కాంట్రాక్టర్‌ మాయాజాలం | EPDCL Employees Complaint on Contractor Corruption | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్‌ మాయాజాలం

Published Tue, Jul 23 2019 1:14 PM | Last Updated on Tue, Aug 20 2019 12:42 PM

EPDCL Employees Complaint on Contractor Corruption - Sakshi

కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న ఈపీడీసీఎల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు

ఎన్‌ఏడీ జంక్షన్‌ (విశాఖ పశ్చిమ):  ఏపీఈపీడీసీఎల్‌లో ఆయనో మానవ వనరులను సరఫరా చేసే కాంట్రాక్టర్‌.. 2014 వరకు సాధారణ వ్యక్తి.. టీడీపీ ప్రభుత్వం అధికారం చేపట్టాక ట్రాన్స్‌కోలో చక్రం తిప్పాడు. అప్పటి మంత్రులు ఎమ్మెల్యేలను పట్టుకుని ఉన్నతాధికారుల్ని వలలో వేసుకున్నాడు. నూతనంగా ఏర్పాటు చేసే సబ్‌స్టేషన్లలో ఉద్యోగాలు వేయిస్తానని ఉద్యోగ స్థాయిని బట్టి రూ.5లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి అవకతవకలు వెలుగులోకి రావడంతో పశ్చిమగోదావరి జిల్లాలో ఇతని కాంట్రాక్టు రద్దు చేసి బ్లాక్‌ లిస్టులో పెట్టారు. ఉద్యోగుల ‘స్పందన’లో శుక్రవారం బాధితులు జిల్లా కలెక్టర్‌ వినయ్‌ చంద్‌కు వినతి పత్రాన్ని అందజేయడంతో  ఇది చర్చనీయాంశమైంది. ఒక కాంట్రాక్టర్‌ వల్ల తాము ఏ విధంగా ఇబ్బందులు పటుతున్నదీ వారు జిల్లా ఉన్నతాధికారి వద్ద వాపోయారు. వివరాల్లోకి వెళితే ...ఎన్‌.స్వామినాయుడు ఎంఎస్‌ సాయి మణికంఠ ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్‌. 2012 వరకు విద్యుత్‌ రంగ సంస్థలో ఏపీ ట్రాన్స్‌కో 139/33 కేవీ డీజీఎన్‌పీ(చావుల మదుం సమీపంలో ఉన్న) సబ్‌ స్టేషన్‌లో సబ్‌ ఇంజినీర్‌(హైస్కిల్డ్‌)గా పార్ట్‌టైం సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. ఆ తరువాత ఉద్యోగం మానేసి రాజస్థాన్‌ యూనివర్సిటీ నుంచి ఎలక్ట్రికల్‌ డిప్లమా సర్టిఫికెట్‌ సంపాదించి కాంట్రాక్టర్‌ అవతార మెత్తాడు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 2014 నుంచి అప్పటి మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు అండతో ఏపీఈపీడీసీఎల్‌లో చక్రం తిప్పాడు. అప్పట్లో అవుట్‌ సోర్సింగ్‌లో పనిచేసే వారిని పర్మినెంట్‌ చేసేవారు. ఖాళీ అయిన స్థానాల్లో అవుట్‌ సోర్సింగ్‌లో కొత్తవారిని నియమించేవారు. ఈమేరకు ఉద్యోగాలు వేయించేందుకు భారీగా వసూళ్లకు పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగానికి సుమారు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేశాడు. ఇలా విజయనగరం జిల్లాలో 200 ఖాళీలను భర్తీ చేశాడని చెబుతున్నారు. విశాఖ జిల్లాలోనూ ఇదే పరిస్థితి అని చెప్పుకుంటున్నారు. అప్పట్లో ట్రాన్స్‌కో, ఏపీఈపీడీసీఎల్‌ సంస్థల్లో కొందరు అధికారుల సహకారంతో రూ.వందల కోట్లు ఆర్జించాడని బాహటంగానే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలకు వాటాలు వెళ్లాయనే వాదన ఉంది.

