పంట అమ్ముకున్నా చేతికందని డబ్బులు
చేవెళ్ల నుంచి చిలుకూరి అయ్యప్ప : రైతుల ఆరుగాల కష్టార్జితం బ్యాంకుల్లో చిక్కుకుంది. ఖరీఫ్ పంటలు అమ్ముకున్నా అన్నదాత చేతికి చిల్లిగవ్వ రాలేదు. బ్యాంకుల్లో చెక్కులను విడిపించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఖాతాల నుంచి వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చని ఆర్‌బీఐ చెప్పినా ఎక్కడా అమలవడం లేదు. నగదు కొరతతో బ్యాంకులు రోజుకు రూ.2 వేలు, రూ.4 వేలతో సరిపెడుతున్నాయి. దీంతో రైతులు చెక్కుల్లోని తమ డబ్బును విడిపించు కునేందుకు ప్రతిరోజూ పొలం పనులు మానుకొని బ్యాంకుల ముందు బారులు తీరుతున్నారు. రైతుల కరెన్సీ కష్టాలను తెలుసుకునేందుకు రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని ఆలూరు గ్రామాన్ని ‘సాక్షి’ పరిశీలించింది. ఇక్కడ రైతులంతా నగదు కోసం నానా అగచాట్లు పడుతున్నట్టు స్పష్టమైంది. వరుసగా మూడేళ్లు కరువుతో కుదేలైన రైతులకు ప్రభుత్వం నుంచి ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. పంట బీమా సైతం రాలేదు. ఖరీఫ్ కాస్త ఊరటనిచ్చింది అనుకున్న తరుణంలో... ఇప్పడు పెద్దనోట్ల రద్దు వారిని ఇబ్బందులకు గురిచేస్తోంది.
గ్రామంలో ఇదీ పరిస్థితి..
ఆలూరు గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు ఐదు వందల రైతు కుటుంబాలు ఉన్నాయి. మెట్టపంటలు, కూరగాయల సాగులో పేరున్న గ్రామమిది. గత ఖరీఫ్‌లో గ్రామానికి చెందిన రైతులు సుమారు 2 వేల ఎకరాల్లో మొక్కజొన్న పంట వేశారు. దాదాపు 26,500 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. వీటిని గ్రామంలోని ముగ్గురు ప్రైవేటు వ్యాపారులు, చేవెళ్ల కేంద్రంలో ఉన్న మరో ఇద్దరు వ్యాపారులకు విక్రయించారు. రూ.3.5 కోట్ల చెల్లింపులు చేయాల్సి ఉండగా.. ఇందులో 3.2 కోట్లు కేవలం చెక్కుల రూపంలోనే ఇచ్చినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఈ మొత్తాన్ని బ్యాంకుల్లో జమచేసిన రైతులు... ఈ నిధులను వెనక్కు తీసుకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజూ ఆలూరులోని బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.
కూలీలకు చెల్లింపులు ఎలా?
కూలీల చెల్లింపులకు కూడా రైతుల చేతిలో డబ్బుల్లేవు. ఆలూరులో చాలామంది రైతులు ధాన్యం విక్రయించిన తర్వాత చెల్లింపులు చేద్దామని భావించారు. ఇప్పుడు బ్యాంకుల ముందు రోజంతా నిలబడి కొంత మొత్తం తీసుకుంటూ కూలీలకు ఇచ్చి మాటదక్కించుకుంటున్నారు. ఎకరా విస్తీర్ణంలో రూ.10 వేలు ఖర్చుచేసి మొక్కజొన్న సాగుచేసిన శ్రీనివాస్ అనే రైతును వర్షాభావ పరిస్థితులు దారుణంగా దెబ్బతీశాయి. ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవడంతో చివరకు ఐదు క్వింటాళ్ల దిగుబడి దక్కింది. గ్రామంలోని ప్రైవేటు వ్యాపారికి పదిరోజుల క్రితం మక్కల్ని విక్రయించగా... రావాల్సిన రూ.6 వేలను నగదు రూపంలో ఇవ్వాలని కోరాడు. కానీ నోట్ల సమస్యతో సదరు వ్యాపారి ఇప్పటికీ ఇవ్వకపోవడంతో ఆ రైతు దిక్కుతోచని స్థితిలో పడిపోయాడు.
మరోవైపు మార్కెట్లో నెలకొన్న నగదు సమస్యతో వ్యవసాయ దిగుబడుల ధరలు సైతం పతనమయ్యాయి. గిరాకీ లేదనే సాకుతో వ్యాపారులు మధ్యవర్తుల నుంచి తక్కువ ధరకే ఉత్పత్తులను కొనుగోలు చేస్తుండడంతో రైతు మరింత నష్టపోతున్నాడు. దీనికి తోడు రబీ సీజన్లో వర్షాల జాడ లేకుండా పోయాయి. పంటలు సాగుచేస్తే దిగుబడులు చేతికొస్తాయా అన్న సందేహం రైతన్నను వెంటాడుతోంది. రబీ పెట్టుబడులకు అవసరమైన నిధులు రాబట్టుకోవాలంటే మరికొన్ని రోజులు బ్యాంకుల ముందు క్యూ లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉంది. వెరిసి ఆలూరులో మెజారిటీ రైతులు సాగుకు దూరంగా ఉంటున్నారు. కూరగాయల సాగుకు సైతం ఆసక్తి చూపడం లేదు.
‘ఆసరా’ కోసం ఎదురుచూపులు
ఆలూరులో 3 వందల మంది ఆసరా పెన్షనర్లున్నారు. వీరిలో కేవలం 50 మందికి మాత్రమే ఇప్పటివరకు పింఛన్ డబ్బులు అందించారు. మిగతా లబ్ధిదారులు ప్రతి రోజూ పంచాయతీ వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 9 గంటల ప్రాంతంలో పంచాయతీ కార్యాలయానికి చేరుకుని వయోవృద్ధులంతా పింఛన్ డబ్బుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో నగదు పంపిణీ లేదని గ్రామ పంచాయతీ సిబ్బంది చెప్పడంతో నిరాశతో ఇంటికి వెళ్తున్నారు. గత పదిరోజులుగా పంచాయతీ వద్ద ఇదే పరిస్థితి నెలకొంది. రెండు నెలలుగా పింఛన్ డబ్బులు ఇవ్వలేదని వితంతు పెన్షనర్ చెన్‌వెల్లి బాలమ్మ ఆందోళన వ్యక్తం చేశారు.
సాగు చేయలేను
ఈమె పేరు బేగరి వెంకటమ్మ. ఆలూరుకు చెందిన ఈ మహిళా రైతు తనకున్న పొలాన్ని వారసులకు పంచివ్వగా మూడెకరాలు మిగిలింది. భర్తతో కలసి వ్యవసాయం చేసుకుని జీవిస్తోంది. ఖరీఫ్‌లో రెండెకరాల్లో మొక్కజొన్న పంట వేస్తే 20 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రైవేటు వ్యాపారికి అమ్మితే పాతనోట్లు ఇస్తానని, లేకుంటే చెక్కు ఇస్తానని చెప్పప్పాడు. భర్త అనారోగ్యంతో మంచం పట్టడం, చికిత్సకు డబ్బులు లేకపోవడం, బ్యాంకుల ముందు గంటల తరబడి నిలబడే ఓపిక లేకపోవడంతో చెల్లుబాటు అయ్యే నోట్లే ఇవ్వాలని కోరగా.. ఆ వ్యాపారి నెలరోజులు ఆగాలని చెప్పాడు. ఇప్పటికే 15 రోజులు గడిచాయి. మరో 15 రోజులు ఎప్పుడు గడుస్తాయా అని వెంకటమ్మ ఎదురుచూస్తోంది. చేతిలో డబ్బుల్లేక యాసంగిలో పంటసాగు చేయనని చెబుతోంది.
రూ.2 వేలే ఇస్తున్నారు
వారానికి రూ.24 వేలు తీసుకోవచ్చని ప్రభుత్వం చెప్తుంటే బ్యాంకులో మాత్రం రూ.2 వేలే ఇస్తున్నారు. దీంతో రోజూ బ్యాంకు చుట్టూ తిరగాల్సి వస్తుంది. పైసలు లేకపోవడంతో రబీ సీజన్ల పంటలు వేసే పరిస్థితి లేదు. ఈ సీజన్లో కొత్తగా బ్యాంకు లోన్ రాలేదు. పాత బాకీనే రెన్యువల్ చేశారు.
ఉప్లూర్ గంగారెడ్డి, రైతు, మోర్తాడ్, నిజామాబాద్ జిల్లా
అరువుపైనే ఎరువులు
నోట్ల సమస్యతో బాగా ఇబ్బందిగా ఉంది. పైసల్లేక ఎరువులను దుకాణంలో ఉద్దెర తీసుకొచ్చినం. బయట అప్పు పుడ్తలేదు. దుక్కులు దున్నేందుకు ట్రాక్టర్ కిరాయి తర్వాత ఇస్తానని చెప్పా. పంట అమ్మితే వచ్చిన డబ్బులు బ్యాంకులో వేశాం. వాటిని తీసుకోవడానికి ప్రతిరోజు బ్యాంకుకు రావాల్సి వస్తోంది. మా ఊరినుంచి అడ్డాకుల ఎస్‌బీఐ బ్యాంకు 6 కిలోమీటర్ల దూరంలో ఉంది. రోజు కిరాయి పెట్టుకుని వెళ్తున్నా.
బండలయ్య, తిమ్మాయిపల్లి,అడ్డాకుల మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
చాయ్ తాగనీకీ పైసల్లేవు..
పంటకోత పనులకు వచ్చిన కూలీలకు పది రోజుల తర్వాత పైసలు ఇస్తానని చెప్పా. నా దగ్గర చాయ్ తాగనీకీ పైసల్లేవు. ఇంట్లో సరుకులకోసం అప్పు చేశా. పంట అమ్మితే ఇప్పటివరకు సేటు పైసలివ్వలేదు. పాతనోట్లు ఇస్తానంటే నేనే తీసుకోలేదు. గార వెంకటేశ్వర్లు, ఏటూరు నాగారం, వరంగల్
రైతన్న ఆరుగాల కష్టార్జితం బ్యాంకులో బందీ!
Published Sun, Dec 18 2016 2:35 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
Advertisement
Advertisement