కోతలు మొదలు
Published Wed, Jan 29 2014 1:14 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
సాక్షి, రాజమండ్రి : వేసవికాలం రాకుండానే విద్యుత్ కోతలకు అధికారులు శ్రీకారం చుట్టారు. జిల్లాలో పెరుగుతున్న విద్యుత్ వినియోగాన్ని అదుపులో ఉంచడానికి తమదైన పంథాను అవలంబించారు. వాతావరణంలో శీతల పవనాలు తగ్గి క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో మంగళవారం జిల్లాలో విద్యుత్తు వినియోగం ఈ సీజన్‌లోనే రికార్డు స్థాయికి చేరింది. దీనికి కళ్లెం వేసేందుకు విద్యుత్తు సరఫరాలో కోతలు విధించారు. జిల్లావ్యాప్తంగా ఉదయం నుంచి రాత్రి వరకూ రెండు నుంచి మూడు గంటల పాటు కోతలు విధించి లోడ్ తగ్గించారు. మరోవంక 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్ధ్యం కలిగిన డొంకరాయి జల విద్యుత్తు కేంద్రంలో సాంకేతిక లోపాలు ఏర్పడడం కూడా విద్యుత్తు పంపిణీకి శరాఘాతమైందని ఏపీఈపీడీసీఎల్ లోడ్ మానిటరింగ్ విభాగం అధికారులు వెల్లడించారు.
కోతలు ఇలా..
రాజమండ్రి రూరల్, సిటీ, పాయకరావుపేట, రాజోలు ఫీడర్‌ల పరిధిలో ఉదయం రెండు గంటలు కోత విధించిన అధికారులు రాత్రి ఒక గంట పాటు సరఫరా నిలిపివేశారు. పెద్దాపురం, ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ సిటీ, రూరల్ ప్రాంతాల్లో ఉదయం మూడు గంటలు సరఫరా నిలుపుచేసిన అధికారులు సాయంత్రం మరో గంటసేపు ఆదా చేశారు. రామచంద్రపురం, కోనసీమ ప్రాంతాల్లో రెండున్నర గంటల నుంచి మూడు గంటలు కోతలు అమలు చేశారు.
లోడ్ పెరిగిందిలా...
జిల్లాలో సాధారణ రోజుల్లో గంటకు సగటున 220 నుంచి 240 మెగావాట్ల విద్యుత్తు వినియోగం ఉంటుంది. వానాకాలంలో ఉదయం, చలికాలంలో రాత్రి వినియోగం కొంత తగ్గుతుంది. ఈ కాలంలో వినియోగం 180 నుంచి 220 మెగావాట్లు ఉంటుంది. వేసవిలో ఈ వినియోగం సాయంత్రం 250 దాటి 290 వరకూ ఉంటుంది. కానీ మంగళవారం జిల్లాలో వినియోగం 290 మెగావాట్లకు చేరడంతో అధికారులు అంతకు మించి పెరగకుండా నియంత్రించే ప్రయత్నం చేశారు. ఫలితంగా ప్రజలు కోతలను చవిచూడాల్సి వచ్చింది.
Advertisement
Advertisement