విద్యుత్ శాఖలో బదిలీలు
రాజమహేంద్రవరం ఆపరేషన్ డీఈగా రాజబాబు
కన్‌స్ట్రక్షన్ డీఈగా శ్యాంబాబు బదిలీ
ట్రాన్స్‌ఫార్మర్ డీఈగా సాల్మన్‌రాజు
సాక్షి, రాజమహేంద్రవరం : ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో బదిలీలు ముగిశాయి. డీఈ, ఏడీఈ, ఏఈ, పరిపాలన, అకౌంట్స్ తదితర విభాగాలకు చెందిన ఉద్యోగులను బదిలీ చేస్తూ ఈపీడీసీఎల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎం.నాయక్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజమహేంద్రవరం సర్కిల్‌లో రాజమహేంద్రవరం డివిజన్ ఆపరేషన్ డీఈగా ఉన్న జి.శ్యాంబాబును అదే డివిజన్ కన్‌స్ట్రక్షన్ డీఈగా బదిలీ చేశారు. ఆ స్థానంలో అదే డివిజన్‌లో కన్‌స్ట్రక్షన్ డీఈగా పనిచేస్తున్న ఎస్.రాజబాబును నియమించారు. రాజమహేంద్రవరం డివిజన్ ట్రాన్స్‌ఫార్మర్ డీఈగా ఇప్పటి వరకు జంగారెడ్డిగూడెం ఆపరేషన్ డీఈ పనిచేసిన సోల్మన్‌రాజును నియమించారు. రాజమహేంద్రవరం డివిజన్ ట్రాన్స్‌ఫార్మర్ డీఈగా ఉన్న ఎ.రవికుమార్‌ను జంగారెడ్డిగూడెం ఆపరేషన్ డీఈగా పంపారు. విశాఖపట్నం కార్పొరేట్ కార్యాలయం కమర్షియల్ విభాగంలో ఏడీఈగా ఉన్న కె.రాంబాబును కొత్తపేట ఆపరేషన్ ఏడీఈగా బదిలీ చేశారు. ఈ స్థానంలో పని చేస్తున్న వై.డేవిడ్‌ను అమలాపురం సబ్‌డివిజన్ కన్‌స్ట్రక్షన్ ఏడీఈగా నియమించారు. వీరితో పాటు రాజమహేంద్రవరం సర్కిల్‌లో 11 మంది ఏఈలను, 8 మంది జూనియర్ అకౌంట్ ఆఫీషర్స్‌తోపాటు వివిధ విభాగాల అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బందిని బదిలీ చేశారు.