అరవై ఏళ్లకే పరిమితం చేస్తూ 15న జారీ అయిన జీవో
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)కు కొత్త సీఎండీ ఎవరన్న దానిపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు సీఎండీగా ఉన్న హెచ్‌వై దొర రాజీనామాతో ఈ ప్రతిష్టాత్మక పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్‌లలో ఒక డిస్కంకు ఐఏఎస్, మరొక డిస్కంకు నాన్ ఐఏఎస్‌లు సీఎండీలుగా నియమించాలన్న నిబంధన ఉంది. దానికి లోబడే సీఎండీల నియామకాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఎస్పీడీసీఎల్‌కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్, ఈపీడీసీఎల్‌కు నాన్ ఐఏఎస్ అధికారి హెచ్‌వై దొర ఉన్నారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో దొర సీఎండీ పదవి నుంచి సోమవారం వైదొలిగారు. ఈ స్థానంలో మరొకరిని నియమించే వరకు ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్‌కు తాత్కాలికంగా పూర్తి అదనపు బాధ్యతలను అప్పగించారు. ఇన్నాళ్లూ డిస్కంల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులకు వయసుతో పనిలేకుండా పదవీ విరమణ చేసిన వారిని కూడా నియమించేవారు.
ఇకపై డిస్కం/ట్రాన్స్‌కో/జెన్‌కోల్లో డైరెక్టర్, సీఎండీ పోస్టులను 60 ఏళ్ల లోపు వారికే ఇచ్చేలా ఈనెల 15న ప్రభుత్వం సవరణ చేస్తూ జీవో జారీ చేసింది. ప్రభుత్వం వ్యూహాత్మకంగానే ఈ జీవోను జారీ చేసినట్టు స్పష్టమవుతోంది. సీఎండీ దొర చేత రాజీనామా చేయించి, ఆ స్థానంలో పదవీ విరమణ చేసిన వారు పోటీ పడకుండా అడ్డుకట్ట వేయడంలో భాగంగానే దీనిని విడుదల చేసినట్టు తేటతెల్లమవుతోంది. కొత్త జీవో ప్రకారం ప్రభుత్వ సర్వీసులో ఉన్న వారే సీఎండీ/డైరెక్టర్ పోస్టులకు అర్హులవుతారు. అంటే ఇకపై రిటైర్ అయిన వారికి ఆ పోస్టుల్లో అవకాశం ఉండదన్నమాట! వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకుని ఈపీడీసీఎల్‌కు కొత్త సీఎండీని నియమించాల్సి ఉంటుంది. ఒక డిస్కంకు ఐఏఎస్, మరో డిస్కంకు నాన్ ఐఏఎస్ ప్రాతిపదికన ప్రస్తుతం ఎస్పీడీసీఎల్‌కు ఐఏఎస్ అధికారి ఎంఎం నాయక్ సీఎండీగా కొనసాగుతున్నారు. ఈ లెక్కన ఈపీడీసీఎల్‌కు నాన్ ఐఏఎస్ నియామకం జరపాల్సి ఉంది. ఇప్పుడు ఈ పోస్టుకు ఎవరు అర్హులన్న దానిపై ఈపీడీసీఎల్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సీఎండీ పదవికి డైరెక్టర్ లేదా చీఫ్ ఇంజినీర్/చీఫ్ జనరల్ మేనేజర్‌లు అర్హులు. ఈపీడీసీఎల్‌లో ప్రస్తుతం ఉన్న ఇద్దరు డైరెక్టర్లు బి.శేషుకుమార్, చంద్రశేఖర్‌లు పదవీ విరమణ చేసి కొనసాగుతున్నవారే. తాజా జీవో వల్ల వారికి సీఎండీ అయ్యే అవకాశం లేదు. ఇక సీజీఎంలుగా పి.సింహాద్రికుమార్, కె.సత్యనారాయణమూర్తి, జి.శ్రీనివాసరెడ్డిలు ఉన్నారు. వీరు ఏడాది, ఏడాదిన్నరలోనే పదవీ విరమణ చేయనున్నారు.
ఈపీడీసీఎల్‌కు కార్తికేయమిశ్రా రిక్వెస్ట్?
మరోవైపు ఈపీడీసీఎల్ సీఎండీ పదవికి ప్రస్తుత తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా పేరు వినిపిస్తోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌పీడీసీఎల్‌కు ఆయన ఏడాదిన్నర కాలం సీఎండీగా పనిచేశారు. గతంలో కొద్దిరోజులపాటు ఆయన ఈపీడీసీఎల్‌కు కూడా ఇన్‌చార్జి సీఎండీగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో ఆయన కొన్నాళ్ల క్రితం ఈపీడీసీఎల్ సీఎండీగా నియమించాలంటూ ప్రభుత్వానికి విన్నవించినట్టు సమాచారం. మారిన పరిస్థితుల్లో ఆయనకు అవకాశం ఇవ్వచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. అదే జరిగితే ఎస్పీడీసీఎల్‌కు నాన్ ఐఏఎస్ సీఎండీని నియమించే వీలుంది. కాగా నేడో, రేపో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి రానుండడంతో ఆయన నియామకానికి వీలుపడదని చెబుతున్నారు. అందువల్ల సార్వత్రిక ఎన్నికలయ్యే దాకా ఎస్పీడీసీఎల్ సీఎండీ నాయక్‌నే కొనసాగించే అవకాశం ఉంది. మరోవైపు నాయక్ మంగళవారం ఏపీఈపీడీసీఎల్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలను తిరుపతిలోని ఎస్పీడీసీఎల్ కార్యాలయం నుంచే స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment