మీటర్ రీడింగ్ తీసేందుకు సిబ్బంది ఇళ్లకు రావడంపై కొందరు అభ్యంతరం తెలుపుతున్నారు. అయినా, మరో మార్గం లేకపోవడంతో వారే రీడింగ్ తీస్తున్నారు. గత రెండు వేవ్‌లలో కరోనా బారిన పడి పలువురు స్పాట్ బిల్లింగ్ రీడర్లు ప్రాణాలు కూడా కోల్పోయారు. మూడో వేవ్ వస్తున్న నేపధ్యంలో మళ్లీ ఇప్పుడు రీడింగ్‌పై ఆందోళన మొదలైంది. అంతేకాకుండా రీడింగ్ తీయడం కాస్త ఆలస్యమైతే స్లాబు మారి, బిల్లు ఎంత వస్తుందోననే భయం వినియోగదారుల్లో ఉంది. దీనికి పరిష్కారంగా ఎవరికి వారు మీటరు రీడింగ్ సకాలంలో తీసుకుని పంపితే ఈ–బిల్లు మీ కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. ఈ విధానాన్ని ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) అందుబాటులోకి తెచ్చింది. దీనిని మిగతా రెండు డిస్కంలు ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్‌లు కూడా అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. రీడింగ్ ఇలా.. ఈపీడీసీఎల్ అనుసరిస్తున్న విధానం ప్రకారం.. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఈస్టర్న్ పవర్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకోవాలి. కొత్త వారైతే పేరు, చిరునామా, సెల్ ఫోన్ నంబర్, మెయిల్ ఐడీ నమోదు చేయాలి. ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి. 16 నంబర్ల విద్యుత్తు సర్వీస్ మీటరును నమోదు చేయాలి. ఆ వెంటనే సెల్‌ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీటరు ఐకాన్ రిజిస్ట్టర్ సర్వీస్ నంబర్‌పై క్లిక్ చేసి కెమెరా ఐకాన్ ద్వారా మీటర్ రీడింగ్ స్కాన్ చేయాలి. దానిని సబ్మిట్ చేస్తే అధికారి నిర్ధారణ చేసిన తరువాత మొబైల్‌కు సమాచారం వస్తుంది. ఈ యాప్‌లోనే బకాయిలు, బిల్లు కట్టే విధానం, వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి. అందరి క్షేమం కోరి వినియోగదారులకు ఎప్పటికప్పుడు నూతన సాంకేతికతను అందుబాటులోకి తెస్తున్నాం. విద్యుత్ అంతరాయాల షెడ్యూల్‌ను ముందే తెలుసుకునేలా రియల్ టైం ఫీడర్ మానిటరింగ్ సిస్టం (ఆర్టీఎఫ్ఎంఎస్)ను కూడా మా డిస్కం అభివృద్ధి చేసింది. వినియోగదారులు, సిబ్బంది క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఇటువంటి మీటర్‌కు రీడింగ్ వెసులుబాటు కల్పించాం. దీనివల్ల భద్రతతో పాటు స్లాబులు మారకుండా ఉంటాయి. –కె.సంతోషరావు, సీఎండీ, ఏపీఈపీడీసీఎల్ -
విద్యుత్ మీటర్లు దడ పుట్టిస్తున్నాయి.. కనెక్షన్ లేకుండానే..
