బదిలీ బంతాట...! | Transfers in the apepdcl | Sakshi
Sakshi News home page

బదిలీ బంతాట...!

Published Tue, Jun 27 2017 11:24 PM | Last Updated on Tue, Sep 5 2017 2:36 PM

బదిలీ బంతాట...!

బదిలీ బంతాట...!

- విద్యుత్‌ శాఖలో వింతలు
– ఒకే ప్రాంతంలో 23 ఏళ్లు ఉన్నా బదిలీ లేదు 
– జూనియర్లను బదిలీ చేసిన అధికారులు 
– సినియారిటీ కోసం మూడు జాబితాల రూపకల్పన 
– పట్టించుకోని ఉద్యోగ సంఘాలు 
– ఆవేదన వ్యక్తం చేస్తున్న బదిలీ అయిన జూనియర్లు 
సాక్షి, రాజమహేంద్రవరం:  ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో జరిగిన బదిలీల్లో అనేక చిత్రాలు చోటుచేసుకున్నాయి. సీనియర్లను బదిలీ చేయాల్సిన ఈపీడీసీఎల్‌ జూనియర్లను బదిలీ చేసింది. బదిలీల్లో పారదర్శకత లోపించే విధంగా సీనియారిటీ నిర్థారణకు అధికారులు మూడు జాబితాలను రూపొందించారు. చివరి రోజు వరకు ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగులు తికమక పడ్డారు. బదిలీ ప్రక్రియ ముగిసినా తర్వాత చూస్తే 23 ఏళ్లు ఒకే స్టేషన్‌లో పని చేస్తున్నా ఉద్యోగులను బదిలీ నుంచి తప్పించుకున్నారు. వారికన్నా జూనియర్లు మాత్రం బదిలీ అయ్యారు. విద్యుత్‌ శాఖలో ఒకే స్టేషన్‌లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న వారిని బదిలీ చేయాలి. అదేవిధంగా మొత్తం పోస్టుల్లో బదిలీలు 20 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలు తమ తమ పరిధిలో బదిలీలు చేపట్టాయి. సీనియారిటీ నిర్థారణ కోసం ఏపీఈపీడీసీఎల్‌ మూడు జాబితాలు తయారు చేయడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏపీ ఎస్‌పీడీసీఎల్‌ మాత్రం ఒకే జాబితా తయారు చేసి సీనియారిటీ ప్రకారం బదిలీ చేసింది.
మూడు జాబితాలతో నష్టపోయిన జూనియర్లు...
స్టేషన్‌లో ఐదేళ్లుకుపైగా, పోస్టులో మూడేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మొదటి జాబితా, పోస్టులో మూడేళ్లకు పైగా ఉన్న ఉద్యోగులతో రెండో జాబితా, స్టేషన్‌లో ఐదేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మూడో జాబితాను ఏపీఈపీడీసీఎల్‌ తయారు చేసింది. మొదటి జాబితా ప్రకారం రాజమహేంద్వరం సర్కిల్‌లో బదిలీలు చేపట్టింది. ఇక్కడే జూనియర్లకు అన్యాయం జరిగింది. ఏపీఎస్‌పీడీసీఎల్‌ తయారు చేసిన లిస్టులో స్టేషన్‌లో సీనియారిటీ, తర్వాత పోస్టులో ఎంత కాలం ఉన్నారో (మూడేళ్లకు తక్కువగా ఉన్నా) సీనియారిటీ ప్రకారం తయారు చేసింది. కానీ ఏపీఈపీడీసీఎల్‌లో మాత్రం మొదటి లిస్టులో స్టేషన్‌లో ఐదేళ్ల సీనియారిటీ, పోస్టులో మూడేళ్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది. ఇక్కడ ఒకే స్టేషన్‌లో 23 ఏళ్లుగా పని చేస్తున్న వారు పోస్టులో మూడేళ్ల పూర్తి కాలేదని మొదటి లిస్టులో చేర్చలేదు. వీరిని స్టేషన్‌లో సీనియారిటీ ప్రకారం మూడో జాబితాలో చేర్చారు. ఇక రెండో లిస్టును పోస్టులో సీనియారిటీ ప్రకారం సిద్ధం చేశారు.
ఇవిగో బదిలీ ‘చిత్రాలు’...
ఏపీఈపీడీసీఎల్‌ రాజమహేంద్రవరం సర్కిల్‌ ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి చిత్రాలు చోటుచేసుకున్నాయో జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్ల(జేఏఓ) ఉద్యోగుల బదిలీల తీరును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతాయి. రాజమహేంద్రవరం సర్కిల్‌ (జిల్లా మొత్తం)లో మొత్తం 17 మంది జూనియర్‌ అకౌంట్‌ ఆఫీసర్లున్నారు. ఇందులో మొదటి లిస్టు (స్టేషన్, పోస్టు సినియారిటీ)లోకి కేవలం 9 మందే వచ్చారు. వీరిలో 13 ఏళ్ల ఏడు నెలల 26 రోజుల స్టేషన్‌ సీనియారిటీ, మూడేళ్ల 9 నెలల 29 రోజులతో జి.కృష్ణారావు అనే ఉద్యోగి మొదటి స్థానంలో ఉండగా కె.వరప్రసాద్‌రావు అనే ఉద్యోగి స్టేషన్, పోస్టులు రెండింటిలోనూ ఐదేళ్ల 4 నెలల 29 రోజులతో చివరి స్థానంలో ఉన్నారు. మొత్తం 17 మంది జేఏఓలలో ఒకే స్టేషన్‌లో వివిధ క్యాడర్లలో 23 ఏళ్ల ఐదు రోజులతో వి.సుజాత అనే ఉద్యోగి మొదిటి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత కె.ఎస్‌.వి.విజయలక్ష్మి 22 ఏళ్ల 9 నెలల 10 రోజులు, కె.మోహనరావు 22 ఏళ్ల 18 రోజులు, నక్కా రాజేశ్వరి 21 ఏళ్ల 11 నెలల 31 రోజులు, జి. కృష్ణారావు 13 ఏళ్ల 7 నెలల 26 రోజులు, సీహెచ్‌.అగస్థేశ్వరరావు 10 ఏళ్లు, కె.రవీంద్రబాబు 9 ఏళ్ల 9 నెలల 29 రోజులు, ఎం. సాల్మన్‌రాజు ఆరేళ్ల 3 నెలల 31 రోజులు, వి.సత్యనారాయణ మూర్తి 5 ఏళ్ల 11 నెలల 22 రోజులుగా పని చేస్తున్నారు. అయితే వీరందరినీ బదిలీల ప్రక్రియలోకి తీసుకోని అధికారులు పోస్టులో ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేశారు. ఒకటో జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జి.కృష్ణారావు అనే ఉద్యోగిని కూడా బదిలీ చేయని అధికారగణం తర్వాత ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేసింది. వీరందరూ స్టేషన్, పోస్టులలో ఒకే సీనియారిటీ ఉన్న వారు కావడం గమనార్హం. ఒకే స్టేషన్‌లో 23 ఏళ్లుగా ఉన్న ఉద్యోగులను బదిలీ చేయని ఉన్నతాధికారులు ఆ స్టేషన్‌లో ఐదేళ్లు అంతకన్నా తక్కువ సర్వీస్‌ ఉన్న జూనియర్‌ అధికారులను బదిలీ చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగుల సంఘాలు కూడా మిన్నకుండిపోవడంతో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement