in
-
గుంటూరు పల్నాడు ఎక్స్ ప్రెస్ లో బ్యాగ్ లో పసికందు కలకలం
-
పెద్దాడ గడగడ
పచ్చకామెర్లు, వైరల్ జ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి రాజమహేంద్రవరం సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శివశంకర్, అతని నాన్నమ్మ మంగయమ్మ కాకినాడ తరలింపు పారిశుద్ధ్య లోపంపై డీఎంహెచ్ఓ ఆగ్రహం ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు బాధిత కుటుంబాలకు పరామర్శ పెద్దాడ (పెదపూడి) : పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు పచ్చకామెర్లు (హెపటైటిస్-సీ), వైరల్ జ్వరాలతో మృతి చెందడంతో పెద్దాడ గడగడలాడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వైరల్, విష జ్వరాలతో మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ఈ డెల్టా ప్రాంతంలో ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడం, తల్లి వెంటిలేటర్‌పై అపస్మారకస్థితిలో ఉండడం, తండ్రి, నాన్నమ్మ చలిజ్వరానికి గురికావడంతో గ్రామంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికులు, అధికారులు, వైద్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మట్టపర్తి శివశంకర్ అనే వ్యక్తి దేవీపట్నం మండలంలోని వీరవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 4 సంవత్సరాల శ్రావణి, ఏడాది వయసు ఉన్న చిట్టితల్లి సంతానం ఉన్నారు. అయితే వెంకటలక్ష్మి కుటుంబం పొలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కావడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం నిమిత్తం రెండు నెలల క్రితం సొంత ఊరు వీరవరం వెళ్లారు. అక్కడ నుంచి గత నెల 22న తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారులు జూన్ 24న చిట్టి తల్లి పుట్టిన రోజు నిమిత్తం గ్రామానికి వచ్చారు. వీరిని తీసుకురావడానికి శివశంకర్ నాన్నమ్మ మంగయమ్మ వెళ్లి నాలుగు రోజులు ఉండి అంతా కలిసి వచ్చారు. వీరు ఇక్కడకు వచ్చే సరికి జ్వరాలు, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 2న శ్రావణికి మూత్రం పసుపురంగులో ఉందని, శరీరం తెల్లగా పాలిపోయి నీరసంగా ఉందంటూ బిక్కవోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అనపర్తి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. వెంటనే తండ్రి కాకినాడ ఆస్పత్రిలో శ్రావణిని చేర్చారు. ఆ చిన్నారితో పాటు, ఆమె తల్లి వెంకటలక్ష్మిని కూడా చేర్పించాలని వైద్యులు చెప్పారు. అయితే చికిత్స పొందుతూ 4న ఉదయం శ్రావణి చనిపోయింది. ఆ విషయం తల్లికి తెలియజేయనీయలేదు. అయితే తల్లి వెంకటలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాలని బంధువులు కాకినాడ నుంచి రాజమహేంద్రవరంలోని సాయి ప్రైవేటు ఆస్పత్రిలో అదేరోజు చేర్చారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 6న ఉదయం చిట్టి తల్లికి కూడా బాగోలేదని జి.మామిడాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వెంటనేæ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే తన పెద్ద కుమార్తె శ్రావణి అదే అస్పత్రిలో చనిపోయిందని, ఆలోచించి బంధువులు సంజీవ్ అనే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం చేర్చిన చిట్టితల్లి అదేరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే శివశంకర్, మంగయమ్మలకు వైద్యం అందించాలని, ఇద్దరినీ కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. వెంకటలక్ష్మి రాజమహేంద్రవరంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. పారిశుద్ధ్యం బాగోలేదు–డీఎంఅండ్‌హెచ్‌వో డీఎంఅండ్‌హెచ్‌వో చంద్రయ్య శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన బాధితులతో మాట్లాడారు. జరిగిన సంఘటన వివరాలు అడిగితెలుసుకున్నారు. చంద్రయ్య మాట్లాడుతూ చిన్నారుల తల్లికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన డెంగీ, స్వైన్‌ఫ్లూ, మొదలైన వైద్య పరీక్షలు చేయించాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు ఆదేశించామన్నారు. శివశంకర్, మంగయమ్మలను అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగోలేదని ఇలాంటి పరిస్థితులు ఉంటే వ్యాధులు ప్రబలుతాయన్నారు. ఇలాంటి సంఘటనలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిని సస్పెండ్ చేయాలని జిల్లా కలెక్టర్‌కు సిఫార్సు చేస్తానని హెచ్చరించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసవాలు ఎందుకు చేయడంలేదు? ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేదంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగోలేదని డీఎంఅండ్‌హెచ్‌వో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుతో ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరుగైన వైద్యానికి, ప్రభుత్వం పరంగా ఆదుకోడానికి కృషి గ్రామంలో జ్వరాలతో చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్లో మాట్లాడి చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే చనిపోయిన చిన్నారులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. గ్రామంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎంపీడీవో చక్రధరరావు, తహసీల్దార్ వెంకటేశ్వరరావు, వైద్యులు స్వర్ణ లతలను ఆదేశించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా ఆదుకోడానికి కృషి చేస్తామన్నారు. -
బదిలీ బంతాట...!
- విద్యుత్ శాఖలో వింతలు – ఒకే ప్రాంతంలో 23 ఏళ్లు ఉన్నా బదిలీ లేదు – జూనియర్లను బదిలీ చేసిన అధికారులు – సినియారిటీ కోసం మూడు జాబితాల రూపకల్పన – పట్టించుకోని ఉద్యోగ సంఘాలు – ఆవేదన వ్యక్తం చేస్తున్న బదిలీ అయిన జూనియర్లు సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో జరిగిన బదిలీల్లో అనేక చిత్రాలు చోటుచేసుకున్నాయి. సీనియర్లను బదిలీ చేయాల్సిన ఈపీడీసీఎల్ జూనియర్లను బదిలీ చేసింది. బదిలీల్లో పారదర్శకత లోపించే విధంగా సీనియారిటీ నిర్థారణకు అధికారులు మూడు జాబితాలను రూపొందించారు. చివరి రోజు వరకు ఏ జాబితా ప్రకారం బదిలీ చేస్తారో తెలియక ఉద్యోగులు తికమక పడ్డారు. బదిలీ ప్రక్రియ ముగిసినా తర్వాత చూస్తే 23 ఏళ్లు ఒకే స్టేషన్లో పని చేస్తున్నా ఉద్యోగులను బదిలీ నుంచి తప్పించుకున్నారు. వారికన్నా జూనియర్లు మాత్రం బదిలీ అయ్యారు. విద్యుత్ శాఖలో ఒకే స్టేషన్లో ఐదేళ్లు, పోస్టులో మూడేళ్లకు మించి ఉన్న వారిని బదిలీ చేయాలి. అదేవిధంగా మొత్తం పోస్టుల్లో బదిలీలు 20 శాతానికి మించకూడదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని దక్షిణ, తూర్పు ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థలు తమ తమ పరిధిలో బదిలీలు చేపట్టాయి. సీనియారిటీ నిర్థారణ కోసం ఏపీఈపీడీసీఎల్ మూడు జాబితాలు తయారు చేయడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఏపీ ఎస్పీడీసీఎల్ మాత్రం ఒకే జాబితా తయారు చేసి సీనియారిటీ ప్రకారం బదిలీ చేసింది. మూడు జాబితాలతో నష్టపోయిన జూనియర్లు... స్టేషన్లో ఐదేళ్లుకుపైగా, పోస్టులో మూడేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మొదటి జాబితా, పోస్టులో మూడేళ్లకు పైగా ఉన్న ఉద్యోగులతో రెండో జాబితా, స్టేషన్లో ఐదేళ్లకుపైగా ఉన్న ఉద్యోగులతో మూడో జాబితాను ఏపీఈపీడీసీఎల్ తయారు చేసింది. మొదటి జాబితా ప్రకారం రాజమహేంద్వరం సర్కిల్లో బదిలీలు చేపట్టింది. ఇక్కడే జూనియర్లకు అన్యాయం జరిగింది. ఏపీఎస్పీడీసీఎల్ తయారు చేసిన లిస్టులో స్టేషన్లో సీనియారిటీ, తర్వాత పోస్టులో ఎంత కాలం ఉన్నారో (మూడేళ్లకు తక్కువగా ఉన్నా) సీనియారిటీ ప్రకారం తయారు చేసింది. కానీ ఏపీఈపీడీసీఎల్‌లో మాత్రం మొదటి లిస్టులో స్టేషన్లో ఐదేళ్ల సీనియారిటీ, పోస్టులో మూడేళ్ల సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని తయారు చేసింది. ఇక్కడ ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా పని చేస్తున్న వారు పోస్టులో మూడేళ్ల పూర్తి కాలేదని మొదటి లిస్టులో చేర్చలేదు. వీరిని స్టేషన్లో సీనియారిటీ ప్రకారం మూడో జాబితాలో చేర్చారు. ఇక రెండో లిస్టును పోస్టులో సీనియారిటీ ప్రకారం సిద్ధం చేశారు. ఇవిగో బదిలీ ‘చిత్రాలు’... ఏపీఈపీడీసీఎల్ రాజమహేంద్రవరం సర్కిల్ ఉద్యోగుల బదిలీల్లో ఎలాంటి చిత్రాలు చోటుచేసుకున్నాయో జూనియర్ అకౌంట్ ఆఫీసర్ల(జేఏఓ) ఉద్యోగుల బదిలీల తీరును పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతాయి. రాజమహేంద్రవరం సర్కిల్ (జిల్లా మొత్తం)లో మొత్తం 17 మంది జూనియర్ అకౌంట్ ఆఫీసర్లున్నారు. ఇందులో మొదటి లిస్టు (స్టేషన్, పోస్టు సినియారిటీ)లోకి కేవలం 9 మందే వచ్చారు. వీరిలో 13 ఏళ్ల ఏడు నెలల 26 రోజుల స్టేషన్ సీనియారిటీ, మూడేళ్ల 9 నెలల 29 రోజులతో జి.కృష్ణారావు అనే ఉద్యోగి మొదటి స్థానంలో ఉండగా కె.వరప్రసాద్‌రావు అనే ఉద్యోగి స్టేషన్, పోస్టులు రెండింటిలోనూ ఐదేళ్ల 4 నెలల 29 రోజులతో చివరి స్థానంలో ఉన్నారు. మొత్తం 17 మంది జేఏఓలలో ఒకే స్టేషన్లో వివిధ క్యాడర్లలో 23 ఏళ్ల ఐదు రోజులతో వి.సుజాత అనే ఉద్యోగి మొదిటి స్థానంలో ఉన్నారు. ఆమె తర్వాత కె.ఎస్.వి.విజయలక్ష్మి 22 ఏళ్ల 9 నెలల 10 రోజులు, కె.మోహనరావు 22 ఏళ్ల 18 రోజులు, నక్కా రాజేశ్వరి 21 ఏళ్ల 11 నెలల 31 రోజులు, జి. కృష్ణారావు 13 ఏళ్ల 7 నెలల 26 రోజులు, సీహెచ్.అగస్థేశ్వరరావు 10 ఏళ్లు, కె.రవీంద్రబాబు 9 ఏళ్ల 9 నెలల 29 రోజులు, ఎం. సాల్మన్‌రాజు ఆరేళ్ల 3 నెలల 31 రోజులు, వి.సత్యనారాయణ మూర్తి 5 ఏళ్ల 11 నెలల 22 రోజులుగా పని చేస్తున్నారు. అయితే వీరందరినీ బదిలీల ప్రక్రియలోకి తీసుకోని అధికారులు పోస్టులో ఐదేళ్ల సీనియారిటీ ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేశారు. ఒకటో జాబితాలో మొదటి స్థానంలో ఉన్న జి.కృష్ణారావు అనే ఉద్యోగిని కూడా బదిలీ చేయని అధికారగణం తర్వాత ఉన్న ఎనిమిది మందిని బదిలీ చేసింది. వీరందరూ స్టేషన్, పోస్టులలో ఒకే సీనియారిటీ ఉన్న వారు కావడం గమనార్హం. ఒకే స్టేషన్లో 23 ఏళ్లుగా ఉన్న ఉద్యోగులను బదిలీ చేయని ఉన్నతాధికారులు ఆ స్టేషన్లో ఐదేళ్లు అంతకన్నా తక్కువ సర్వీస్ ఉన్న జూనియర్ అధికారులను బదిలీ చేయడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఉద్యోగుల సంఘాలు కూడా మిన్నకుండిపోవడంతో నిర్వేదం వ్యక్తం చేస్తున్నారు. -
చీటింగ్ కేసులో నిందితుల అరెస్టు
రూ.5.18 లక్షలు రికవరీ సామర్లకోట: కొత్త నోట్లకు లక్షకు రూ.30వేలు అదనంగా పాత నోట్లు ఇస్తామని నమ్మించి మోసం చేసిన వ్యక్తులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు స్థానిక పోలీసు స్టేష¯ŒSలో పెద్దాపురం సీఐ వీరయ్యగౌడ్ విలేకర్లకు వివరాలు తెలిపారు. ఈనెల 11వ తేదీన విజయనగరం జిల్లా భోగాపురానికి చెందిన బైరెడ్డి సోమిరెడ్డి, వనుం చిన్నా, సీరపు అప్పలరెడ్డిలను మోసం చేసి రూ. 5.18 లక్షలతో పరారైన నిందితులను బుధవారం అరెస్టు చేశారు. స్థానిక సీబీఎం హైస్కూల్ వద్ద గంగవరపు గురుపాదం ఇంటిలో ఉన్న నిందితులు చల్లా నూకారెడ్డి (విజయనగరం జిల్లా, భోగాపురం), ఈటి నాగేశ్వరరావు (పిఠాపురం), విశాఖపట్నానికి చెందిన కడియాల శ్రీనివాసరావు, కొండపలిల నూకరాజు, సామర్లకోటకు చెందిన గంగవరపు గురుపాదం, సూరిమల్ల చిన్న అప్పారావులను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. సోమిరెడ్డి వర్గాన్ని నమ్మించి లక్షకు రూ. 30వేలు అదనంగా పాత నోట్లు సామర్లకోటలో ఇస్తామని తీసుకొని వచ్చి నిందితులు పరారైన విషయం తెలిసిందే. ఈ మేరకు బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై లక్ష్మీకాంతం కేసు నమోదు చేశారు. గురుపాదం ఇంటిలో ఉన్న వారి నుంచి రూ.రెండు వేల నోట్లు 231, రూ.100 నోట్లు 529, రూ50 నోట్లు 62ను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన ఎస్సైలు లక్ష్మీకాంతం, జీఎస్ వల్లీ, హెచ్‌సీలు తదితరులకు డీఎస్పీ రివార్డులు ప్రకటించారని సీఐ తెలిపారు. -
సీపీసీఆర్‌ఐకి గ్రీన్ సిగ్నల్
అంగీకరించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు జనవరిలో శంకుస్థాపన కోనసీమలో క్షేత్రస్థాయి పరిశోధనలకు 60 ఎకరాలు అమలాపురం : కొబ్బరి రైతులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధాసింగ్ మోహన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విస్తారంగా కొబ్బరి సాగు జరిగే గోదావరి జిల్లాల్లో సీపీసీఆర్‌ఐని ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2.7 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుండగా, తూర్పు గోదావరి జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సీపీసీఆర్‌ఐని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో కొబ్బరి సాగుకు మరింత మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. తొలుత దీనిని కోనసీమలో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకు అవసరమైన 60 ఎకరాలు స్థానికంగా లభ్యత లేకపోవడంతో అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఇక్కడ పరిశోధనలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో మాధవరాయుడుపాలెంలోని 94 ఎకరాల ప్రభుత్వ భూమిలో లో 50 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు లేఖ రాసింది. ఐసీఏఆర్ సిఫార్సు మేరకు జూన్ 9న సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప బృందం ఆ భూమిని పరిశీలించి ఈ ప్రాంతం అన్నింటికీ అనువుగా ఉంటుందని గుర్తించింది. సారవంతమైన భూమితో పాటు ఇరువైపులా ప్రధాన రహదారి ఉండడం, పుష్కలంగా భూగర్భ జలాలు, చెంతనే గోదావరి డెల్టా ప్రధాన కాలువ ఉండడం అన్నివిధాలా ఈ భూమి యోగ్యంగా ఉంటుందని వారు ఇచ్చిన నివేదిక మేరకు ఇక్కడ సీపీసీఆర్‌ఐ ఏర్పాటుకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. అన్నీ అనుకున్నట్టు సాగితే వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన జరగనుంది. కోనసీమలో మరో 60 ఎకరాలు సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయి పరిశోధనలు చేసేందుకు కొబ్బరి అధికంగా పండించే కోనసీమలో భూమి ఉండాలని సీపీసీఆర్‌ఐ ఉన్నతాధికారుల బృందం భావిస్తోంది. ఇందుకోసం కోనసీమలో సుమారు 60 ఎకరాల కొబ్బరి తోటను సేకరిస్తే మేలు జరుగుతుందని వారంటున్నారు. కొంత కొబ్బరి ఉండి, మరికొంత సాగుయోగ్యమైన భూమి ఉన్నా చాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సీపీసీఆర్‌ఐ అధికారులు లేఖ రాయనున్నట్టు సమాచారం. కొబ్బరి ప్రస్థానంలో మరో మైలురాయి సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొబ్బరి సాగుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. పొట్టి రకాల పెంపకం, విలువ ఆధారిత కొబ్బరి ఉత్పత్తుల తయారీ, కొబ్బరి అంతర పంటల సాగు ప్రోత్సాహం, రైతుకు సాంకేతిక బదిలీ వంటి అంశాలను సీపీసీఆర్‌ఐ ప్రాధాన్యతలుగా పెట్టుకుంది. రాష్ట్ర కొబ్బరి ప్రస్థానంలో ఇదో మైలురాయి అవుతోంది. – పాలెం చౌడప్ప, సీపీసీఆర్‌ఐ డైరెక్టర్, కాసరఘోడ్, కేరళ -
జిల్లాలో నిషేధాజ్ఞలు : ఎస్పీ
కాకినాడ క్రైం : నెల రోజుల పాటు జిల్లాలో నిషేధాజ్ఞలు విధిస్తూ జిల్లా ఎస్పీ ఎం.రవిప్రకాష్ మంగళవారం ఉత్వర్వులు జారీ చేశారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి బహిరంగ సభలు, సమావేశాలు, ధర్నాలు, ఆందోళనలు చేపట్టరాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సెక్షన్-30 ప్రకారం శాంతి భద్రతలు, అంతర్గత భద్రత పరిరక్షణలో భాగంగా నవంబర్ ఒకటి నుంచి 30 వరకూ కాకినాడ, రామచంద్రపురం, పెద్దాపురం, అమలాపురం, రంపచోడవరం, చింతూరు సబ్ డివిజన్ల పరిధిలో పోలీసుల అనుమతి లేకుండా ఎటువంటి సమావేశాలు, ఆందోళనలు నిర్వహించరాదని, మైక్‌లతో ప్రచారం చేపట్టరాదని స్పష్టం చేశారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఆయన సిబ్బందిని ఆదేశించారు. -
ఆదికవి నన్నయలో స్పాట్ అడ్మిషన్లు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఆదికవి నన్నయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాలల్లో వివిధ కోర్సుల్లో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థుల నుంచి స్మాట్ అడ్మిషన్లు కోరుతున్నారు. ఇందుకు సంబంధించి రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు మంగళవారం తెలిపిన వివరాలు ఉన్నాయి. రెండేళ్ల కాలవ్యవధితో కూడిన బీఈడీ కోర్సులో చేరదలచుకున్న అర్హత గల విద్యార్థులు ఈ నెల ఐదులోగా తమ దరఖాస్తులను అందజేయవలసి ఉంది. అలాగే బీఏ, బికాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఎం, బీటెక్ మున్నగు డిగ్రీలలో కూడా ప్రవేశాలు తీసుకుంటున్నారు. బీసీ విద్యార్థులు ఇంటర్లో 40 శాతం, ఇతరులు 50 శాతం మార్కులతోను, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు ఉత్తీర్ణులై ఉంటే సరిపోతుంది. ప్రవేశ పరీక్ష రాయకపోయినా బీటెక్‌లో చేరేందుకు ప్రస్తుతం అవకాశం కల్పించారు. ఆసక్తి ఉండి తగిన అర్హతలు ఉన్న విద్యార్థులు ఈ నెల ఐదో తేదీ సాయంత్రం ఐదు గంటలలోగా అన్ని రకాల ధ్రువీకరణ పత్రాలు (ఒరిజనల్, నకలుతో సహా) తీసుకుని ప్రభుత్వం నిర్ణయించి రూ.16,500 ప్రవేశ రుసుంతో యూనివర్సిటీలోని డీఓఏ కేంద్రంలో డాక్టర్ మట్టారెడ్డిని కలవాలన్నారు. నేడు నన్నయలో ప్రారంభం కానున్న ‘వికాస్’ శిక్షణ రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం): ఆదికవి నన్నయ యూనివర్సిటీలో ’వికాస్’ సంస్థ ద్వారా చేపట్టే శిక్షణ కార్యక్రమాలను ఆ సంస్థ చైర్మన్, జిల్లా కలెక్టరు హెచ్. అరుణ్‌కుమార్ బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఈ కార్యక్రమంలో నన్నయ ఉపకులపతి ఆచార్య ఎం.ముత్యాలునాయుడు, రిజిస్టార్ ఆచార్య ఎ. నరసింహరావు, తదితరులు పాల్గొంటారని యూనివర్సిటీ పీఆర్వో మంగళవారం ఇక్కడ విలేకరులకు తెలిపారు. -
పురవీధులే..పోరు వేదికలు..
దూసుకొచ్చే ఖడ్గాలు, నిప్పులు కక్కే బరాటాలు ఆద్యంతం రోమాంచితులను చేసే రణ విన్యాసాలు దసరాకు అమలాపురాన్ని సూదంటురాయిని చేసే చెడీ తాలింఖానా ప్రదర్శనలు శత్రురాజ్యంపై యుద్ధం చేయాలంటే కొన్నాళ్లకు ముందే కత్తులకు పదును పడతారు. సైనికులను సమాయత్తం చేస్తారు. శకటాలను సిద్ధం చేస్తారు. ఇది నాటి యుద్ధరీతి. అయితే ఇదే సన్నద్ధం ఏటా దసరాకు అమలాపురం పట్టణంలో కనిపిస్తుంది. ఏడు వీధులకు చెందిన చురకత్తుల్లాంటి కుర్రాళ్లు పట్టా కత్తులకు పదును పెడతారు. భద్రపరచిన బళ్లేలు, బాణా కర్రలను బయటకు తీస్తారు. కత్తి, కర్రసాము సాధన చేస్తారు. అయితే ఇదంతా శత్రురాజ్యంపైనో, వైరి వీరులపైనో యుద్ధానికి కాదు. ‘బాహుబలి’ లాంటి చిత్రం షూటింగ్ కోసం అసలే కాదు. ఏటా దసరా సంబరాలకు కోనసీమ కేంద్రం అమలాపురంలో చేసే చెడీ తాలింఖానా వీరవిద్యా ప్రదర్శన కోసమే ఈ కత్తుల ఖణేల్లు, బళ్లేల జిగేల్లు. రహదారులను రణవేదికలుగా మారుస్తూ, రాచరిక కాలపు యుద్ధాన్ని తలపించే ఈ సాహసోపేత విన్యాసాలను ఈ దసరా సందర్భంగా తిలకించేందుకు బుధవారం రాత్రి రాష్ట్రం నలుమూలల నుంచీ పెద్ద ఎత్తున జనం అమలాపురం తరలి రానున్నారు. అమలాపురం రూరల్ : విజయదశమి నాడుæ అమలాపురం వీధుల్లో జరిగే చెడీ తాలింఖానా ప్రదర్శనల సందడి అంతాఇంతా కాదు. వీధుల్లో యువకులు, పెద్దలు ప్రాచీన యుద్ధవిన్యాసాలను తలపించేలా ప్రదర్శించే చెడీతాలింఖానా ఆద్యంతం ఉద్విగ్నభరితంగా సాగుతుంది. కళ్ళకు గంతలు కట్టుకుని మనిషి శరీరం, కంఠం, నుదురు, పొత్తికడుపుపై కొబ్బరికాయలు, కాయగూరలు పెట్టి నరకడం వంటి విన్యాసాలు తాలింఖానాలో ముఖ్య ఘట్టాలు. అగ్గిబరాటాలు, లేడికొమ్ములు, పట్టాకత్తులతో వేగంగా, ఒడుపుగా కదులుతూ యువకులు చేసే విన్యాసాలు గ్రాఫిక్స్‌తో కూడిన సినీ పోరాటాలను చిన్నబుచ్చుతాయి. ఈ విద్య ప్రదర్శనలో క్షణకాలం, వెంట్రుకవాసి ఏమరుపాటు జరిగినా అవతలి వీరుడి శరీరంలో ఏదో ఒక అవయవం తెగిపడుతుంది. అందుకే చూసే వారంతా ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని నరాలు తెగే ఉత్కంఠకు లోనవుతారు. ఈ ఏడాది దశమి మంగళవారం వచ్చినందున బుధవారం రాత్రి విన్యాసాలు జరగనున్నాయి. స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తితో.. స్వాతంత్య్రానికి పూర్వం బ్రిటిష్ సేనలతో పోరాడే భారతీయుల్లో ఐక్యత కోసం బాలగంగాధర్ తిలక్ దసరా, వినాయక చవితి ఉత్సవాలను ప్రోత్సహించారు. ఆయన స్ఫూర్తితో 1856లో అమలాపురానికి చెందిన రైతుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు అబ్బిరెడ్డి రామదాసు ఈ విద్యకు అంకురార్పణ చేశారు. అమలాపురంలో 181 ఏళ్లుగా చెడీతాలింఖానా ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. కొంకాపల్లిలో 1835లో మొదటి తాలింఖానా ప్రదర్శన ప్రారంభమైంది. స్వాతంత్ర సమరయోధుడు రామదాసు 1856లో మహిపాలవీధిలో ఈ ప్రదర్శనలను ప్రారంభించారు. అమెరికా నుంచి వచ్చి శిక్షణనిస్తున్న ఇంజనీర్ ఆయన అనంతరం ఈ విన్యాసాలను నిర్వహించిన ఆయన మనవడు రామదాసు ఆరునెలక్రితం మృతి చెందారు. ఆయన కుమారుడు మల్లేష్ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్‌గా పని చేస్తున్న యువకుడు మల్లేష్. అయినా దసరా ఉత్సవాల కోసం అమలాపురం వచ్చారు. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న చెడీతాలింఖానా గురువుగా బాధ్యతలు చేపట్టి యువకులకు శిక్షణ ఇస్తున్నారు. 161వ వార్షికోత్సవాన్ని తండ్రి రామదాసుకు అంకితం ఇస్తున్నారు. కాగా రామదాసు విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆవిష్కరించనున్నారు. పలు వీధుల్లో ‘పోరు’దళాలు వీటితోపాటు గండు వీధి మైనర్స్ పార్టీ చెడీ తాలింఖానా విన్యాసాలకు 108 ఏళ్ల ఘన చరిత్ర ఉంది. ఇక నల్లా వీధిలో చెడీతాలింఖానా ప్రదర్శనలను 1967లో ప్రారంభించారు. కడలి అప్పారావు 1945లో శ్రీరామపురంలో మైనర్స్ పార్టీ చెడీ తాలింఖానా ప్రారంభించారు. రవణం మల్లయ్యవీధి తాలింఖానా ప్రదర్శన కూడా దశాబ్దాల చరిత్ర ఉంది. కనులకు ఇంపుగా ఊరేగింపులు దసరా ఉత్సవాల్లో పట్టణ ంలోని ఏడు వీధులలో కొలువు తీరిన వాహనాలను ఊరేగింపులో ప్రదర్శిస్తారు. బుధవారం రాత్రి బాజాభజంత్రీలు, డప్పువాయిద్యాలు, శక్తివేషధారణలు, కోయడ్యాన్సులు, బుట్టబొమ్మలు, మ్యూజికల్, తీన్మార్ బ్యాండ్లు, విద్యుత్‌దీపాలంకరణలతో వాహనాలు ముం దుకు సాగుతాయి. కొంకాపల్లి ఏనుగు అంబారీ, ఆంజనేయస్వామి వాహనం, మహిపాలవీధి రాజహంస, గండువీధి శేషశయన, రవణం వీధి మహిషాసుర మర్దిని, రవణం మల్లయ్యవీధి గరుడ విష్ణు, నల్లా వీధి శ్రీవిజయ దుర్గమ్మ వాహనం, శ్రీరామపురం హంస, శ్రీకృష్ణుడు, వినాయక వాహనాలను వీధుల్లో రాత్రి ఏడు గంటల నుంచి ఊరేగిస్తారు. ప్రధాన వీధుల్లో ఊరేగాక వాహనాలన్నీ ముమ్మిడివరం గేటు వద్దకు చేరుకుంటాయి. గురువారం ఉదయం వరకు వేడుక సాగుతుంది. జిల్లా నుంచే కాక రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి, తెలంగాణ నుంచి కూడా ఉత్సవాలను తిలకించేందుకు అమలాపురం తరలివస్తారు. -
మరో గిరిజన పసికందు మృతి
రాజవొమ్మంగి : ఏజెన్సీలో గిరిజన శిశువుల మృత్యుఘోష ఆగడం లేదు. సరైన వైద్య సదుపాయం అందక తాజాగా రాజవొమ్మంగి మండలంలో మరో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. అప్పలరాజుపేటకు చెందిన పేద కుటుంబంలోని గోరా దేవి అనే గిరిజన మహిళకు తొలి కాన్పులో పుట్టిన మగబిడ్డ చికిత్స పొందుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఆదివారం మరణించాడు. దేవికి జులై 15న రాజవొమ్మంగి పీహెచ్సీలో ఆ బిడ్డ జన్మించాడు. ఊపిరి పీల్చుకునేందుకు రెండు రోజులుగా ఈ బిడ్డ ఇబ్బంది పడుతుండడంతో తొలుత రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి స్టాఫ్ నర్స్ ఆ శిశువును రంపచోడవరం ఆసుపత్రికి రిఫర్ చేసింది. రంపచోడవరంలో చికిత్స పొందుతూ ఆ శిశువు ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. గత తొమ్మిది రోజుల్లో మండలంలో మృతి చెందిన గిరిజన శిశువుల సంఖ్య మూడుకు చేరింది. ఈనెల ఒకటో తేదీన పూదూడిలో వంతల రాజేశ్వరికి పుట్టిన 45 రోజుల వయసున్న మగబిడ్డ, మూడో తేదీన పాకవెల్తిలో భీంరెడ్డి లక్ష్మికి పుట్టిన రెండు నెలల వయసున్న ఆడబిడ్డ మరణించిన సంగతి తెలిసిందే. -
చెరువులో పడి చిన్నారుల మృతితో రేజర్లలో విషాదచాయలు
మిషన్ కాకతీయ పనులతో ప్రమాదం చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు.. రేజర్ల (సత్తుపల్లి రూరల్) : ఆ పిల్లలు దసరా సెలవుల్లో హాయిగా గడుపుదామని ఇంటికి వచ్చారు. ఆడుకుంటూ చెరువువైపు వెళ్లిన గేదెను తోలుకొద్దామని వెళ్లారు. అంతలోనే పెను ప్రమాదం. చెరువులో 15 అడుగుల గొయ్యి ఉందని తెలియని చిన్నారులు అందులో మునిగి చనిపోయారు. ప్రమాదంలో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన నక్కా ఏసు, కృష్ణవేణి దంపతుల కుమార్తె దివ్య (9), కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన గాదె సత్యవతి, మహేశ్వరరావు కుమారుడు అంజి (12) ఉన్నారు. ‘ఒక్కసారి లేచి మాట్లాడండ్రా’ అంటూ చిన్నారుల తల్లిదండ్రులు విలపించడంతో అక్కడి వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సెలవులకు పోలవరంలోనే ఉన్నా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. గొయ్యి ఉండటం వలే.. జీలుగుమిల్లి చెరువులో గతేడాది మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మట్టిని ఎక్కడబడితే అక్కడ లోతుగా తవ్వడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు పనుల్లో చుట్టూ కందకం ఏర్పాటుచేసి గట్టు వేయాల్సి ఉండగా ప్రమాదం జరిగిన ప్రదేశం (చెరువు మొదటి భాగం)లో సుమారు 15 అడుగుల లోతులో గోతులు తీశారు. చెరువు మొదటి భాగంలో అడుగు నుంచి 2 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. అలాంటిది చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు గోతులు తీసి మట్టి తరలించుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. చెరువు మొదట్లోనే అంతలోతు గొయ్యి తీసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి సీఐ పి.రాజేంద్రప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
‘మీ సేవ’లో నకిలీ పహణీలు
సృష్టించిన రెవెన్యూ అధికారులు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన సమగ్ర విచారణ జరిపించాలంటున్న రైతులు అశ్వాపురం : ఇద్దరు వ్యక్తులకు చెందినట్లుగా సుమారు 50 ఎకరాల భూమికి రెవెన్యూ అధికారులే ‘మీ సేవ’లో నకిలీ పహణీలు సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. మండల పరి«ధిలోని నెల్లిపాక రెవెన్యూ పరిధిలోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన గులాంమొహిద్దీన్కు సుమారు 190 ఎకరాల భూమి ఉంది. ఆయన గ్రామంలోని సుమారు 100 మంది రైతులకు ఆ భూమిని విక్రయించాడు. ఆ భూమికి అనుసంధానంగా గ్రామంలోని ఓ ఇద్దరు రైతులకు ఏడెకరాల భూమి ఉంది. కానీ, ఆ ఇద్దరు రైతులకు 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో 50.31 ఎకరాల భూమి ఉన్నట్లుగా రెవెన్యూ అధికారులు నకిలీ ‘మీ సేవ’ పహణీలు సృష్టించారు. చట్టుపక్కల ఉన్న రైతులు గమనించి అశ్వాపురం తహసీల్దార్ కుసుమకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ సెప్టెంబర్ 20న 190/100/3/ఆ, 190/100/2/ఆ/1 సర్వే నంబర్లలో భూమికి సంబంధించి ఆధారాలు ఐదు రోజుల్లో తహసీల్దార్ కార్యాలయంలో అందజేయాలని సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ వారు స్పందించలేదు. గతంలో కూడా మొండికుంటకు చెందిన ఓ వ్యక్తి పేరు మీద 10 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీ వెలుగులోకి వచ్చింది. కొంతమంది తహసీల్దార్‌కు ఫిర్యాదు చేయగా ఆన్లైన్ నుంచి తొలగించారు. ఈ నకిలీ పహణీలు గతంలో తహసీల్దార్‌గా పనిచేసి పదవీవిరమణ పొందిన మల్లీశ్వరి హయాంలో ఇచ్చినవని రైతులు పేర్కొంటున్నారు. -ఆందోళన చెందుతున్న రైతులు.. సర్వే నంబర్లలో ఏ విధమైన భూమి లేకుండా మొండికుంటకు చెందిన వ్యక్తికి 10 ఎకరాలు, రామచంద్రాపురానికి చెందిన ఇద్దరు వ్యక్తులకు 50.31 ఎకరాలకు నకిలీ ‘మీ సేవ’ పహణీలు ఇవ్వడంపై ఆ సర్వే నంబర్లకు అనుబంధంగా ఉన్న సర్వే నంబర్ల రైతులు భవిష్యత్తులో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయేమోనని ఆందోళన చెందుతున్నారు. నెల్లిపాక రెవెన్యూలో ఎన్నో ఏళ్లుగా భూములు సాగు చేసుకుంటున్నా ‘మీ సేవ’ పహణీలు ఇవ్వని రెవెన్యూ అధికారులు భూమి లేకుండా నకిలీ మీసేవ పహణీలు ఇవ్వడంపై రైతులు మండిపడుతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నకిలీ మీసేవ పహణీలను తొలగించి, సమగ్ర విచారణ జరిపించాలని రైతులు కోరుతున్నారు. -ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం.. బి.కుసుమ, తహసీల్దార్, అశ్వాపురం నకిలీ మీసేవ పహణీల విషయంపై రైతులు ఫిర్యాదు చేశారు. అవి రెండేళ్ల కిందట ఇచ్చినవి. ఈ విషయంపై వీఆర్ఓ, ఆర్ఐతో పూర్తిస్థాయి విచారణ జరిపించి ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్తాం. పహణీలు ఆన్లైన్ నుంచి తొలగిస్తాం. -
‘గూడెం’లో కాజల్ సందడి
కొత్తగూడెం అర్బన్: కొత్తగూడెంలో శనివారం సినీ నటి కాజల్ అగర్వాల్ సందడి చేశారు. గణేష్ టెంపుల్ ఏరియాలో వస్త్ర షాపింగ్ మాల్‌ను ఆమె ప్రారంభించారు. అన్ని ఫ్లోర్లలోని చీరలను చూశారు. షాపింగ్ మాల్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన బతుకమ్మను తలపై పెట్టుకుని, అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాకు రెండోసారి రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. తనను ఆహ్వానించిన వస్త్ర షాపింగ్ మాల్ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాల్‌ను అందరూ ఆదరించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రంలో నటించే అవకాశం తనకు వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. నటించేటప్పుడు ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. తనను చూసేందుకు వచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. -
రికార్డుల్లో నమోదు చేయాలి
భువనగిరి అర్బన్ : గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని డీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. గ్రామాల్లో పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయని, ఆన్ ఆఫ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సమస్య పరిష్కరించాలని, నూరు శాతం పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీవరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రికార్డులను తప్పనిసరిగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్పీఓ ఎ. రవికుమార్, ఎండీపీఓ గోపాలకి షన్‌రావు, భగవన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు నర్సింహ, శ్రీనివాస్, దినాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు. -
రైలు ప్రమాదంలో యువకుడు మృతి
ఉద్యోగం కోసం వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదం శోక సంద్రంలో కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం క్రైం : కోటి ఆశలతో కొత్త జీవితం ప్రారంభించాలని ఉవ్విళ్ళూరుతూ ఇంటికి చేరాల్సిన యువకుడు రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఇంటికి ఆసరాగా ఉంటాడనుకున్న వాడే కానరాని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ కుటుంబం దిక్కు తోచని స్థితిలో ఉంది. వివరాలు.. రాజమహేంద్రవరం సిద్దార్థ నగర్ కు చెందిన దాడి శివ(30) హోమ్ గార్డుగా ట్రైనింగ్ పొందేందుకు రెండు రోజుల క్రితం హైదరాబాద్ వెళ్లాడు. ట్రైనింగ్ అనంతరం ఉద్యోగ నియమక పత్రంతో ఇంటికి చేరి కొత్త జీవితం ప్రారంభించాలనుకున్న ఆయన ఆశలు ఆవిరయ్యాయి. గౌతమి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరం వస్తుండగా సోమవారం ఉదయం గోదావరి రైల్వే స్టేషన్లో రైలు నెమ్మదిగా వెళ్తుండగా రన్నింగ్ లో దిగిపోయాడు. ఈ క్రమంలో ఎదురుగా కరెంట్ స్తంభాన్ని ఢీ కొని వేగంగా వెనక్కు వచ్చి రైలు కింద పడిపోయి ఎడమ చేయి తెగిపోయి తీవ్ర గాయాలపాలైయ్యాడు. హుటాహుటిన ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా తీవ్ర రక్త స్రావం కావడంతో మృతి చెందాడు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇతని వద్ద బ్యాగ్‌లో ఉన్న సర్టిఫికెట్లు, టికెట్ ఆధారంగా చిరునామా గుర్తించారు. ప్రమా దంపై కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శోక సముద్రంలో కుటుం సభ్యులు మృతుడు దాడి శివకు భార్య, ఒక పాప ఉన్నారు. ఉద్యోగం సంపాదించి తమ కుటుంబాన్ని పోషిస్తాడనుకున్న కుటుంబ సభ్యుల ఆశలు అడి ఆశలయ్యాయి. ఉద్యోగ నియామక పత్రం చూపించి తమ కుటుంబ సభ్యులతో ఆనందం పంచుకోవాలని సంతోషంతో వచ్చిన శివ మృతి కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిల్చింది. కుటుంబ సభ్యుల రోదనలతో ప్రభుత్వ ఆస్పత్రి మారుమ్రోగింది. -
గర్ల్ ఫ్రెండ్ కోసం వచ్చి..
వరుస చోరీలు.. మానుకోటలో దొంగతనాలకు పాల్పడిన యువకుడి అరెస్ట్ 16 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం నిందితుడు పాత నేరస్తుడే బాల్యం నుంచే చోరీల బాట మహబూబాబాద్ : అతడో గజ దొంగ.. ఇంటికి కన్నం వేశాడంటే బీరువాలో ఉన్నదంతా దోచేయాల్సిందే. బాల్యం నుంచే చోరీల్లో ఆరితేరిన ఈ దొంగకు ఇటీవల మానుకోటకు చెందిన ఓ అమ్మాయి పరిచయం కావడంతో ఇక్కడి ఇళ్లపై అతడి కన్నుపడింది. ఆమెను కలిసేందుకని వచ్చిన అతడు ఇక్కడ కూడా తన చోరకâýæ ప్రదర్శించాడు. స్థానిక టౌ¯ŒS పోలీస్‌స్టేçÙ¯ŒSలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ బి.రాజమహేంద్ర నాయక్ చోరీ వివరాలను వెల్లడించారు. ఖమ్మంకు చెందిన బొల్లిశెట్టి శ్రీనివాస్ అలియాస్ బన్ను ప్రస్తుతం సత్తుపల్లిలోని తన అమ్మమ్మ వద్ద ఉంటున్నాడు. చిన్నతనం నుంచే జల్సాలకు అలవాటుపడిన ఇతడు మైనర్‌గా ఉన్నప్పుడే మూడుసార్లు జైలుకు వెళ్లొచ్చాడు. అతడికి మానుకోటకు చెందిన ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడడంతో తరచూ ఇక్కడికి వస్తుండేవాడు. ఈ క్రమంలోనే అతడు పట్టణంలోని బుక్క బజార్‌కు చెందిన కొదుమూరి శివకుమార్ ఇంట్లో 12 తులాల బంగారు ఆభరణాలు(హారం, నక్లెస్, బ్రాస్లైట్, టైటా¯ŒS వాచ్, ఇతరత్ర), రాంచంద్రాపురం కాలనీలోని బానోత్ భీముడు ఇంట్లో 10 గ్రాముల(చెవుల కమ్మలు) బంగారం, బెస్తబజార్లోని డోలి అరుణ ఇంట్లో రెండు తులాల బంగారు ఆభరణాలను అపహరించాడు. ఈ క్రమంలో శనివారం అతడు మానుకోటలో మళ్లీ చోరీలకు పాల్పడేందుకు వస్తుండగా పట్టణ శివారులోని వైఎస్ఆర్ విగ్రహం సమీపంలో టౌ¯ŒS సీఐ నందిరామ్ నాయక్, సిబ్బంది శనివారం వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకొని వి చారించగా చోరీల విషయం వెల్లడించాడు. ఆ ఆభరణాలను రైల్వే ఓవర్‌బ్రిడ్జి కిందలో గుంతలో దాచిపెట్టినట్లు అతడు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాస్‌ను రిమాండ్‌కు తరలించారు. కొత్తగూడెంలోని గురునాథం ఇంట్లో కూడా చోరీకి పాల్పడగా ఆ బంగారు ఆభరణాలు కూడా స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. -
ఉగ్రరూపం.. ఉప‘ద్రవం’
-
కల్లూరులో స్వచ్ఛంద బంద్
రాజకీయాలు ఎన్నికలకే పరిమితం రెవెన్యూ డివిజన్ కోసం పోరాడుదాం: సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర కల్లూరు : కల్లూరును రెవెన్యూ డివిజన్ కేంద్రంగా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించే వరకు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. కల్లూరులో బుధవారం నిర్వహించిన బంద్‌లో ఆయన పాల్గొన్నారు. నిరాహారదీక్ష శిబిరాన్ని సందర్శించి ప్రసంగించారు. రాజకీయాలు ఎన్నికలకే పరిమితమన్నారు. రెవెన్యూ డివిజన్ కేంద్రం ప్రకటన వరకు కలిపి పోరాడుదామని పిలుపునిచ్చారు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. భౌగోళిక స్వరూపాన్ని మార్చి చూపించడం వల్లనే శాస్త్రీయత లోపించిందన్నారు. ఇది కాస్త రెండు ప్రాంతాల ప్రజల మధ్య భేదాభిప్రాయాలకు దారితీసే అవకాశం ఉందన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కి.మీ పరిధిలో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఉండాలనే నిబంధన ఉన్నా వైరాను ఎందుకు ఎంచుకున్నట్లు అని ప్రశ్నించారు. కల్లూరు అన్ని మండలాలకు సమానదూరంలో ఉంటుందన్నారు. రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ఇంకా ప్రాథమిక దశలోనే ఉందన్నారు. దీనిపై జిల్లా మంత్రి తుమ్మల, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, జిల్లా కలెక్టర్ లోకేష్‌కుమార్, జేసీ దివ్యను కలిసి వినతిపత్రాలు సమర్పించామన్నారు. హేతుబద్ధత గల భౌగోళిక స్వరూపాన్ని పరిశీలించి ప్రభుత్వం కల్లూరులో రెవెన్యూ డివిజన్ కేంద్రం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే సండ్రతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కూసంపూడి రవీందర్, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసి రాష్ట్ర నాయకులు గోకినపల్లి వెంకటేశ్వరరావు, అఖిలపక్షం నాయకులు పెద్దబోయిన దుర్గాప్రసాద్, కాటమనేని వెంకటేశ్వరరావు, కర్నాటి అప్పిరెడ్డి, ఎ. వెంకన్న, గొర్రెపాటి రాధయ్య, గంగుల పుల్లారావు, జాస్తి శ్రీనివాసరావు పాల్గొన్నారు. – బంద్ సందర్భంగా వ్యాపార, విద్యాసంస్థలు, హోటళ్లు మూసివేశారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