కారుణ్యం లేదు...
జిల్లాలోని నర్సీపట్నంలో కొత్తగా ఏర్పాటు చేసిన సబ్‌స్టేషన్‌లో వేరొక కాంట్రాక్టర్‌ 11 మందిని కారుణ్య నియామకాలు చేపట్టారు. నెల రోజుల తరువాత గ్లోబల్‌ టెండర్‌ విధానంలో స్వామి నాయుడుకు ఆ కాంట్రాక్టు టెండర్‌ బదాలాయించారు. గతంలో జరిపిన కారుణ్య నియామకాల ద్వారా చేరిన వారిని భయాందోళనలకు గురిచేసి తొలగించేశారు.  స్థానిక మంత్రి అయ్యన్నపాత్రుడుతో కుమ్మక్కయి ఒక్కో ఉద్యోగానికి రూ.7లక్షలకు అమ్మేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇదే విధంగా నర్సింగబిల్లి సబ్‌ స్టేషన్‌లో 11 మందిని నియమించారు. ఇక్కడ కూడా స్థానిక ఎమ్మెల్యే పీలా గోవిందసత్యనారాయణ సహకారంతో గతంలో నియమించిన వారిని తొలగించి కొత్తవారిని చేర్చారు. ఇది అప్పట్లో పెద్ద వివాదాస్పదమైంది. పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదులు కూడా చేశారు. ధర్నాలు చేపట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులతో భయపెట్టారు. ఈ అరాచకాలను తట్టకోలేక దేవీప్రసాద్‌ అనే స్కిల్డ్‌ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడని తోటి ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బ్లాక్‌ లిస్టులో పెట్టిన అధికారులు...
వీరు చేసిన అవకతవకలు బయటపడడంతో పశ్చిమగోదావరి జిల్లాలో టెండర్లను రద్దు చేస్తూ ఈపీడీసీఎల్‌ సీజీఎం–ఓ అండ్‌ సీఎస్‌ బ్లాక్‌ లిస్ట్‌లో పెట్టారు. తాడేపల్లి డివిజన్‌లో టెండర్‌ రద్దు చేస్తూ  2019 జూన్‌ 15న బ్లాక్‌లిస్టులో పెట్టారు. ఈ వ్యక్తి కోర్టు ద్వారా స్టే తెచ్చుకుని తిరిగి టెండర్‌ దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. స్వామినాయుడు అరాచకాలపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపించాలని విశాఖ, విజయనగరం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని  బాధితులు కోరుతున్నారు. ఈమేరకు ‘స్పందన’ కార్యక్రమంలో

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి...
ఇటీవల 2018–19లో 132/33 కేవి సబ్‌స్టేషన్లలో ఎన్నికల నియమావళిని ఉల్లఘించి కారుణ్య నియామకాలు చేపట్టారు. ఈ వ్యవహారంలోనూ అధికారులు, కాంట్రాక్టర్లు ఏకమై నిరుద్యోగుల నుంచి అధిక మొత్తంలో వసూలు చేసినట్టు విమర్శలు ఉన్నాయి. వాచ్‌మన్‌ ఉద్యోగానికి రూ.5లక్షలు, ఐటీఐ చేసిన వారికి  షిఫ్ట్‌ ఆపరేటర్‌ ఉద్యోగానికి రూ.10లక్షలు, డిప్లమా చేసిన వారికి రూ.9లక్షలు వంతున వసూలు చేశారనే వాదన ఉంది.

అరాచకాలపై విచారణ జరపాలి
కాంట్రాక్టర్‌ చేసిన అరాచకాలపై సమగ్ర విచారణ జరపాలి. చాలా చోట్ల ఉద్యాలు వేయిస్తామని నమ్మించి మా లాంటి నిరుద్యోగుల నుంచి లక్షల్లో దోచుకున్నాడు. పాత ఉద్యోగుల్ని రాజకీయం చేసి తొలగించేలా చేశారు. ఈ వ్యవహారంలో టీడీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రుల ప్రమేయం ఉంది.                     – ఎం.కృష్ణ, అనకాపల్లి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement