శ్లాబు మారితే జేబుకు చిల్లు! | Gambling of electricity bills in the state | Sakshi
Sakshi News home page

శ్లాబు మారితే జేబుకు చిల్లు!

Published Wed, Aug 15 2018 4:18 AM | Last Updated on Wed, Aug 15 2018 4:18 AM

Gambling of electricity bills in the state - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రమేశ్‌.. సురేశ్‌.. పక్కపక్కనే ఉంటారు.. జూలై నెలలో ఇద్దరిళ్లలో 95 యూనిట్ల చొప్పున కరెంట్‌ కాలింది.. అయితే మీటర్‌ రీడింగ్‌ తీసే వ్యక్తి రమేశ్‌ ఇంటికి 28వ రోజు వచ్చాడు.. రమేశ్‌కు రూ.220 బిల్లు వచ్చింది!
అదే రీడింగ్‌ తీసుకునే వ్యక్తి సురేశ్‌ ఇంటికి 31వ రోజు వచ్చాడు.. అయితే సురేశ్‌కు మాత్రం రూ.365 బిల్లు వచ్చింది!!
అదేంటి..? ఇద్దరూ ఒకే మొత్తంలో కరెంట్‌ వాడినా బిల్లులో ఎందుకింత తేడా?
ఇలా సురేశ్‌ ఒక్కడే కాదు.. బిల్లు ఎందుకు పెరిగిందో తెలియక ఎందరో వినియోగదారులు తలలు పట్టుకుంటున్నారు. మీటర్‌ రీడింగ్‌ తీసుకోవడంలో ఒకరోజు అటూ ఇటూ అయితే బిల్లుల్లో రూ.వందల తేడా వస్తోంది.

నడ్డి విరుస్తున్న నాన్‌ టెలిస్కోపిక్‌ పద్ధతి
విద్యుత్‌ బిల్లుల జారీలో ప్రవేశపెట్టిన అశాస్త్రీయమైన నాన్‌ టెలిస్కోపిక్‌ విధానం పేద, మధ్యతరగతి కుటుంబాల నడ్డి విరుస్తోంది. మరోవైపు సరిగ్గా మీటర్‌ రీడింగ్‌ తీయకపోవడం వల్ల కూడా బిల్లులు భారీగా పెరిగిపోతున్నాయి. ఒకే ఒక్క యూనిట్‌ ఎక్కువ వినియోగించినా తేడా రూ.వందల్లో ఉంటోంది. వాస్తవంగా విద్యుత్‌ వినియోగదారులకు శ్లాబుల వారీగా విద్యుత్‌ బిల్లులను జారీ చేస్తున్నారు. గృహ వినియోగదారులకు 50, 100, 200, 300, 400 యూనిట్ల శ్లాబులున్నాయి. వినియోగం పెరిగిన కొద్దీ శ్లాబు మారి విద్యుత్‌ ధర పెరుగుతుంది.

ఒక్కో శ్లాబుకు ఒక్కో చార్జీ ఉంటుంది. 50 యూనిట్లలోపు వినియోగానికి ధర యూనిట్‌కు రూ.1.45, 50 యూనిట్లు దాటితే యూనిట్‌ ధర రూ.2.60లకు పెరుగుతుంది. వినియోగం 100 యూనిట్లు దాటితే ధర రూ.3.30లకు చేరుతుంది. వినియోగదారుడు ఒక శ్లాబు దాటితే, అధికంగా వాడిన విద్యుత్‌కు తదుపరి శ్లాబు ప్రకారం ధర విధిస్తారు. ఇలా అధికంగా వాడిన విద్యుత్‌ మొత్తానికి కొత్త శ్లాబు ప్రకారం చార్జీలు విధించడాన్ని టెలిస్కోపిక్‌ పద్ధతి అంటారు. అయితే తెలంగాణతోపాటు చాలా రాష్ట్రాల్లో నాన్‌–టెలిస్కోపిక్‌ విధానం అమలు చేస్తున్నారు. శ్లాబు దాటి ఒక్క యూనిట్‌ అధికంగా వినియోగించినా మొత్తం వినియోగానికి కొత్త శ్లాబు ధర ప్రకారం బిల్లులు జారీ చేయడాన్ని నాన్‌ టెలిస్కోపిక్‌ విధానం అంటారు.

100 యూనిట్ల లోపే ‘టెలిస్కోపిక్‌’
రాష్ట్ర విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు 100 యూనిట్లలోపు వినియోగానికి మాత్రమే టెలిస్కోపిక్‌ విధానాన్ని అమలు చేస్తున్నాయి. ప్రతి నెలా సరిగ్గా 30 రోజులకు మీటర్‌ రీడింగ్‌ తీయడం సాధ్యం కావడం లేదు. దీంతో మీటర్‌ రీడింగ్‌ 30 రోజుల తర్వాత తీస్తే వినియోగదారులు అధిక ధరల శ్లాబుల పరిధిలోకి వెళ్లిపోతారని, బిల్లులు విపరీతంగా పెరిగిపోతాయని రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) ముందు రెండేళ్ల కిందటే విద్యుత్‌ రంగ నిపుణులు వాదించారు. దీంతో 30 రోజుల తర్వాత ఆలస్యంగా రీడింగ్‌ తీసినా, కేవలం 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని డిస్కంలకు అప్పట్లో ఈఆర్సీ ఆదేశించింది. ఆ మేరకు డిస్కంలు కొత్త సాఫ్ట్‌వేర్‌ను వినియోగంలోకి తెచ్చాయి. దీంతో రీడింగ్‌ ఆలస్యంగా తీసినా 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి బిల్లులు జారీ చేస్తున్నారు. ఉదాహరణకు 35 రోజులకు 110 యూనిట్లు వినియోగం జరిగితే.. కొత్త సాఫ్ట్‌వేర్‌ ప్రకారం 30 రోజులకు 94.2 (30/35 ్ఠ110= 94.2) యూనిట్లు వినియోగించినట్లు అంచనా వేసి 100 యూనిట్ల లోపు శ్లాబు ధరల ప్రకారం చార్జీలు విధిస్తున్నారు.

ముందుగానే రీడింగ్‌ తీసి.. 
మీటర్‌ రీడింగ్‌ ఎన్నడూ సరిగ్గా 30 రోజులకు తీసుకోవడం లేదు. అయితే ఆలస్యంగా.. లేదంటే కొన్ని రోజుల ముందుగా రీడింగ్‌ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వారం లేదా 10 రోజుల ముందే రీడింగ్‌ నమోదు చేసుకుంటున్నారు. ఇలా ముందుగా తీసుకున్న రీడింగ్‌కు కూడా పైన పేర్కొన్న విధానాన్నే పాటిస్తున్నా రు. ఉదాహరణకు ఒక మీటర్‌ రీడింగ్‌ను 28 రోజుల్లో తీసుకుంటే 95 యూనిట్ల వినియోగం నమోదైంది. 30 రోజుల వినియోగాన్ని అంచనా వేసి లెక్కిస్తే 101 యూనిట్లు అవుతుంది. దీంతో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆపై ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీలు విధిస్తున్నారు. రీడింగ్‌ నమోదులో జాప్యం జరిగితే శ్లాబులు మారి విద్యుత్‌ బిల్లులు పెరగకుండా కేవలం 30 రోజుల వినియోగాన్ని మాత్రమే అంచనా వేసి బిల్లులు జారీ చేయాలని ఈఆర్సీ ఆదేశిస్తే, రాష్ట్ర డిస్కంలు మాత్రం ముందస్తుగా తీసుకుంటున్న రీడింగ్‌లకు సైతం ఇదే సూత్రాన్ని వర్తింపజేస్తున్నా యి. దీంతో వినియోగదారులకు జారీ చేసే విద్యుత్‌ బిల్లుల డిమాండ్‌ నోటీసులో వినియోగం తక్కువ ఉన్నా చార్జీలు మాత్రం అనూహ్యంగా పెరిగిపోయి కనిపిస్తున్నాయి. 

ఒక యూనిట్‌.. రూ.151.8
ఒక వినియోగదారు 100 యూనిట్లు వాడితే.. తొలి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.1.45 చొప్పున (50 ్ఠ1.45), తర్వాతి 50 యూనిట్లకు యూనిట్‌కు రూ.2.30 చొప్పున (50 ్ఠ2.30) మొత్తం విద్యుత్‌ చార్జీ రూ.202.5 విధిస్తారు. ఒకవేళ 101 యూనిట్లు వాడితే.. అందులో తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, ఆ తర్వాతి ఒక యూనిట్‌కు రూ.4.30 చొప్పున చార్జీని విధిస్తారు. అప్పుడు 101 యూని ట్లకు బిల్లు రూ.334.3 అవుతుంది. తొలుత 100 యూనిట్లకు రూ.202.5 విధించగా.. 101 యూని ట్లకు మాత్రం బిల్లు రూ.334.3కు చేరుతోంది. అంటే  కేవలం ఒక యూనిట్‌ విద్యుత్‌ అధికంగా వాడడం వల్ల ఏకంగా రూ.131.8 అధికంగా చెల్లించాల్సి వస్తోంది. మరోవైపు వంద యూనిట్ల వరకు వినియో గదారుల చార్జీలు రూ.30, వంద నుంచి 200 యూనిట్ల వినియోగానికి రూ.50 చొప్పున విధిస్తారు. 100 యూనిట్లకు అదనంగా ఒక యూనిట్‌ వాడినా వినియోగదారుల చార్జీలు రూ.30 నుంచి రూ.50కు పెరిగిపోతాయి. దీంతో మొత్తంగా అదనంగా చెల్లిం చాల్సిన విద్యుత్‌ చార్జీలు రూ.151.8లకు పెరిగి పోతాయి.  అదే 201 యూనిట్లు వాడితే ఒక్కసారిగా రూ. 256.80 అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

పేద కుటుంబాల మధ్య చిచ్చు
విద్యుత్‌ బిల్లులు పేద, మధ్య తరగతి కుటుంబాల మధ్య చిచ్చు పెడుతున్నాయి. చాలా చోట్ల రెండు, మూడు పోర్షన్లకు ఒకే మీటర్‌ సదుపాయం ఉండగా, అందరి వినియోగం కలిపి అధిక ధరల శ్లాబులతో బిల్లులు జారీ అవుతున్నాయి. తక్కువ అద్దెతో ఒకటి రెండు గదుల ఇళ్లలో నివాసముండే వారు మరో రెండు మూడు కుటుంబాలతో కలిసి ఒకే విద్యుత్‌ మీటర్‌తో సరఫరా పొందుతున్నారు. ఒక్కో కుటుంబం 50 యూనిట్ల చొప్పునే వాడినా నాలుగు కుటుంబాలకు కలిపి మొత్తం 200 యూనిట్లకు గాను రూ.1,000 బిల్లు అవుతోంది. అదే వేర్వేరు మీటర్లు ఉంటే ఒక కుటుంబానికి రూ.72.50 బిల్లు మాత్రమే కానుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement