క్యాలెండర్లు ఆవిష్కరిస్తున్న పెద్దిరెడ్డి, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర విద్యుత్ రంగం ప్రగతి బాటలో పయనిస్తోందని ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. చేసిన పనులు, సాధించిన ఫలితాలు, అవార్డులే ఇందుకు నిదర్శనమన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్, ఏపీఎస్‌ఈసీఎం సంస్థలకు సంబంధించిన డైరీలు, క్యాలెండర్లను మంత్రి పెద్దిరెడ్డి బుధవారం విజయవాడలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర పురోగాభివృద్ధి విద్యుత్ రంగంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. 99 శాతం మంచి చేసి, ఎక్కడో ఒక శాతం పొరపాటు జరిగితే దానినే పనిగట్టుకొని కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నామని మంత్రి ఉద్ఘాటించారు.
విద్యుత్ సమర్థ వినియోగానికి సంబంధించి రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌కు రాష్ట్రపతి అవార్డుతో పాటు, ఏపీ ట్రాన్స్‌కో, డిస్కం, నెడ్‌కాప్‌లకు జాతీయ అవార్డులు రావడం రాష్ట్రానికి గర్వకారణమన్నారు. పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులు అందుబాటులోకి వస్తే రాష్ట్ర వినియోగానికి పోగా.. మిగిలిన మొత్తాన్ని ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తామన్నారు. వచ్చే మార్చిలో ఆర్టీపీఎస్ 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు.
ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిశీలించి ప్రభుత్వం తప్పకుండా పరిష్కరిస్తుందని మంత్రి ప్రకటించారు. కార్యక్రమంలో ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఉన్నతాధికారులు బి.శ్రీధర్, మల్లారెడ్డి, పద్మా జనార్దన్‌రెడ్డి, సంతోష్‌రావు, రమణారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ్లైయాష్ ఉత్పత్తిదారులు, వినియోగదారుల కోసం పోర్టల్
రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని పర్యావరణ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. విజయవాడలోని ఏపీ ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీ(పర్యావరణం) నీరబ్‌కుమార్ ప్రసాద్, కార్పొరేషన్ ఎండీ ఖజూరియా, చైర్మన్ గుబ్బా చంద్రశేఖర్‌తో కలిసి బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు. కాలుష్య కారక వ్యర్థాల నిర్వహణకు ఏర్పాటు చేసిన పోర్టల్‌ను మంత్రి ప్రారంభించారు.
Comments
Please login to add a commentAdd a comment