విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్
2.20 ఎకరాల్లో ఉన్న సర్కిల్ ఆఫీసు, గెస్ట్ హౌస్ నేలమట్టం చేసేందుకు కుట్ర
ఫైళ్లు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశం
సొంత లాభం కోసమే ప్రభుత్వ పెద్దల ఆరాటం!
ప్రతిపాదన దశలోనే ఉందంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో సంపద సృష్టిస్తామనే మాటను పక్కన పెట్టి ప్రజలపై విద్యుత్ చార్జీల భారం మోపుతోంది. అంతటితో ఆగకుండా విద్యుత్ శాఖ ఆస్తులను కార్పొరేట్లకు అప్పగించి కొందరు నేతలకు లబ్ధి కలిగించాలని భావిస్తోంది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను సైతం కాల్చివేసి ఖాళీ స్థలాలను కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోంది. విశాఖలో రూ.100 కోట్లకుపైగా విలువైన 2.20 ఎకరాల స్థలాన్ని బహుళ అంతస్తుల భవనం పేరిట కార్పొరేట్ సంస్థకు అప్పగించేందుకు చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శనం.
సొంత లాభమే లక్ష్యంగా..
విశాఖపట్నం నగరంలోని గ్రీన్ పార్క్ హోటల్ ఎదురుగా రోడ్డును ఆనుకుని సుమారు 2.20 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్) కార్యాలయాలు, ఉద్యోగుల అతిథి గృహం ఉన్నాయి. అక్కడ ప్రస్తుతం ఉన్న రెండు అంతస్తుల భవనంలో విశాఖపట్నం పర్యవేక్షక ఇంజనీర్ (ఎస్‌ఈ) ఆపరేషన్స్ సర్కిల్ కార్యాలయం కొనసాగుతోంది. అదేవిధంగా విశాఖలోని ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో పనుల కోసం 11 జిల్లాల నుంచి వచ్చే అధికారులు, సిబ్బందికి ఇక్కడ ఉన్న అతిథి గృహం ఒక్కటే వసతి కల్పిస్తోంది. అయితే, ఆ భవనాలను నేలమట్టం చేసి రూ.100 కోట్లకు పైగా విలువ చేసే స్థలాన్ని బహుళ అంతస్తుల భారీ భవన సముదాయాన్ని నిర్మించేందుకు కార్పొరేట్ సంస్థలకు కేటాయించాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా రాష్ట్ర ప్రభుత్వంలోని కొందరు నేతలకు ఆర్థికంగా భారీ లబ్ధి చేకూరేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇందులో భాగంగా కొత్తగా నిర్మించే భారీ భవనంలోని ఒకటి, రెండు అంతస్తుల్లో ఏపీఈపీడీసీఎల్ విశాఖ సర్కిల్ కార్యకలాపాలకు అవకాశం కల్పించడం, లేదా నగరంలోనే సాగర్‌నగర్ వద్ద నిర్మిస్తున్న మరో భవనంలోకి విశాఖ సర్కిల్ ఆఫీసును తరలించడం అనే రెండు ప్రతిపాదనలను కూటమి ప్రభుత్వం తయారు చేస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫైళ్లను సిద్ధం చేయాల్సిందిగా సర్కిల్ అధికారులను ఆదేశించింది. మరోవైపు తమ కార్యాలయాన్ని కాల్చివేసి విలువైన స్థలాన్ని కార్పొరేట్లకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందనే వార్తలతో సర్కిల్ పరిధిలోని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వమే రియల్ ఎస్టేట్ వ్యాపారిలా మారి కంపెనీ స్థలాలను ఇలా లాక్కొని ప్రైవేట్ డెవలపర్లకు అప్పగించడం ఏమిటనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment