‘కట్’కటా!
♦ జిల్లాలో అనధికారిక విద్యుత్ కోతలు
♦ షెడ్యూలు ప్రకటించకుండా ఎడాపెడా షాక్!
♦ జిల్లా కేంద్రం మినహా అంతటా ఇదే పరిస్థితి
♦ శనివారం 8 గంటలకు పైగా సరఫరా నిలిపివేత
♦ తుస్సుమన్న 24గంటల విద్యుత్ హామీ
కర్నూలు(రాజ్‌విహార్) : జిల్లా వ్యాప్తంగా ప్రజలను కరెంటు కోతలు ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఉత్పత్తి కేంద్రాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్య, నిర్వాహణ పనుల కారణంగా నాలుగు రోజుల క్రితం ప్రారంభమైన ఈసమస్య తీవ్రమవుతోంది. వినియోగదారుల అవసరాలకు సరిపడా విద్యుత్ రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ప్రాజెక్టుల్లో నీటి కొరత, థర్మల్ పవర్ ప్లాంట్లలో సాంకేతిక సమస్య ఏర్పడడంతో లోటు ఏర్పడిందని విద్యుత్ అధికారుల చెబుతున్నారు. దీంతో కోతలు అనివార్యమయ్యాయి.
ఎమర్జేన్సీ లోడ్ రిలీఫ్ పేరుతో నాలుగు రోజులుగా కోతలు విధిస్తున్నారు. వేళలు (షెడ్యూల్) ప్రకటించకపోవడంతో కరెంటు ఎప్పుడు ఉంటుందో.. ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. లోటు కారణంగా శనివారం ఎమినిది గంటలకు పైగా సరఫరా నిలిపివేశారు. ఉదయం నుంచే అన్ని డివి జన్లల్లో విడతల వారీగా కోతలు మొద లు పెట్టారు. తిరుపతిలోని ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు చేపట్టిన కోతలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి.
సరఫరా .. వినియోగం మధ్య పెరుగుతున్న అంతరం
సరఫరాకు వినియోగదానికి మధ్య అగాధం పెరిగిపోవడంతో ఎమర్జేన్సీ లోడ్ రిలీఫ్ కింద కోతలు విధించాలని తిరుపతిలోని లోడ్ మానిటరింగ్, డిస్‌ప్యాచ్ సెంటర్ నుంచి ఆదేశాలు జారీ చేశారు. జిల్లా అవసరాలకు రోజుకు కోటి యూనిట్ల విద్యుత్ అవసరం కాగా కేవలం 80లక్షల యూనిట్లలోపు సరఫరా అవుతోంది. ఇందులో మరో 14లక్షల యూనిట్లు లైన్‌లాస్ కింద పోతోంది. ఫ్రిక్వేన్సీ కూడా 49 కంటే తక్కువగా పడిపోయింది. సాయంత్ర 6గంటల నుంచి కేవలం లైటింగ్ వినియోగం తప్ప పరిశ్రమలు, రైతుల వ్యవసాయానికి, ఇతర అవసరాలకు బ్రేక్ పెట్టారు. కర్నూలు నగరం మినహా మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో కోతలు తీవ్రంగా వేధిస్తున్నాయి.
24గంటల విద్యుత్ హామీ గాలికి..
అధికారంలోకి వస్తే గ్రామీణ ప్రాంతాలకు సైతం నిరంతరం విద్యుత్ సరఫరా అందిస్తామని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ గాలిలో కలిసిపోయింది. ఆయన అధికారంలోకి వచ్చాక వెంటనే అమలు చేయకుండా 2015 ఫిబ్రవరి నుంచి అమల్లోకి తెచ్చారు. అయితే లోటు కారణంగా కోతలు అనివార్యంగా మారాయి.
కృష్ణపట్నం ఎఫెక్ట్:
నాలుగు రోజుల క్రితం కృష్ణపట్నం పవర్ ప్లాంట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్య కారణంగా విద్యుదుత్పత్తి 800 మెగావాట్లకు తగ్గిపోయింది. ఇతర థర్మల్ పవర్ ప్లాంట్లలో కూడా 500 మెగావాట్ల విద్యుత్‌కు గండి పడింది. ఫలితంగా అధికారులు వినియోగదారులకు వాతలు పెడుతున్నారు.
విద్యుత్ కోతలపై రైతుల ఆందోళన
ఎమ్మిగనూరు టౌన్ : ఎడా పెడా విధిస్తున్న కోతలపై రైతుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఎమ్మిగనూరు పట్టణ శివారులోని రైతులు ఆదివారం మూకుమ్మడిగా విద్యుత్ సబ్‌స్టేషన్ వద్దకు చేరుకొని ఏడీఈ సుబ్రమణ్యంతో వాగ్వాదానికి దిగారు. 10రోజులుగా పరిస్థితి ఇలాగే ఉందని, విద్యుత్ సరఫరాపై ఆరా తీసేందుకు సబ్‌స్టేషన్‌కు ఫోన్ చేస్తే ఎవరూ లిఫ్ట్ చేయడంలేదని ఆరోపించారు. కరెంటు ఇవ్వలేమని ముందుగానే చెప్పి ఉంటే తాము పంటలు వేసుకునేవాళ్లం కాదుకదా అని ధ్వజమెత్తారు.
ప్రకటించిన మేరకు కనీసం రోజుకు 7గంటలైనా సరఫరా చేయకపోతే పంటలు నష్టపోక తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. పై నుంచే విద్యుత్ సక్రమంగా సరఫరా కావడంలేదని ఏడీఈ సర్ధిచెప్పారు. రెండు మూడు రోజులు ఇదే పరిస్థితి ఉంటుందని, సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏడీఈని కలిసిన వారిలో రైతులు హమీమ్‌బాషా, నాగరాజు, చంద్ర, తదితరులు ఉన్నారు.