సాక్షి, నిర్మల్: నిర్మల్ జిల్లాలో విద్యుత్ మీటర్లు వినియోగదారుల గుండెల్లో దడ పుట్టిస్తున్నాయి. ఖానాపూర్ పట్టణంలో విద్యుత్ మీటర్లు కనెక్షన్ లేకుండానే రీడింగ్ తిరగడం ఆశ్చర్యం కలిగిస్తోంది. విద్యుత్ కనెక్షన్ తొలగించి విద్యుత్ మీటర్లు చేతితో పట్టుకుంటే చాలు రీడింగ్ తిరుగుతున్నాయి. దీనిపై ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి మీటర్లతో ప్రజలకు విద్యుత్ సరఫరా చేస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుకుంటున్నారు. చదవండి: (సైదాబాద్ ఘటన: మత్తు రహిత సింగరేణిగా మారాలి) -
గతేడాది మార్చి బిల్లునే చెల్లించండి
సాక్షి, హైదరాబాద్: కరోనా నేపథ్యంలో ఇంటింటికీ వెళ్లి మీటర్ రీడింగ్ తీసి విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులు జారీ చేయడానికి బదులు ప్రత్యామ్నాయ విధానాన్ని అనుసరించాలని రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయం తీసుకున్నాయి. 2019 మార్చిలో జరిపిన వినియోగానికి సంబంధించి చెల్లించిన విద్యుత్ బిల్లులనే 2020 మార్చిలో జరిపి న వినియోగానికి సైతం చెల్లించాలని వినియోగదారులను కోరనున్నా యి. కొత్త వినియోగదారులైతే ఫిబ్రవరి 2020 నెలకు సంబం ధించి చెల్లించిన బిల్లు మొత్తాన్నే మార్చి నెల వినియోగానికి సైతం చెల్లించాలని కోరనున్నాయి. దీనికి సంబంధించిన అనుమతుల కోసం శుక్రవారం రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించాయి. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత మీటర్ రీడింగ్ తీసి వినియోగదారులు చెల్లించిన బిల్లులను సర్దుబాటు చేస్తామని ఈఆర్సీకి తెలిపాయి. వినియోగంతో పోల్చితే ఎవరైనా అధికంగా బిల్లులు చెల్లిస్తే.. తర్వాత మీటర్ రీ డింగ్ తీసినప్పుడు వారికి సంబంధించిన తదుపరి నెల బిల్లును ఆ మేరకు తగ్గించి సర్దుబాటు చేస్తారు. ఇదే తరహాలో అధిక వినియోగం ఉండి తక్కువ బిల్లులు చెల్లించిన వారి నుంచి తదు పరి నెల బిల్లులో ఆ మేరకు మిగిలిన మొత్తాన్ని అదనంగా వసూలు చేస్తామని ప్రతిపాదించాయి. ఈ ప్రతిపాదనలను పరిశీలించి శనివారం ఈఆర్సీ ఉత్తర్వులు జారీ చేసే అవకాశముంది. -
పెట్రోల్ రాదు.. రీడింగ్ మాత్రమే వస్తుంది
సాక్షి,మంచిర్యాల : ఓ వాహన యాజమాని గురువారం సాయంత్రం పెట్రోల్ పోయించుకునేందుకు జన్నారం మండలం రేండ్లగూడ సమీపంలోని పెట్రోల్ బంక్‌కు వెళ్లాడు. పెట్రోల్ పోసెందుకు గన్ తీయగానే పెట్రోల్ పోస్తున్నట్లు రీడింగ్ నడుస్తుంది. పెట్రోల్ రావడం లేదు. అవాక్కయిన వాహన యాజమాని అలాగే పరిశీలించారు. బైక్‌లో పెట్రోల్ పోయకుండానే సుమారు రూ.400 వరకు రీడింగ్, పెట్రోల్ మీటర్ల రీడింగ్ నడుస్తుంది. ఇది ఎలా జరుగుతుందని, మోసం చేస్తున్నారంటూ వాహన యాజమానులు పెట్రోల్ బంక్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. ఈ క్రమంలో ఇరువురికి తోపులాట జరిగింది. విషయం తెలుసుకున్న ఎస్సై వినోద్‌కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాల వారిని శాంతింపజేశారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో శుక్రవారం జన్నారం తహసీల్దార్ రాజుకుమార్ పెట్రోల్ బంకుకు వెళ్లి విచారణ చేశారు. పెట్రోల్ పోసే గన్ తీయగానే రీడింగ్ నడుస్తుందని, ఇలా జరుగడానికి కారణంపై ఆరా తీశారు. గాలి, వర్షం, పిడుగుల కారణంగా ఇలా అయిందని, ఈ విషయాన్ని పై అధికారులకు సమాచారం ఇచ్చామని సిబ్బంది పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని తహసీల్దార్ పెట్రోల్ బంకు యాజమానికి తెలియజేసి ఇలా జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. -
