కరెంటుకు సమ్మె షాక్
సాక్షి, రాజమండ్రి :అసలే విద్యుత్ కోతలతో సతమతమవుతున్న వినియోగదారులకు ఆ శాఖ ఉద్యోగుల సమ్మెతో పుండు మీద కారం జల్లినట్టైంది. ఆదివారం ఉదయం నుంచీ జిల్లావ్యాప్తంగా విద్యుత్తు ఉద్యోగులందరూ మెరుపు సమ్మెకు దిగడంతో ప్రజల కరెంటు కష్టాలు రెట్టింపయ్యాయి. సాయంత్రం జిల్లావ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయాలు అధికమయ్యాయి. తలెత్తుతున్న సమస్యలను ఈపీడీసీఎల్ అధికారులు తాత్కాలిక సిబ్బందితో పరిష్కరించగలిగినా సరఫరా లోటును అధిగమించలేక తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో సుమారు 1700 మందికి పైగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెకు పూనుకున్నారు. ఈ ప్రభావం 140కి పైగా సబ్‌స్టేషన్ల పరి ధిలో విద్యుత్ పంపిణీపై పడింది. గ్రామాల్లో విద్యుత్తు సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. ఇంజనీర్లు కాంట్రాక్టు సిబ్బంది సహకారంతో సరఫరాను పునరుద్ధరించడానికి పగలు ప్రయత్నించినా సాయంత్రానికి చేతులెత్తేశారు.
జెన్‌కో సిబ్బంది కూడా సమ్మెలో ఉండడంతో రాష్ట్రవ్యాప్తంగా సాయంత్రానికి 800 మెగావాట్ల విద్యుత్ కొరత ఏర్పడ్డట్టు అధికారులు వెల్లడించారు. జెన్‌కో డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో 25 మెగావాట్ల విద్యుదుత్పత్తి నిలిచిపోయింది. ఈ ప్రభావం మధ్యాహ్నం నుంచి జిల్లాపై కూడా పడింది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో రాత్రి ఏడు గంటల నుంచి మూడు గంటలపాటు కోత విధించారు. అమలాపురం, రాజోలు, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట తదితర ప్రాంతాల్లో సాయంత్రం నాలుగు గంటల నుంచి మూడు గంటల పాటు సరఫరా నిలిపి వేశారు.పరిశ్రమలకు సరఫరా బంద్‌విద్యుత్ కొరత మరింత పెరిగే అవకాశాలుండడంతో ఈపీడీసీఎల్ అధికారులు జిల్లాలోని పరిశ్రమలకు సాయంత్రం ఆరుగంటల నుంచి పూర్తిగా సరఫరా నిలిపివేశారు. ఉత్పత్తి గాడిలో పడేవరకూ పరిశ్రమలకు సరఫరా పునరుద్ధరించకూడదని నిర్ణయించారు. సిబ్బంది సమ్మె ప్రభావం గృహ వినియోగదారులపై పడకుండా జాగ్రత పడుతున్నామని ఈపీడీసీఎల్ రాజమండ్రి సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీరు గంగాధర్ చెప్పారు.
వైఎస్సార్ సీపీ అనుబంధ సంఘం దూరం
కాగా సమ్మెకు వైఎసా్సర్ కాంగ్రెస్ విద్యుత్ ఉద్యోగుల సంఘం దూరంగా ఉంది. మిగిలిన యూనియన్లు సమ్మె విషయంలో తమను కలుపుకొనిపోకుండా ఒంటెత్తు పోకడలతో వ్యవహరించడమే అందుకు కారణమని యూనియన్ ప్రతినిధి ప్రభాకర్ నాయుడు చెప్పారు. ఆ సంఘం సభ్యులు విధులకు హాజరై అత్యవసర పనులను నిర్వర్తిస్తున్నారు. దాంతో సమ్మె తొలిరోజు అధికారులు కాస్త ఊపిరి పీల్చుకోగలిగారు.
సమ్మెలో జెన్‌కో సిబ్బంది
వై.రామవరం, న్యూస్‌లైన్ : వేతన సవరణ వంటి డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ డొంకరాయిలోని ఏపీ జెన్‌కో జలవిద్యుత్ కేంద్రం సిబ్బంది సమ్మె చేస్తున్నారు. ఆదివారం సుమారు వందమంది సిబ్బంది విధులను బహిష్కరించారు. ఇద్దరు అధికారులు మాత్రమే జలవిద్యుత్ కేంద్రంలో విధులు నిర్వర్తిస్తున్నట్టు సమాచారం. కాగా ఆదివారం రాత్రి తమ రాష్ట్ర యూనియన్ నాయకులు ప్రభుత్వంతో నిర్వహిస్తున్న చర్చలు సఫలం కాకపోతే సోమవారం నుంచి సమ్మెను ఉధృతం చేస్తామని సిబ్బంది హెచ్చరించారు.