బోరు నడవదు..చేను తడవదు
సాక్షి, రాజమండ్రి :తొలకరించాల్సిన తరుణం వచ్చి రెండు వారాలైనా వర్షాలు ముఖం చాటేస్తున్న సమయంలో జిల్లాలో మెట్ట రైతులకు విద్యుత్తే శరణ్యం. అయితే ఈ ఏడాది కరెంటు రైతన్నను నట్టేట ముంచేసే సూచనలు కనిపిస్తున్నాయి. అర్ధరాత్రో, అపరాత్రో; రెండు దఫాలో, మూడు దఫాలో ఇచ్చే కరెంటు ఏడు గంటలైనా పూర్తిగా ఇస్తే రెండెకరాల్లో వేసే పంటను ఎకరాకు తగ్గించుకునైనా సాగుకు సిద్ధం కావాలనుకుంటున్న రైతన్నకు విద్యుత్ సరఫరా తీరు ఆందోళన కలిగిస్తోంది.
ఎక్కువిస్తే అయిదు గంటలు..
జిల్లాలో రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, రామచంద్రపురం, జగ్గంపేట విద్యుత్తు డివిజన్‌లున్నాయి. వీటి పరిధిలోని 261 వ్యవసాయ ఫీడర్లపై సుమారు 42 వేల వ్యవసాయ కనెక్షన్లున్నాయి. వీటిని ఎ, బి, సి గ్రూపులుగా విభజించి పగటి పూట ఉదయం 05.00 గంటల నుంచి 10.00 గంటలలోపు ఐదు గంటలు, రాత్రి 11.00 గంటల నుంచి తెల్లవారు జామున మూడు గంటల మధ్య రెండు గంటలు సరఫరా చేసేందుకు అధికారులు షెడ్యూలు రూపొందించారు. అయితే ఎక్కడా ఐదు గంటలకు మించి సరఫరా చేయలేకపోతున్నారు. కొన్ని ప్రాంతాల్లో సరఫరా బొత్తిగా నాలుగు గంటలకే పరిమితమవుతోంది. అది కూడా రెండు, మూడు దఫాలుగా అందుతుండడంతో బోర్లలోంచి వచ్చిన నీరు పొలం తడపడానికి ఎంత మాత్రం సరిపోవడం లేదు. ఎండలు మండిపడుతుండడంతో ఉదయం తోడిన నీరు సాయంత్రానికి ఆవిరై పొలాలు బీళ్లుగా మారిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.
సరఫరా అరకొరే..
ఖరీఫ్‌లో రైతులకు ఏడు గంటలు విద్యుత్తు పంపిణీ చేయాలంటే జిల్లాకు ఇస్తున్న సరఫరా రెట్టింపు కావాల్సి ఉందని అధికారులు అంటున్నారు. జిల్లాలో వివిధ వినియోగాలకు రోజూ 405 నుంచి 510 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుండగా కేవలం 250 మెగావాట్లు మాత్రమే సరఫరా అవుతోంది. ఈ సరఫరాను గృహ వినియోగానికి, వ్యాపార సంస్థలకు, పరిశ్రమలకు పంపిణీ చేస్తూ వ్యవసాయానికి కూడా పూర్తిస్థాయిలో అందచేయాలంటే తమ వల్ల కాదంటున్నారు అధికారులు. ప్రస్తుతం వ్యవసాయానికి ఇచ్చే ఐదు గంటల విద్యుత్తును కూడా అతికష్టం పైనే ఇస్తున్నామంటున్నారు.
రైతుల ఆశకు అశనిపాతం..
ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 6.50 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయనున్నారు. వీటిలో 5.48 లక్షల ఎకరాల్లో వరి సాగవనుంది. మొత్తం వరి విస్తీర్ణంలో 4.80 లక్షల ఎకరాలు డెల్టా ప్రాంతంలో ఉండగా లక్ష ఎకరాలు మెట్ట ప్రాంతంలో ఉన్నాయి. ఇతర పంటల్లో కూడా సుమారు 50 వేల ఎకరాలు మెట్టలో సాగవుతున్నాయి. మెట్టలో 1.50 లక్షల ఎకరాల సాగూ పూర్తిగా వర్షాధారమే. ప్రస్తుతం వర్షాల రాక ఆలస్యం అ వుతుండడంతో సుమారు 50 వేల నుంచి 60 వేల ఎకరాల్లో కేవలం వి ద్యుత్ బోర్ల ఆధారంగా సాగుకు శ్రీ కారం చుట్టాలని రైతులు ఆశిస్తున్నా రు. ఈ తరుణంలో పీడిస్తున్న కరెం టు కొరత వారి ఆశకు అశనిపాతం లా మారింది. పొలాలను సాగుకు సిద్ధం చేయాలా, మానాలా అన్న సందిగ్ధంలోకి నెట్టింది.