రెండు నెలలు..11 వేల కరెంట్ బిల్లు
సాక్షి, చొప్పదండి(కరీంనగర్) : ప్రతి రెండు నెలలకు ఐదు వందల నుంచి వేయి లోపు రావాల్సిన కరెంట్ బిల్లు ఒకేసారి పదకొండు వేలు రావడంతో వినియోగదారుడు లబోదిబోమంటున్నాడు. మండలంలోని బూర్గుపల్లి గ్రామానికి చెందిన విలాసాగరపు సంతోష్‌కుమార్‌కు సర్వీస్ నంబర్ 722పై విద్యుత్ కనెక్షన్ ఉంది. ప్రతీ రెండునెలలకోసారి బిల్లు ఐదు వందల రూపాయల నుంచి వేయి వచ్చేది. కాగా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 23 వరకు మీటర్ రీడింగ్ 1285 యూనిట్లు తిరిగినట్లు రూ.11 వేల 2 రూపాయలు చెల్లించాలని బిల్లు తీసి అందించారు. మీటర్ తీసుకున్నప్పటి నుంచి ఏనాడు వేయి దాటని బిల్లు ఇంతపెద్దమొత్తంలో రావడంపై బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. విద్యుత్ సిబ్బందిని సంప్రదించినా ఫలితం లేదని వాపోయాడు. ఇప్పటికైనా స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాడు. -
బిల్లుల మోతే..!
సాక్షి, సిటీబ్యూరో: కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతూ తెలంగాణ విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మీటర్ రీడింగ్ కార్మికులు సమ్మెకు దిగారు. ఫలితంగా విద్యుత్ మీటర్ రీడింగ్ స్తంభించిపోయింది. సాధారణంగా ప్రతి నెల 4వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మీటర్‌రీడింగ్ నమోదు చేస్తుంటారు. బిల్లుల చెల్లింపునకు 15 రోజుల గడువు ఇస్తుంటారు. నిర్ధేశిత గడువు దాటిన తర్వాత అపరాధ రుసుం వసూలు చేస్తారు. సకాలంలో మీటర్ రీడింగ్ నమోదు చేయక పోవడం వల్ల స్లాబ్‌రేట్ మారిపోయి నెలసరి విద్యుత్ బిల్లులో భారీ వ్యత్యాసం నమోదవుతుంది. నెలకు సగటున రూ.350 చెల్లించే వినియోగదారుదు స్లాబ్ మారిపోవడం వల్ల రూ.600పైగా చెల్లించాల్సి వస్తుంది. రెట్టింపు బిల్లులతో వినియోగదారులు నష్టపోతుంటే..చెల్లింపులు లేకపోవడంతో సంస్థకు రావాల్సిన ఆదాయం భారీగా నిలిచిపోతోంది. అజమాబాద్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, కీసర, గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, జీడిమెట్ల తదితర ప్రాంతాల్లో బిల్లుల జారీ నిలిచిపోవడంతో ఆయా ప్రాంతాల్లోని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఒక్కో డివిజన్లో ఒక్కో రేటు... దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలో 1.43 కోట్ల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 50 లక్షలకుపైగా విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటి నుంచి నెలకు రూ.450 కోట్లకుపైగా బిల్లింగ్ రూపంలో వస్తుంది. రెగ్యులర్ ఏఈలు, లైన్మెన్లు, ఆర్టిజన్ కార్మికులు ఉన్నప్పటికీ.. కొన్నిచోట్ల సిబ్బంది కొరత కారణంగా మీటర్ రీడింగ్ పనులను ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించింది. డిస్కం