సోలార్ పంపుసెట్లు వాడండి
- రైతులకు ఏపీఈపీడీసీఎల్ ఏడీఈ సూచన
- సోలార్ పంపుసెట్లపై రైతులకు అవగాహన సదస్సు
రాజానగరం: విద్యుత్ కోతలతో ఇబ్బందులు పడుతున్న రైతులు ఆ సమస్య నుంచి గట్టెక్కేందుకు సోలార్ పంపుసెట్లను వినియోగించుకోవడం మంచిదని ఏపీ ఈపీడీసీఎల్ రాజమండ్రి డివిజన్ ఏడీఈ జేపీబీ నటరాజన్ అన్నారు. స్థానిక విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద నెడ్ క్యాప్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. సోలార్ పంపు సెట్ల వినియోగంపై ఆసక్తి ఉన్న రైతులు విద్యుత్ శాఖ అధికారులను కలిసి తమ పేర్లను నమోదు చేయించుకోవాలని నటరాజన్ సూచించారు. వారికి 30 శాతం సబ్సిడీతో వ్యవసాయ పంపు సెట్లకు సోలార్ పరికరాలను అమరుస్తామన్నారు.
నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ నానిబాబు మాట్లాడుతూ సూర్యరశ్మి నుంచి వచ్చే విద్యుత్‌తో వ్యవసాయ మోటార్లు పనిచేసే ప్రక్రియకు హార్స్‌పవర్‌ని బట్టి ధర ఉంటుందని తెలిపారు. 1.5 హెచ్‌పీ మోటారుకు రూ. 2 లక్షల 28 వేలు, 2 హెచ్‌పీ మోటారుకు రూ. 3 లక్షల 42 వేలు, 3 హెచ్‌పీ మోటారుకు రూ. 5 లక్షల 70 వేలు, 5 హెచ్‌పీ మోటారుకు రూ. 9 లక్షల 12 వేలు వ్యయం అవుతుందన్నారు. ఈ మొత్తంలో 30 శాతం సబ్సిడీగా ఉంటుందన్నారు. ఈ పంపు సెట్లకు బోరు లోతును, మోటారు సామర్థ్యాన్ని బట్టి నీటిని సులువుగా తోడేందుకు అవసరమైన ప్యానల్స్‌ను ఏర్పాటు చేస్తారన్నారు.
విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాలతోపాటు విద్యుత్ సరఫరా లేని సమయంలోను ఈ విధానాన్ని ఉపయోగించవచ్చన్నారు. సోలార్ పంపు సెట్టును డీసీ లేదా ఏసీ ఇండక్షన్ మోటార్స్‌తో కూడా ఉపయోగించవచ్చన్నారు. సోలార్ ప్యానల్స్‌ను వీఎఫ్‌డీ అనే పరికరాల సాయంతో ప్రస్తుతం రైతులు వినియోగిస్తున్న మోటారుతో అనుసంధానం చేయవచ్చన్నారు. దీని నిర్వహణకు ఎటువంటి అనుభవమూ అవసరం లేదన్నారు.
20 సంవత్సరాల గ్యారంటీతో సోలార్ పంపు సెట్లను రైతులకు అందజేస్తున్నామని నెడ్ క్యాప్ జిల్లా మేనేజర్ నానిబాబు తెలిపారు. సోలార్ ప్యానల్స్ ద్వారా పంపు సెట్‌ను వాడటం వలన మోటారు జీవిత కాలం కూడా పెరుగుతుందన్నారు. ఇలా తరగతిలో బోధన చేసినట్టుగా కాకుండా ప్రాక్టికల్‌గా సోలార్ పంపు సెట్ల పని విధానాన్ని తెలియజేస్తే బాగుంటుందని రైతులు సూచించారు. రాజానగరం, సంపత్‌నగరం విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏఈలు సుబ్రహ్మణ్యం, మదర్స్‌షా పాల్గొన్నారు.