పరిధిలో సుమారు 1450 మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరిని పీస్‌రేట్ కార్మికులుగా వ్యవహరిస్తుంటారు. వీరు రోజుకు సగటున 200 నుంచి 400 బిల్లులు జారీ చేస్తుంటారు. ఇందుకు ఒక్కో బిల్లుకు రూ.3 ఇస్తుండగా, సదరు ఔట్ సోర్సింగ్ మీటర్ రీడింగ్ కాంట్రాక్టర్ కార్మికులకు 90 పైసల నుంచి రూ.1.50 పైసలు మాత్రమే చెల్లిస్తున్నారు. దీనికితోడు ఒక్కో డివిజన్లో ఒక్కో విధంగా చెల్లిస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలపై కార్మికులతో చర్చించి సమ్మెను విరమింపజేయాల్సిన డిస్కం ఉన్నతాధికారులు పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అంతేకా దు క్షేత్రస్థాయిలో ఉన్న కొంత మంది అధికారులు వెంటనే మీటర్ రీడింగ్ మిషన్లను తమకు అప్పజెప్పాలని, లేదంటే కేసులు పెడతామని కార్మికులకు హెచ్చరికలు జారీ చేస్తుండటం విశేషం. ఉద్యోగ భద్రత కల్పించాల్సిందే : విద్యుత్ మీటర్ రీడర్స్ అసోసియేషన్ సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతో పాటు ఉపాధి భద్రత కల్పించి, ఈఎస్ఐ, ఈఫీఎఫ్ సదుపాయాలను వర్తింపజేయాలని అప్పటి వరకు విధులకు హాజరయ్యే ప్రసక్తే లేదని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. నెలలో పదిరోజులు మాత్రమే ఉపాధి ఉంటుందని, రూ.4000 వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందన్నారు. ప్రతి మీటర్ రీడింగ్ ఉద్యోగికి నెలకు 30 రోజుల పనిదినాలు కల్పించాలని, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నెలకు రు.18వేల వేతనం, ఈఎస్ఐ, ఈపీఫ్ సదుపాయాలు కల్పించాలని, ఆర్హులైన రీడర్స్‌ను ఆర్టిజన్స్‌గా గుర్తించి ఉద్యోగ క్రమబద్దీకరణ చేయాలని డిమాండ్ చేస్తూ నగరంలోని ఆయా సబ్స్టేషన్లు, డీఈ, ఎస్ఈ కార్యాలయాల ముందు ధర్నాకు దిగారు. -
పెట్రోల్ బంక్‌లో నిలువు దోపిడీ
శ్రీకాకుళం, ఆమదాలవలస: పట్టణంలోని లక్ష్మణరాజు ఫిల్లింగ్ స్టేషన్ పెంట్రోల్ బంక్‌లో వినియోగదారులను దోపిడీ చేసుకుంటున్న వైనం శుక్రవారం బట్టబయలైంది. మండలంలోని కనుగులవలస గ్రామానికి చెందిన వినియోగదారుడు తన వాహనానికి రూ. 300 పెట్రోల్ పోయించగా, రూ. 290కు రాగానే మీటర్ రీడింగ్ ఆగిపోయింది. సదరు వినియోగదారుడు ఈ మోసాన్ని గుర్తించి నిలదీశా డు. లీటర్ బాటిల్లో ఆయిల్ కొట్టి పాయింట్లు లెక్క చూపించాలని మొండికేశాడు. ఇంతలో బంకు యజమాని వచ్చి అతడ్ని బుజ్జగించేందుకు నానా ప్రయత్నాలు చేశాడు. అయితే బిల్లు తీసి ఇవ్వాలని పట్టుబట్టగా, అందులోనూ తేడా కనిపించింది. ఈ లోగా వినియోగదారుల సంఖ్య పెరగడంతో కలవరం చెందిన బంకు యజమాని సదరు వినియోగదారుడిపై విరుచుకు పడ్డాడు. ‘నీలాంటి వారందరికీ సమాధానం చెప్పాలంటే మేం వ్యాపారం చేయలేం. మాకు ఉండాల్సిన అండదండలు ఉన్నాయి. నీవు ఎక్కడి కెళ్తావో, ఏమి చేసుకుంటావో.. నీ ఇష్టం’ అని దురుసుగా ప్రవర్తించాడు. అయితే పంపింగ్ యంత్రం మరమ్మతు ఉందని మభ్యపెట్టే ప్రయత్నం చేయగా, వినియోగదారులు విస్మయం వ్యక్తం చేశారు. ఏదేమైనా అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో విని యోగదారులు నిలువునా మోసపోతున్నామని ఆందోళన చెందుతున్నారు. -
శ్లాబు మారితే జేబుకు చిల్లు!
సాక్షి, హైదరాబాద్: రమేశ్.. సురేశ్.. పక్కపక్కనే ఉంటారు.. జూలై నెలలో ఇద్దరిళ్లలో 95 యూనిట్ల చొప్పున కరెంట్ కాలింది.. అయితే మీటర్ రీడింగ్ తీసే వ్యక్తి రమేశ్ ఇంటికి 28వ రోజు వచ్చాడు.. రమేశ్‌కు రూ.220 బిల్లు వచ్చింది! అదే రీడింగ్ తీసుకునే వ్యక్తి సురేశ్ ఇంటికి 31వ రోజు వచ్చాడు.. అయితే సురేశ్‌కు మాత్రం రూ.365 బిల్లు వచ్చింది!! అదేంటి..? ఇద్దరూ ఒకే మొత్తంలో కరెంట్ వాడినా బిల్లులో ఎందుకింత తేడా? ఇలా సురేశ్ ఒక్కడే కాదు.. బిల్లు ఎందుకు పెరిగిందో తెలియక ఎందరో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. మీటర్ రీడింగ్ తీసుకోవడంలో ఒకరోజు అటూ ఇటూ అయితే బిల్లుల్లో రూ.వందల తేడా వస్తోంది. నడ్డి విరుస్తున్న నాన్ టెలిస్కోపిక్ పద్ధతి విద్యుత్ బిల్లుల జారీలో ప్రవేశపెట్టిన అశాస్త్రీయమైన నాన్ టెలిస్కోపిక్ విధానం పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తోంది. మరోవైపు సరిగ్గా మీటర్ రీడింగ్ తీయకపోవడం వల్ల కూడా బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే ఒక్క యూనిట్ ఎక్కువ వినియోగించినా తేడా రూ.వందల్లో ఉంటోంది. వాస్తవంగా విద్యుత్ వినియోగదారులకు శ్లాబుల వారీగా విద్యుత్ బిల్లులను జారీ చేస్తున్నారు. గృహ వినియోగదారులకు 50, 100, 200, 300, 400 యూనిట్ల శ్లాబులున్నాయి. వినియోగం పెరిగిన కొద్దీ శ్లాబు మారి విద్యుత్ ధర పెరుగుతుంది. ఒక్కో శ్లాబుకు ఒక్కో చార్జీ ఉంటుంది. 50 యూనిట్లలోపు వినియోగానికి ధర యూనిట్‌కు రూ.1.45, 50 యూనిట్లు దాటితే యూనిట్ ధర రూ.2.60లకు పెరుగుతుంది. వినియోగం 100 యూనిట్లు దాటితే ధర రూ.3.30లకు చేరుతుంది. వినియోగదారుడు ఒక శ్లాబు దాటితే, అధికంగా వాడిన విద్యుత్‌కు తదుపరి శ్లాబు ప్రకారం ధర విధిస్తారు. ఇలా అధికంగా వాడిన విద్యుత్ మొత్తానికి కొత్త శ్లాబు ప్రకారం చార్జీలు విధించడాన్ని టెలిస్కోపిక్ పద్ధతి అంటారు. అయితే తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లో నాన్–టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నారు. శ్లాబు దాటి ఒక్క యూనిట్ అధికంగా వినియోగించినా మొత్తం వినియోగానికి కొత్త శ్లాబు ధర ప్రకారం బిల్లులు జారీ చేయడాన్ని నాన్ టెలిస్కోపిక్ విధానం అంటారు. 100 యూనిట్ల లోపే ‘టెలిస్కోపిక్’ రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు 100 యూనిట్లలోపు వినియోగానికి మాత్రమే టెలిస్కోపిక్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి నెలా సరిగ్గా 30 రోజులకు మీటర్ రీడింగ్ తీయడం సాధ్యం కావడం లేదు. దీంతో మీటర్ రీడింగ్ 30 రోజుల తర్వాత తీస్తే వినియోగదారులు అధిక ధరల శ్లాబుల పరిధిలోకి వెళ్లిపోతారని, బిల్లులు విపరీతంగా పెరిగిపోతాయని రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు రెండేళ్ల కిందటే విద్యుత్ రంగ నిపుణులు వాదించారు. దీంతో 30 రోజుల తర్వాత ఆలస్యంగా రీడింగ్ తీసినా, కేవలం 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని డిస్కంలకు అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ఆ మేరకు డిస్కంలు కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తెచ్చాయి. దీంతో రీడింగ్ ఆలస్యంగా తీసినా 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేస్తున్నారు. ఉదాహరణకు 35 రోజులకు 110 యూనిట్లు వినియోగం జరిగితే.. కొత్త సాఫ్ట్వేర్ ప్రకారం 30 రోజులకు 94.2 (30/35 ్ఠ110= 94.2) యూనిట్లు వినియోగించినట్లు అంచనా వేసి 100 యూనిట్ల లోపు శ్లాబు ధరల ప్రకారం చార్జీలు విధిస్తున్నారు. ముందుగానే రీడింగ్ తీసి.. మీటర్ రీడింగ్ ఎన్నడూ సరిగ్గా 30 రోజులకు తీసుకోవడం లేదు. అయితే ఆలస్యంగా.. లేదంటే కొన్ని రోజుల ముందుగా రీడింగ్ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వారం లేదా 10 రోజుల ముందే రీడింగ్ నమోదు చేసుకుంటున్నారు. ఇలా ముందుగా తీసుకున్న రీడింగ్‌కు కూడా పైన పేర్కొన్న విధానాన్నే పాటిస్తున్నా రు. ఉదాహరణకు ఒక మీటర్ రీడింగ్‌ను 28 రోజుల్లో తీసుకుంటే 95 యూనిట్ల వినియోగం నమోదైంది. 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి లెక్కిస్తే 101 యూనిట్లు అవుతుంది. దీంతో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆపై ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీలు విధిస్తున్నారు. రీడింగ్ నమోదులో జాప్యం జరిగితే శ్లాబులు మారి విద్యుత్ బిల్లులు పెరగకుండా కేవలం 30 రోజుల వినియోగాన్ని మాత్రమే అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఆదేశిస్తే, రాష్ట్ర డిస్కంలు మాత్రం ముందస్తుగా తీసుకుంటున్న రీడింగ్‌లకు సైతం ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నా యి. దీంతో వినియోగదారులకు జారీ చేసే విద్యుత్ బిల్లుల డిమాండ్ నోటీసులో వినియోగం తక్కువ ఉన్నా చార్జీలు మాత్రం అనూహ్యంగా పెరిగిపోయి కనిపిస్తున్నాయి. ఒక యూనిట్.. రూ.151.8 ఒక వినియోగదారు 100 యూనిట్లు వాడితే.. తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున (50 ్ఠ1.45), తర్వాతి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.30 చొప్పున (50 ్ఠ2.30) మొత్తం విద్యుత్ చార్జీ రూ.202.5 విధిస్తారు. ఒకవేళ 101 యూనిట్లు వాడితే.. అందులో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆ తర్వాతి ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీని విధిస్తారు. అప్పుడు 101 యూని ట్లకు బిల్లు రూ.334.3 అవుతుంది. తొలుత 100 యూనిట్లకు రూ.202.5 విధించగా.. 101 యూని ట్లకు మాత్రం బిల్లు రూ.334.3కు చేరుతోంది. అంటే కేవలం ఒక యూనిట్ విద్యుత్ అధికంగా వాడడం వల్ల ఏకంగా రూ.131.8 అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు వంద యూనిట్ల వరకు వినియో గదారుల చార్జీలు రూ.30, వంద నుంచి 200 యూనిట్ల వినియోగానికి రూ.50 చొప్పున విధిస్తారు. 100 యూనిట్లకు అదనంగా ఒక యూనిట్ వాడినా వినియోగదారుల చార్జీలు రూ.30 నుంచి రూ.50కు పెరిగిపోతాయి. దీంతో మొత్తంగా అదనంగా చెల్లిం చాల్సిన విద్యుత్ చార్జీలు రూ.151.8లకు పెరిగి పోతాయి. అదే 201 యూనిట్లు వాడితే ఒక్కసారిగా రూ. 256.80 అదనంగా చెల్లించాల్సి వస్తోంది. పేద కుటుంబాల మధ్య చిచ్చు విద్యుత్ బిల్లులు పేద, మధ్య తరగతి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. చాలా చోట్ల రెండు, మూడు పోర్షన్లకు ఒకే మీటర్ సదుపాయం ఉండగా, అందరి వినియోగం కలిపి అధిక ధరల శ్లాబులతో బిల్లులు జారీ అవుతున్నాయి. తక్కువ అద్దెతో ఒకటి రెండు గదుల ఇళ్లలో నివాసముండే వారు మరో రెండు మూడు కుటుంబాలతో కలిసి ఒకే విద్యుత్ మీటర్‌తో సరఫరా పొందుతున్నారు. ఒక్కో కుటుంబం 50 యూనిట్ల చొప్పునే వాడినా నాలుగు కుటుంబాలకు కలిపి మొత్తం 200 యూనిట్లకు గాను రూ.1,000 బిల్లు అవుతోంది. అదే వేర్వేరు మీటర్లు ఉంటే ఒక కుటుంబానికి రూ.72.50 బిల్లు మాత్రమే కానుంది. -
3 లక్షల మందికి నోటీసులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నీటి మీటర్లు లేని 3లక్షల మంది నల్లా వినియోగదారులకు 60 రోజుల్లో మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తూ నోటీసులు జారీ చేయాలని మీటర్ రీడింగ్ సిబ్బందిని జలమండలి ఎండీ ఎం.దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో ఆయన మీటర్ రీడింగ్ విభాగం సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నీటి బిల్లులు జారీ చేసే ఈ–పాస్ యంత్రాల ద్వారానే ఈ నోటీసులు ముద్రించి స్వయంగా అందజేయడంతోపాటు మీటర్ ఏర్పాటు చేసుకుంటే కలిగే ప్రయోజనాలను వివరించాలని, వాటిని ఎలా ఏర్పాటు చేసుకోవాలో అవగాహన కల్పించాలని సూచించారు. నోటీసులకు స్పందించి మీటర్లు ఏర్పాటు చేసుకోని వినియోగదారులకు రెట్టింపు నీటి బిల్లులు వసూలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ దిగిరాకుంటే నల్లా కనెక్షన్లు తొలగిస్తామని స్పష్టంచేశారు. సమావేశంలో ఈడీ సత్యనారాయణ, రెవెన్యూ విభాగం డైరెక్టర్ డి.శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు. -
సమ్మె..సమస్యలు
డిస్కంలో పేరుకపోతున్న విద్యుత్ ఫిర్యాదులు కోతలు, ఓల్టేజ్ హెచ్చతగ్గులతో గ్రేటర్‌వాసులు సతమతం నిలిచిన మీటర్ రీడింగ్, బిల్లుల వసూళ్లు ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్న నేతలు సిటీబ్యూరో: విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టిన దీక్షను శనివారం అర్ధరాత్రి పోలీసులు భగ్నం చేసినప్పటికీ.. కార్మిక సంఘం నేతలు మాత్రం ఇంకా ఇంట్లో దీక్ష కొనసాగిస్తున్నారు. నేతల దీక్షకు మద్దతుగా సోమవారం ఉదయం మరోసారి మూకుమ్మడిగా టీఎస్ఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయాన్ని మట్టడించాలని కార్మికులు నిర్ణయించారు. తెలంగాణ వ్యాప్తంగా జెన్కో, ట్రాన్స్‌కో, వివిధ డిస్కంల పరిధిలోని సుమారు 22 వేల మంది కాంట్రాక్ట్ కార్మికులంతా ఏడు రోజులుగా సమ్మె చేస్తుండటంతో ఆయా విభాగాల్లో పనులన్ని పూర్తిగా స్తంభించిపోయాయి. లైన్ల పునరుద్ధరణ, కొత్త కనెక్షన్లు, కొత్త లైన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోగా, హై ఓల్టేజ్, లో ఓల్టేజ్ సమస్యలు తలెత్తినప్పుడు ఇంట్లో విలువైన గృహోపకరణాలు కాలిపోతున్నాయి. అంతేకాదు సర్వీసు వైర్లు కాలిపోతున్నాయి. అంతటా అంధకారం.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో లైన్లను పునరుద్ధరించాల్సిందిగా కోరుతూ ఎఫ్ఓసీ కాల్ సెంటర్లకు ఫోన్ చేసినా ఫలితం ఉండటం లేదు. విద్యుత్ స్తంభాలు ఎక్కేందుకు కార్మికులు లేక పోవడంతో వినియోగదారులు రోజుల తరబడి అంధకారంలో మగ్గాల్సి వస్తోంది. ఆసిఫ్‌నగర్ డివిజన్ దత్తాత్రేయనగర్ కాలనీలో సర్వీస్ నెంబర్ 030555 వినియోగ దారుడు ఇదే అంశంపై రెండు రోజుల క్రితం స్థానిక ఏఈకి ఫిర్యాదు ఇచ్చినా..నేటికి పరిష్కారానికి నోచుకోలేదు. శనివారం చాదర్‌ఘట్‌లో డిస్ట్రిబ్యూషన్ వైరు తెగిపడింది. వెంటనే స్థానికులు డిస్కం కాల్ సెంటర్‌కు ఫోన్ చేయగా ఎవరూ స్పందించలేదు. గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్‌లో ఆదివారం సాయంత్రం భారీ వడగళ్ల వర్షం కురియడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్ పునరుద్ధరణ కోసం స్థానికులు 1912 కాల్ సెంటర్‌కు ఫోన్ చేసినా ఎవరూ స్పందించలేదు. నిలిచిన మీటర్ రీడింగ్.. మీటర్ రీడింగ్ కార్మికులూ సమ్మెలో పాల్గొనడంతో గ్రేటర్ పరిధిలో రీడింగ్ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో డిస్కం పరిధిలో వినియోగదారుల బిల్లులు భారీగా పేరుకుపోయాయి. ప్రతి నెలా ఒకటి, రెండో తేదీల్లో మీటర్ రీడింగ్ మిషన్లలో సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకుంటారు. సోమవారం వరకు ఆ ప్రక్రియ మొదలు కాలేదు. సకాలంలో రీడింగ్ తీయక పోవడంతో శ్లాబురేటు మారి వినియోగదారుని జేబుకు చిల్లుపడుతోంది. కార్మికుల సమ్మె నేపథ్యంలో టీఎస్ఎస్పీడీసీఎల్ యాజమాన్యం మీటర్ రీడింగ్‌పై ప్రత్యామ్నాయ దృష్టి సారించింది. డీఈ, ఏఈ, లైన్మెన్లతో పాటు ఐటీఐ పూర్తి చేసిన నిరుద్యోగులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చి బిల్లులు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కసరత్తు కూడా ప్రారంభించింది. అయితే తమ సమస్యను పరిష్కరించకుండా ఇతరులతో రీడింగ్ తీయిస్తే ఎట్టిపరిస్థితుల్లోనూ అడ్డుకుని తీరుతామని కార్మిక సంఘం నాయకుడు సాయిలు హెచ్చరించారు.