భూపాలపల్లిలో చేర్చండి
వాజేడు మండల వాసుల రాస్తారోకో వాజేడు : వాజేడు మండలాన్ని వరంగల్ జిల్లా నుంచి నూతనంగా ఆవిర్భవించనున్న భూపాలపల్లి (జయశంకర్) జిల్లాలో కలపాలని కోరుతూ మండల వాసులు సోమవారం ఆందోళన నిర్వహించారు. వివిధ పార్టీల ఆధ్వర్యంలో 163వ జాతీయ రహదారి అయిన గోదావరి బ్రిడ్జిపై రాస్తారోకో చేశారు. తమకు ఎంతో దూరంలో ఉన్న కొత్తగూడెం జిల్లాలో కాకుండా.. అనుకూలంగా ఉండే భూపాలపల్లిలో కలపాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెంలో కలిపితే తీవ్ర నష్టం జరుగుతుందని వివిధ పార్టీల నాయకులు అన్నారు. అదే భూపాలపల్లిలో కలిపితే గిరిజనులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు సానుకూలంగా ఉంటుందన్నారు. బ్రిడ్జిపై దాదాపు గంటపాటు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ధర్మారం గ్రామంలో విద్యార్థులతో కలిసి భారీ ర్యాలీ తీశారు. ఇన్చార్జ్ తహశీల్దార్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఏజన్సీలో వర్షం
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలో శనివారం వర్షం పడింది. జిల్లాలోని 25 మండలాల్లో శనివారం ఉదయం 10 గంటల వరకు 5.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలం అటవీ ప్రాంతంతోపాటు గోదావరీ పరీవాహక ప్రాంతంలో వర్షం పడింది. వెంకటాపురం నుంచి కొత్తగూడెం వరకు ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా చర్ల మండలంలో 3.88 సె.మీ వర్షపాతం నమోదైంది. పది మండలాల్లో 1–3 సెం.మీ. మధ్య, 14 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ. ఈ నెల 10వ తేదీ నాటికి 54.6 మి.మీ. పడాలి. దీనికన్నా ఎక్కువగా (69.1 మి.మీ.) వర్షం కురిసింది. వారం తరువాత వాన బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సెప్టెంబర్ ఆరంభం నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 3వ తేదీన వరుణుడు మొఖం చాటేశాడు. మళ్లీ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ‘లానిన’ ప్రభావం ఉంటుందని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది. పైర్లకు ప్రయోజనం ప్రస్తుత వానతో పైర్లకు ఎంతగానో ప్రయోజనముంటుంది. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో వర్షాధారంగా వేసిన పైర్లు బెట్టకు గురవుతున్నాయి. ఈ తరుణంలో కురిసన వర్షం.. పైర్లకు ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలో సాగు చేస్తున్న పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఈ వర్షాలు అనుకూలిస్తాయి. -
అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలి
జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత కూసుమంచి: అక్షరాస్యత సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యతలో రాష్ట్రం దేశంలో 32వ స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు చదవడం, రాయడం నేర్చుకున్న రోజే సమాజం మీద వారికి అవగాహన కలిగి అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలోని సాక్షరభారత్ కేంద్రాలను పటిష్టంగా నిర్వహిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సాక్షరభారత్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కాత్యాయని మాట్లాడుతూ సాక్షరభారత్ కేంద్రాల ద్వారా జిల్లాలో 6.95 లక్షల మంది అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ఐదు వయోజన విద్యాకేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా మార్చి కంప్యూటర్, ఎల్సీడీలను సమకూర్చినట్లు తెలిపారు. అంతకు ముందు అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షరభారత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సాక్షరభారత్ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఓలు, వీసీఓలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడ్త్యియ రాంచంద్రునాయక్, బారి శ్రీను, సాక్షరభారత్ డీడీ ధనరాజ్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్ఎం లక్ష్మీనారాయణ, ఎస్ఎంసీ చైర్మన్ హకీంపాషా, డీసీఓలు రమ్య, భవానీ, ఎంసీఓలు కళ్లెం అంజిరెడ్డి, నూకల చెన్నయ్య, వీరయ్యలు పాల్గొన్నారు. -
పల్లెకు డెంగీ
జ్వరాలతో మూలుగుతున్న ప్రజలు రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఇప్పటికీ 20 మందికి పైగా మృత్యువాత గ్రామాలు విడిచి వెళ్తున్న పల్లెవాసులు ఖమ్మం / కొణిజర్ల : వారం రోజులుగా జిల్లాలోని పల్లెలను డెంగీ వణికిస్తోంది. ఏ పల్లెలో చూసినా మంచాన పడిన మహిళలు, మూలుగుతున్న ముసలవ్వలు, తాతలు, నీరసంగా నడవలేని స్థితిలో ఉన్న చిన్నారులే కనిపిస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతంతోపాటు, మైదాన ప్రాంతాల్లోని పల్లెల్లో సైతం ఇలాంటి దృశ్యాలే. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే వందకు పైగా డెంగీ కేసులు నమోదు కాగా.. జిల్లావ్యాప్తంగా 20 మందికి పైగా జ్వరాలతో మృతి చెందారు. జ్వరాలు రావడం, వైద్య పరీక్షల్లో డెంగీ పాజిటివ్ కేసులు అధికం కావడం ఉన్నట్టుండి ప్లేట్లెట్స్ పడిపోవడంతో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యశాలలు జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. జ్వరాలతో బాధపడుతున్నవారు ఎక్కువగా ఉంటే కొందరు ఆ గ్రామాన్ని విడిచి వెళ్తున్నారు. –రోజురోజుకూ పెరుగుతున్న డెంగీ కేసులు.. కొణిజర్ల మండలం సింగరాయపాలెం, తుమ్మలపల్లి, తల్లాడ మండలం మల్లాపురం, సింగరేణి మండలం చీమలపాడు గ్రామాల్లో డెంగీ జ్వరాలు అధికంగా ఉన్నాయి. సింగరాయిపాలెంలో సుమారు 100 మందికి పైగా జ్వరాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొణిజర్లలో ప్రయివేట్ వైద్యశాలలో రోజుకు 100 మంది వరకు జ్వరాలతో చేరుతున్నారు. మల్లాపురం, చీమలపాడు గ్రామాలకు చెందిన వంద మందికి పైగా డెంగీ పాజిటివ్ కేసులు రావడం, ప్లేట్లెట్లు పడిపోవడంతో అత్యవసర చికిత్స కోసం ఖమ్మం నగరంలోని ప్రైవేట్ వైద్యశాలల్లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. సింగరాయిపాలెం గ్రామానికి చెందిన మేడి కొండలరావు కుటుంబానికి చెందిన సోదరుడు దానేల్, సారమ్మ, జ్యోతి, మేషక్, శైలజ, మల్లాపురం గ్రామానికి చెందిన కృష్ణయ్య, నీలమ్మ, ప్రవీణ, నాగబాబుల కుటుంబం మొత్తం డెంగీతో ఇబ్బందులు పడుతున్నారు. వారిలో మేడి మేషక్ ప్లేట్లెట్లు 15 వేలకు పడిపోవడంతో హుటాహుటిన హైదరాబాద్‌కు తరలించారు. –పెరుగుతున్న మరణాలు జ్వరం రావడం ప్లేట్లెట్లు తగ్గి ఉన్నట్టుండి మృత్యువాత పడుతున్నవారి సంఖ్య సింగరాయిపాలెం, మల్లాపురం గ్రామాల్లో రోజురోజుకూ పెరుగుతోంది. నాలుగు రోజుల్లో సింగరాయిపాలెం గ్రామానికి చెందిన గోగుల నరసింహారావు, బలమాల జయరాజు, మోటపోతుల రాణి, కంకణాల లచ్చమ్మ మల్లాపురం గ్రామంలో గారపాటి వెంకమ్మ (60), వెంపటి రాములమ్మ (17), మేడి చిన్నమ్మాయి (77) దొనకొండ లక్ష్మీనరసమ్మ (50), దుగ్గిదేవర వెంకయ్య (60) జ్వరాలతో మృతి చెందారు. సింగరాయిపాలెం ఖాళీ... జ్వరాల భయంతో సింగరాయపాలెం, తుమ్మలపల్లి గ్రామాల ప్రజలు ఇళ్లు వదిలిపెట్టి బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. ఇంట్లో ఒకరికి వస్తే విషజ్వరాలు ఆ వీధంతా సోకుతుండటంతో తమకు జ్వరాలు రాకుండా ముందుగానే గ్రామాన్ని విడిచి పెట్టి పోతున్నామని గ్రామస్తులు చెబుతున్నారు. ఒక్క సింగరాయపాలెంలోనే సుమారు 50 కుటుంబాల వారు ఇళ్లు వదిలి బంధువుల ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. -
పేదల గుండెల్లో వైఎస్
పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదలు ఆరోగ్యశ్రీతో ఆదివాసీలకు వైద్యం గిరిపుత్రులకు అటవీ హక్కు పత్రాలు 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల రుణ మాఫీ వైఎస్ వర్థంతి సందర్భంగా స్మరించుకుంటున్న జిల్లా ప్రజలు సాక్షి ప్రతినిధి, ఖమ్మం: పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి.. వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. తన పాలనలో ఏ పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దన్న ఆలోచనతో ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని, పేదలకు కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని, ప్రతి ఒక్కరి ఇంటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను, ఆసరగా ఉండేందుకు పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తన హయాం స్వర్ణ యుగమని చెప్పుకునేలా చేశారు. నేడు వైఎస్ 7వ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలు నివాళులర్పిస్తున్నారు. గూడు లేని నిరుపేదలకు వైఎస్ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరంలా మారింది. వైఎస్ అధికారం చేపట్టిన తర్వాత ఇందిరమ్మ పేరుతో మూడు విడతల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయం పెంచి, అడిగిన వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగంగా కట్టుకోవడానికి బిల్లులు సైతం చెల్లించారు. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 2,69,610 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2.15 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి. ఆదివాసీలకు పోడుపై హక్కును కల్పిస్తూ వైఎస్ ప్రభుత్వం పత్రాలు పంపిణీ చేసింది. ‘‘ఏళ్లతర బడి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు.. ఇక నుంచి దొంగల్లా కాకుండా దొరల్లా బతకండి’’– 2009 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో గిరిజనులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో నాటి సీఎం వైఎస్సార్ అన్న మాటలివి. నాడు హక్కు పత్రాలు పొందిన గిరిజనులు తమ పోడు భూముల్లో మాగాణి పంటలు పండించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 691 గ్రామాలకు చెందిన 31,961 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు వైఎస్ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఆదేశాలతో 2008 నుంచి 2010 వరకు జిల్లాలోని 38 ఏజెన్సీ మండలాల్లో డీఎల్సీ ఆమోదం పొందిన 2.10 లక్షల ఎకరాలను అధికారులు పంపిణీ చేశారు. కొత్తగూడెం పట్టణంలో నివసిస్తున్న వారికి తాము నివసిస్తున్న ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ 373 జీఓ ఇచ్చారు. సింగరేణి సంస్థ ఏర్పాటుతో 120 ఏళ్ల క్రితం కొత్తగూడెం పట్టణం ఏర్పడింది. మొత్తం స్థలమంతా సింగరేణి ఆధీనంలోనే ఉండేది. అప్పటి నుంచి నివాసం ఉంటున్నప్పటికీ కొత్తగూడెం వాసులకు ఎలాంటి యాజమాన్య హక్కులు కలగలేదు. 2004లో నగర బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన వైఎస్.రాజశేఖరరెడ్డికి స్థానికులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి సమస్యను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. 2005 మార్చి 24న 373 జీఓ జారీ చేశారు. + 2008లో వైఎస్ఆర్ ఒకేసారి బేషరతుగా రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందారు. జిల్లాలో 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. అంతేకాదు, మళ్లీ రైతులకు రుణాలు ఇచ్చారు. బ్యాంకుల్లో రుణ బకాయిలు లేని రైతులకు కూడా ప్రయోజనం కలిగించేందుకుగాను జిల్లాలోని దాదాపు 70 వేల మంది రైతులకు రూ.5000 చొప్పున ప్రోత్సాహకాలను బ్యాంకుల ద్వారా అందించారు. అప్పటివరకు అరకొరగా కొంతమందికే వచ్చే పింఛన్ అందేది. వైఎస్ అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారిగా పింఛన్‌ను రూ.200లకు పెంచారు. జిల్లాలో అర్హులైన 2లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్ అందజేశారు. ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది అర్హులున్నా ఒకరికి మాత్రమే ఇస్తున్నారు. నిరుపేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వరంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జిల్లాలోని నిరుపేద, గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించారు. ఈ విద్యార్థులే ఏటా 10లక్షల మంది రూ.1300 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్మెంట్ పొందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలను వైఎస్సార్ ప్రారంభించారు. జిల్లాలో 2008, జూలై 17 న ఈ సేవలు మొదలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ఐదు ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు. జిల్లాలో ఈ పథకం కింద 2016, జూన్ 27వ తేదీ వరకు 93,300 మంది రోగులు లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో జిల్లాకు రూ.260.30 కోట్లను వెచ్చించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత విద్యుత్ ఎందరో రైతులకు వరప్రదాయని అయింది. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకుండా ఉన్న రైతులను ఆదుకునేందుకుగాను ఉచిత విద్యుత్ పథకాన్ని అధికారంలోకి రాగానే వైఎస్ ప్రారంభించారు. జిల్లాలో 1.05లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాటి నుంచి ఉచిత విద్యుత్ అందుతోంది. -
మిర్యాలగూడను నల్లగొండలో ఉంచేందుకే..
మిర్యాలగూడ : మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ జిల్లాలో ఉంచడానికే పార్టీ మారానని స్థానిక ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు అ న్నారు. బుధవారం స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. మిర్యాలగూడకు చెందిన వ్యాపారులు, డాక్టర్లు, మిల్లర్లు, న్యా యవాదులు అంతా కలిసి మిర్యాలగూడను నల్లగొండలో ఉంచాలని తనను కోరానని తెలిపారు. అయితే తాను కాంగ్రెస్‌లో ఉంటే అది సాధ్యం కాదని గుర్తించి పార్టీ మారానని చెప్పా రు. మొదట మిర్యాలగూడను జిల్లా చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కోరానని, అది సాధ్యం కాకపోవడం తో న ల్లగొండలో ఉంచాలని కోరిన ట్లు పే ర్కొన్నారు. అంతకు ముందుగా కౌన్సిలర్లు మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గాన్ని నల్లగొండ లో ఉంచడానికి కృషి చేసిన ఎంపీ గు త్తా సు ఖేందర్రెడ్డికి, ఎమ్మెల్యే నల్లమో తు భా స్కర్రావుకు కృతజ్ఞతలు తెలిపా రు. షీ టాయిలెట్స్ నిర్మాణానికి తీర్మానం... పట్టణంలో మహిళల కోసం షీ టాయిలెట్స్ నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసింది. పట్టణంలోని నాల్గో వార్డులోని సౌజన్య లాడ్జి సమీపంలో ఉన్న మున్సిపల్ స్థలంలో వీటిని నిర్మించాలని తీర్మానం చేశారు. అదే విధంగా కాంట్రాక్టు సిబ్బందికి వేతనాలు ఇవ్వని కాంట్రాక్టర్‌ను కూడా బ్లాక్ లిస్టులో పెట్టాలని తీర్మానించారు. సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తిరునగరు నాగలక్ష్మీ బార్గవ్ అధ్యక్షత వహించగా మున్సిపల్ కమిషనర్ సత్యబాబు, వైస్ చైర్మన్ మగ్దూమ్పాషా, కౌన్సిలర్లు వంగాల నిరంజన్‌రెడ్డి, నామిరెడ్డి దయాకర్‌రెడ్డి, అన్నభీమోజు శ్రవంతి, నూకల కవిత, మాజిద్, రేపాల పురుషోత్తంరెడ్డి, మహ్మద్ గని, పాండు పాల్గొన్నారు. -
జిల్లాలో వర్షాలు
– 1.24 సెం.మీ. వర్షపాతం నమోదు – వెంకటాపురం మండలంలో అత్యధికంగా 7.04 సెం.మీ. ఖమ్మం వ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. సగటున 1.24 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం, కూసుమంచి, వేంసూరు, సింగరేణి మండలాల్లో మాత్రం చినుకు జాడ కనిపించలేదు. అత్యధికంగా భద్రాచలం అటవీ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వెంకటాపురం మండలంలో అత్యధికంగా 7.04 సెం.మీ., మూడు మండలాల్లో 3 నుంయచి 6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. మధిర మండలంలో 4.46 సెం.మీ., వాజేడు మండలంలో 3.96 సెం.మీ., అశ్వారావుపేట మండలంలో 3.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 12 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీ. మధ్య కురిసింది. వైరా మండలంలో 2.68 సెం.మీ., బయ్యారం మండలంలో 2.60 సెం.మీ., బోనకల్లు మండలంలో 2.10 సెం.మీ., దమ్మపేట మండలంలో 2.06 సెం.మీ., దుమ్ముగూడెం మండలంలో 1.94 సెం.మీ., చండ్రుగొండ మండలంలో 1.88 సెం.మీ.; మణుగూరు, జూలూరుపాడు మండలాల్లో 1.74 సెం.మీ., కామేపల్లి మండలంలో 1.54 సెం.మీ., ముల్కలపల్లి మండలంలో 1.44 సెం.మీ., చర్ల మండలంలో 1.38 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మైదాన ప్రాంతంలోగల 21 మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, వాజేడు, వెంకటాపురంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆగస్టు లోటు వర్షపాతం భర్తీ కాలేదు. ఆగస్టు నెల వర్షపాతం 276 మి.మీ. 30వ తేదీ నాటికి 267.3 మి.మి. వర్షం కురవాలి. 30వ తేదీ వరకు 129.9 మి.మీ. వర్షపాతమే నమోదైంది. ఇంకా –51.4 శాతం లోటు వర్షపాతం ఉంది. నాటు వేసిన వరికి, సాగులో ఉన్న పత్తికి, మొక్కజొన్నకు, నాటుతున్న మిర్చికి ఈ వర్షం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిర్చి దుక్కుల్లో పైరు నాటడానికి బాగా ఉపయోగపడుతుంది. ‘తాలిపేరు’ గేట్లు ఎత్తివేత పెదమిడిసిలేరు (చర్ల): పెదమిడిసిలేరు సమీపంలోగల తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోగల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో మంగళవారం తెల్లవారుజామున ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో, ప్రాజెక్టుకున్న మొత్తం 25 క్రషర్ గేట్లకుగాను మంగళవారం మధ్యాహ్నం ఎనిమిది గేట్లను, సాయంత్రానికి మరో రెండు గేట్లను ఎత్తివేసి 20,000 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశముండడంతో ప్రాజెక్టులోకి మరింతగా వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని ప్రాజెక్ట్ జేఈ వెంకటేశ్వరావు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు. -
కుస్తీ మే సవాల్
రెజ్లింగ్‌లో రాణిస్తున్న ఓరుగల్లు పహిల్వాన్లు జాతీయ స్థాయిలో పతకాలు కైవసం అంతర్జాతీయ పోటీల్లో సత్తాచాటేందుకు కృషి వరంగల్ స్పోర్ట్స్: కండబలం.. ఉడుముపట్టు.. నైపుణ్యం కలగలిపిన ఆట రెజ్లింగ్. క్రీడాకారులు పోటీల్లో గెలిచేందుకు వినూత్న పద్ధతులు అవలంబిస్తుం టారు. ప్రత్యర్థిని మట్టి కరిపించేందుకు తొడగొట్టి సవాల్ చేస్తుంటారు. అయితే కండలు తిరిగిన పహిల్వాన్ల క్రీడగా పేరొందిన రెజ్లింగ్‌లో జిల్లా క్రీడాకారులు రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణిస్తున్నారు. వివిధ పతకాలు సాధిస్తూ ప్రముఖుల ప్రశంసలు అందుకుంటున్నారు. రెజ్లింగ్‌లో మనదేశానికి చెందిన క్రీడాకారులు సత్తాచాటుతున్నారు. తాజాగా జరుగుతున్న రియో ఒలింపిక్స్‌లో మహిళల 58 కేజీల విభాగంలో భారత క్రీడాకారిణి ‘సాక్షి మాలిక్’ అద్భుత ప్రదర్శన ఇచ్చి కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే. అయితే సాక్షిమా లిక్తోపాటు నర్సింగ్యాదవ్లాంటి అత్యుత్తమ క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకున్న జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు, యువకులు రెజ్లింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతూ రాణిస్తున్నారు. ప్రాచీన విద్యగా కుస్తీ పోరాట క్రీడల్లో కుస్తీ అతి ప్రాచీనమైన విద్య. పోరాటాల్లో బరిలో దిగి ఎదుటి వ్యక్తిని మట్టి కరిపించేందుకు కండలు తిరిగిన వీరులు హోరాహోరీగా తలపడడమే కుస్తీ ప్రాముఖ్యత. అయితే ఇందులో పాల్గొనే బలవంతులను పహిల్వాన్లు అం టారు. క్రీస్తు పూర్వం 13లేదా 12వ శతాబ్దంలో కుస్తీ ప్రాచీన భారతీయ విద్యగా ప్రారంభమైనట్లు చరిత్ర చెబుతోంది. 15 వేల సంవత్సరాల క్రితం ఫ్రాన్స్, ఈజిప్టియన్లో ఈ విద్య కొనసాగిందని కొంద రు చెబుతున్నప్పటికీ అందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. కాగా, పదిహేను, ఐదో శతాబ్దాల నడుమ ఫ్రాన్స్, జపాన్, ఇంగ్లం డ్ దేశాల్లో రాజకుటుంబాలు కుస్తీని పెంచిపోషించినట్లు తెలుస్తుంది. కుస్తీ ద్వారా శత్రువులను మట్టికరిపించి రాజ్యాలను రక్షించుకోవడం, ఆక్రమించుకోవడం జరిగినట్లు చరిత్రలో పేర్కొన్నారు. 1904లో ఒలింపిక్స్‌లో స్థానం మొట్టమొదటి జాతీయ కుస్తీ టోర్నమెంట్ 1888లో న్యూయార్క్‌లో జరిగింది. 1904 లో ఈ ఆటను ఒలంపిక్స్‌లో చేర్చారు. కాగా, 1912లో యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అసోసియేషన్ స్థాపించారు. కుస్తీలో ఫ్రీసై్టల్, బీచ్, ఆయిల్ విభాగాలు ఉం టాయి. ప్రొఫెషనల్ కుస్తీల్లో మహిళలు, పురుషులకు వేర్వేరుగా పోటీలను నిర్వహిస్తారు. రాణిస్తున్న రాజేశ్వరి పర్వతగిరి మండలంలోని కల్లెడ గ్రామానికి చెందిన బి. రాజేశ్వరి ఐదేళ్లుగా కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ కుస్తీలో కోచ్ అశోక్‌నాయక్ దగ్గర శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదువుతున్న రాజేశ్వరి ఐదేళ్లలో మూడు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంది. గత ఏడాది వరంగల్, మహారాష్ట్రలో జరి గిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని రెండు కాంస్య పతకాలు సాధించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్‌ను స్ఫూర్తిగా తీసుకుని కుస్తీలో మరింత పట్టు సాధించి అంతర్జాతీయస్థాయిలో రాణిస్తానని చెప్పింది. వికసిస్తున్న వినోద్ జిల్లాలోని కురవి మండలానికి చెందిన ఆర్. వినోద్ రెజ్లింగ్‌లో సత్తాచాటుతున్నారు. చిన్నప్పటి నుంచే కుస్తీపై ఆసక్తి పెంచుకున్న ఆయన అందులో ప్రత్యేక శిక్షణ పొందాడు. ఇందులో భాగంగా వినోద్ ఐదేళ్లుగా కుస్తీలో మెళకువలు సాధించాడు. గత ఏడాది మహారాష్ట్రలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో రాష్ట్రం తరపున హాజరై కాంస్య పతకం కైవసం చేసుకున్నాడు. అలాగే ఢిల్లీ, వరంగల్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీ ల్లో పాల్గొని సత్తాచాటాడు. అంతకుముందు హైదరాబాద్, కరీంనగర్లో జరిగిన రెండు స్టేట్ లెవల్ పోటీల్లో పాల్గొని ఒక కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రెజర్లు నర్సింగ్‌యాదవ్, సాక్షిమాలిక్‌ను ఆదర్శంగా తీసుకుని రానున్న రోజుల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తానన్నాడు. -
రామాలయంలో ‘శ్రావణ’ పూజలు
స్వామివారికి నిత్యకల్యాణం అమ్మవారికి కుంకుమార్చన భద్రాచలం : మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా శ్రీసీతారామచంద్రస్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేశారు. గోదావరి నది నుంచి తీర్థ జలాలను తెచ్చి.. భద్రుని గుడిలో అభిషేకం నిర్వహించారు. ఈనెల 13 నుంచి 18 వరకు జరిగిన పవిత్రోత్సవాల్లో భాగంగా స్వామివారి నిత్యకల్యాణాలు నిలిపి వేసిన విషయం విదితమే. అయితే శుక్రవారం నుంచి స్వామివారి నిత్యకల్యాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. నిత్య కల్యాణమూర్తులను ఆలయ ప్రాకార మండపానికి తీసుకొచ్చి.. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేసి.. ఆలయ విశిష్టత గురించి భక్తులకు వివరించారు. భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవోపేతంగా స్వామివారికి నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలను, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. సామూహిక కుంకుమార్చన రామాలయ ప్రాంగణంలో వేంచేసియున్న శ్రీలక్ష్మీతాయారమ్మ వారికి మూడో శ్రావణ శుక్రవారం సందర్భంగా అభిషేకం నిర్వహించారు. గోదావరి నదీ జలాలు, నారికేళ జలాలు, హరిద్రాచూర్ణాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. సాయంత్రం మహిళా భక్తులచే సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధానార్చకులు పొడిచేటి జగన్నాథాచార్యులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
క్రికెట్లో అంకుర్ ప్రతిభ
ఖమ్మం స్పోర్ట్స్ : ఢిల్లీలో జరుగుతున్న జాతీయస్థాయి అండర్–15 క్రికెట్ టోర్నీలో ఖమ్మంకు చెందిన క్రికెటర్ అంకుర్‌సింగ్ ఎనిమిది వికెట్లు తీసి ఆంధ్రా జట్టుపై ఘన విజయం సాధించాడు. తెలంగాణ–ఆంధ్రా జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్‌లో ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తెలంగాణ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 107 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం బ్యాటింగ్ చేసిన ఆంధ్రా జట్టు కేవలం 7.2 ఓవర్లు మాత్రమే ఆడి.. 21 పరుగులకే ఆలౌట్ అయింది. తెలంగాణ జట్టులో బౌలర్ అంకుర్‌సింగ్ అద్భుత ప్రతిభ చాటి 3.3 ఓవర్లలో రెండు మెడిన్ ఓవర్లు, 5 రన్స్‌కు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. దీంతో తెలంగాణ జట్టుకు ఘన విజయం దక్కింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా అంకుర్‌సింగ్ ఎంపికయ్యాడు. గురువారం వెస్ట్ బెంగాల్ జట్టుతో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనున్నట్లు జట్టు కోచ్ రాజు ఠక్కర్ తెలిపారు. -
చిక్కుల్లో సింగరేణి
ఇటు అంతర్గత సమస్యలు అటు మార్కెట్లో పోటీ ఆర్థిక సంక్షోభం దిశగా కంపెనీ పట్టించుకోని యాజమాన్యం ఆందోళనలో కార్మిక వర్గం నల్ల బంగారు సిరులు పండించే సింగరేణి విఫణి వీధుల్లో విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటోంది. బొగ్గు కంపెనీల పోటీతో మార్కెట్లో నిలదిక్కుకోలేక విలవిల్లాడుతోంది. దీనికి తోడు పెరిగిన ఉత్పత్తి వ్యయం, యంత్రాలను పూర్తిగా వినియోగించుకోలేకపోవడం, రవాణా రంగంలో డొల్లతనం మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టివేస్తున్నాయి. అంతర్గత సమస్యలు పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్దాల్సి న యాజమాన్యం డైరెక్టర్ స్థాయి అధికారులవైపు చూస్తోంది. వారు మాత్రం వాటిని వదిలేసి ‘మార్కె ట్’ బూచిని చూపిస్తూ కంపెనీ నష్టాల్లోకి పోతుందని హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు సంస్థను ఎటు తీసుపోతాయోననే ఆందోళన కార్మికవర్గంలో నెలకొంది. – రామకృష్ణాపూర్ (ఆదిలాబాద్) సింగరేణి సంస్థ వివిధ కంపెనీల మాదిరి గానే సిమెంట్, విద్యుత్, సున్నం, ఐరన్, ఇటుక తయారీ తదితర సంస్థలకు బొగ్గు సరఫరా చేస్తోంది. కోలిండియాలోని పలు కంపెనీలు సైతం వినియోగదారులకు బొగ్గు సరఫరా చేసేందుకు పోటీ పడుతుండగా ఇండోనేషియా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా దేశాల నుంచి బొగ్గు దిగుమతులు సాగుతున్నాయి. ఇతర దేశాలతో పాటు దేశీయంగా ఉన్న బీసీసీఎల్, జార్ఖండ్ గనులు, ఉత్తర భారతదేశంలోని మరికొన్ని సంస్థలు తక్కువ ధరకే బొగ్గు సరఫరా చేస్తుండడంతో ఈ ప్రభావం సింగరేణిపై పడుతోంది. సింగరేణి భూగర్భగనుల్లో ఉత్పత్తి అవుతున్న టన్ను బొగ్గుకు రూ.3,000 వ్యయం అవుతోంది. ఈ లోటును ఓసీల నుంచి ఉత్పత్తి అవుతున్న బొగ్గుతో పూడ్చుతున్నారు. కంపెనీ మార్కెట్లో విక్రయిస్తున్న బొగ్గు ధరతో పోల్చితే ఇతర సంస్థ లు టన్నుకు రూ.200 తక్కువకు ఇస్తున్నాయి. నష్టాలను అధిగమిస్తేనే మనుగడ సంస్థాగతంగా దిద్దుబాటు చేపట్టి నష్టాలను అధిగమిస్తేనే సంస్థ మనగలుగుతుందని ఆర్థిక వేత్త లు సూచిస్తున్నారు. ముఖ్యంగా భూగర్భగనుల్లో ప్రణాళికాబద్ధంగా బొగ్గు ఉత్పత్తి చేపట్టాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఉదాహరణకు ఒక పని స్థలంలో బొగ్గు ఉత్పత్తి పూర్తి కాకముందే మరో పని స్థలాన్ని బొగ్గు ఉత్పత్తికి అనువుగా(సిద్ధంగా) ఉంచాలి. అలాగే ఎస్డీఎల్ యంత్రాల ద్వారా రోజుకు 150 నుంచి 170 టబ్బుల బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ పని స్థలాలు అనుకూలంగా లేని కారణంగా కొన్ని సందర్భాల్లో 20 నుంచి 30 టబ్బుల బొగ్గు మాత్రమే వస్తోంది. పని స్థలాలను సిద్ధం చేయడంలో సంబంధిత అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారని తెలుస్తోంది. పని స్థలాలను ఎప్పటికప్పుడు గుర్తించడం తో పాటు యంత్రాలను పూర్తి స్థాయిలో వినియోగించుకుని కార్మికుల్లో నైపుణాన్ని(స్కిల్స్) మరింత మెరుగు పరిస్తే ఎంతో మేలు జరుగుతుందని అంటున్నారు. రవాణా ‘గండం’ ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి ఉత్పత్తి చేసిన బొగ్గును వినియోగదారులకు అందించే క్రమంలో రవాణాలోని లోపాలు మరింత ఇబ్బందులకు దారితీస్తున్నాయి. కంపెనీ రవాణా చేస్తున్న బొగ్గుకు, చివరి దశలో నమోదవుతున్న గణాంకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. ఫలితంగా ఏటా లక్షల టన్నుల బొగ్గు మాయమవడంతో సంస్థ భారీ స్థాయిలో ఆర్థికంగా నష్టపోతోంది. ఇందుకు వివిధ స్థాయిల్లో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం.. భద్రతాపరమైన లోపాలు కారణంగా తెలుస్తోంది. కొన్నేళ్లుగా ఉత్పత్తి అవుతున్న దానికి, అమ్మకాల సందర్భంలోని లెక్కలకు పొంతన లేకుండా పోతున్నాయి. ఏటా 1.20 లక్షల టన్నుల తేడా కనిపిస్తోంది. ప్రధానంగా వేయింగ్ మిషన్ల వద్ద ఈ లోపం ఉన్నట్లు అధికారులు గుర్తిస్తున్నారు. పర్యవేక్షణ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. అలాగే ఇటీవల కాలంలో పుట్టుకొచ్చిన బొగ్గు మాఫియా సమస్యకు మరో కారణం. భద్రతా పరంగా ఉన్న డొల్లతనా న్ని ఆసరా చేసుకుని రవాణా సమయంలో వ్యాగన్లు నిలిచినపుడు మాఫియా ముఠాలు బొగ్గును కొల్లగొడుతున్నట్లు సమాచారం. కొంతమంది భద్రతా సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మక్కయి సంస్థకు చేటు చేస్తున్నారన్న ఆరోపణలు సైతం వెల్లువెత్తుతున్నాయి. గుదిబండగా బకాయిల భారం కంపెనీకి వస్తున్న లాభాల నుంచి పన్నుల రూపేణ రాబట్టుకుంటున్న సర్కారు అదే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి వచ్చే బకాయిలు రాబట్టే విషయంలో వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీపీ సింగరేణికి సుమారు రూ.3000 కోట్లు బకాయి పడి ఉంది. అలాగే ఆంధ్రా, మహారాష్ట్ర జెన్కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ కలిపి మరో రూ.2000 కోట్ల వర కు బకాయిలు రావలసి ఉన్నట్లు తెలిసింది. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుని లాభాలు గడిస్తున్న సంస్థల నుంచి బొగ్గు బకాయిలు వసూలు కాకపోవడంలో సింగరేణి కంపెనీ నిర్లక్ష్యం కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సింగరేణి చేపట్టిన జైపూర్‌లోని విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావడం వల్ల అంచనాలు పెరిగి వేల కోట్ల వడ్డీ కంపెనీ పై పడింది. కార్మిక సంఘాలు కళ్లు తెరవాలి కంపెనీకి వస్తున్న లాభాల నుంచి పన్నుల రూపేణ రాబట్టుకుంటున్న సర్కారు అదే ప్రభుత్వ రంగ సంస్థల నుంచి సింగరేణికి వచ్చే బకాయిలు రాబట్టే విషయంలో వివక్ష చూపుతున్నదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నా యి. ప్రభుత్వ రంగంలోని విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఎన్టీపీపీ సింగరేణికి సుమారు రూ.3000 కోట్లు బకాయి పడి ఉంది. అలాగే ఆంధ్రా, మహారాష్ట్ర జెన్కోలు, కర్ణాటక పవర్ కార్పొరేషన్ కలిపి మరో రూ.2000 కోట్ల వర కు బకాయిలు రావలసి ఉన్నట్లు తెలిసింది. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి చేసి అమ్ముకుని లాభాలు గడిస్తున్న సంస్థల నుంచి బొగ్గు బకాయిలు వసూలు కాకపోవడంలో సింగరేణి కంపెనీ నిర్లక్ష్యం కూడా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి తోడు సింగరేణి చేపట్టిన జైపూర్‌లోని విద్యుత్ ప్రాజెక్ట్ పనులు ఆలస్యం కావడం వల్ల అంచనాలు పెరిగి వేల కోట్ల వడ్డీ కంపెనీ పై పడింది. -
హరితహారంలో మన జిల్లానే ముందు
జెడ్పీ సీఈఓ నగేష్ ఎర్రుపాలెం: హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటడంలో రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా ముందున్నదని జెడ్పీ సీఈఓ ఎం.నగేష్ అన్నారు. ఎర్రుపాలెం పోలీస్ స్టేషన్లో వైరా డీఎస్పీ బి.రాంరెడ్డితో కలిసి గురువారం మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్‌కు చెందిన ఐదెకరాల భూమిలో 5000 మొక్కలు నాటించిన వైరా డీఎస్పీ రాంరెడ్డి, మధిర సీఐ నూనె వెంకటేశ్వర్లు, ఎస్ఐ ఎన్.గౌతమ్‌ను అభినందించారు. ఆయన మాట్లాడుతూ.. వైరా సబ్ డివిజన్ పోలీసులను జిల్లాలోని అన్ని శాఖల అధికారులు ఆదర్శంగా తీసుకుని హరితహారం కార్యక్రమాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలని కోరారు. వైరా డీఎస్పీ రాంరెడ్డి నేతత్వంలో మిషన్ కాకతీయ పథకంలో పోలీసులు పాల్గొన్నారని, సబ్ డివిజన్ పరిధిలో 2.72 లక్షల మొక్కలు నాటారని ప్రశంసించారు. జిల్లాలో ఇప్పటివరకు అన్ని శాఖల సమన్వయంతో 3.60 కోట్ల మొక్కలు నాటినట్టు చెప్పారు. వీటిని సంరక్షణ అందరి బాధ్యతని అన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఎస్ఐ ఆంజనేయులు, ఏఎస్ఐ ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు. -
దళితులపై దాడి కేసులో ఏడుగురి అరెస్టు
గో సంరక్షణ సమితి తదితర సంస్థలకు సంబంధం లేదు ఆవులను అపహరించి చంపుతున్నారన్న అపోహతోనే ఘటన జిల్లా ఎస్పీ రవిప్రకాష్ అమలాపురం టౌన్ : ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న ఇద్దరు చర్మకారులైన దళిత సోదరులపై దాడి చేసి గాయ పరిచిన ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ తెలిపారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే లోతైన దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఆయన చెప్పారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతానికి ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా వదిలేదన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే వారు ఎంతటి వారైనా సహించేది...క్షమించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య దర్యాప్తును పారదర్శకంగా...వేగంగా పూర్తి చేశారన్నారు. కామనగరువులో తన తోటలో ఆవులు మేస్తున్నాయని మూడు ఆవులను బంధించి పక్క గ్రామం సమనసలో ఓ రైతు వద్ద ఉంచటం వల్లే దాడులకు మూల కారణమైందని ఎస్పీ చెప్పారు. ఇంతటి రాద్ధా్దంతం జరగటానికి ఆవులను బంధించిన కామనగరువు గ్రామానికి చెందిన వీరి శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశామన్నారు. దళితులపై దాడికి పాల్పడ్డ కామనగరువుకు చెందిన ఉర్రింక నారాయణరావు, రాజులపూడి గంగాధరరావు, రాజులపూడి గణేష్‌కుమార్, రాజులపూడి నరేష్, వాకా వెంకట నాగ దుర్గా ప్రసాద్, కామన దుర్గారావు, ఎం. నారాయలణమూర్తి అనే అబ్బును బుధవారం అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు దాడి, బంధించటం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో గోసంరక్షణ సమితి, ఇతర సంస్థల ప్రమేయం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. గో సంరక్షణ సమితి ప్రతినిధులకు కూడా కబేళాలను, ఆవులను తరలించే వాహనాలను అడ్డగించే హక్కులేదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు. -
గిరిజనులు లేకుండానే వేడుకలా?
అధికారుల తీరుపై ఎమ్మెల్యే ఆవేదన ∙ తూతూ మంత్రంగా ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్లు రంపచోడవరం : గిరిజన తెగలను ఆహ్వానించకుండానే అధికారులు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరపడంపై రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివాసీ దినోత్సవ వేడుకలకు రావాల్సిన గిరిజనులు గ్రామాల్లో ఉండిపోయారని, పాఠశాల విద్యార్థులు మాత్రం వేదిక ఎదుట ఉన్నారన్నారు. స్థానిక జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించిన ఆదివాసీ దినోత్సవంలో గిరిజనులకు స్థానం లేకుండా పోయిందని ఆమె పేర్కొన్నారు. ఐటీడీఏ కార్యాలయం నుంచి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే రాజేశ్వరి, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్, ఎమ్మెల్సీ టి.రత్నాబాయి, మాజీ ఎమ్మెల్యేలు శీతంశెట్టి వెకంటేశ్వరరావు, చిన్నం బాబు రమేష్, కె.కాశీవిశ్వనాథ్ పాల్గొన్నారు. కలెక్టర్ వెళ్లిపోవడం బాధాకరం.. జూనియర్ కళాశాల వద్ద ఏర్పాటు చేసిన వేదిక వద్ద ఏజెన్సీలో వివిధ గిరిజన తెగలకు చెందిన వారితో ఆదివాసీ ఉత్సవాలను జ్వోతి ప్రజ్వలన చేయించి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అరుణ్‌కుమార్ ఏజెన్సీలో జరుగుతున్న ప్రగతిని వివరించారు. ఆదివాసీ దినోత్సవ ఉద్దేశాన్ని తెలిపి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి వేదికపై గిరిజనులతో మాట్లాడించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కలెక్టర్ ఆదివాసీ దినోత్సవ కార్యక్రమంలో కొద్దిసేపు ఉండి వెళ్లిపోవడం బాధకరమన్నారు. ఇలా అయితే గిరిజనులు వెల్లడించిన సమస్యలు పట్టించుకునేది ఎవరని ఆమె ప్రశ్నించారు. చట్టాలు అమలు కావడం లేదు.. చట్టాలు అమలు కావడం లేదని నిజమైన గిరిజనులు కులధ్రువీకరణ పత్రాలు పొందాలంటే అనేక ఇబ్బందులు గురవుతున్నారన్నారు. నకిలీ కులధ్రువీకరణ పత్రాలతో గిరిజన హక్కులను, రాయితీలు, ఉద్యోగాలను నకిలీ గిరిజనులు అనుభవిస్తున్నారన్నారు. ఇలాంటి వాటిని ఆరికట్టలన్నారు. ఏజెన్సీ కేంద్రంగా గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు ఐటీడీఏ నుంచి తీర్మానం చేయాలని కోరారు. గంగవరం మండలంలో బీసీ కులస్తుడు, అతడి కుమారులకు ఎస్టీ కులధ్రువీకరణ పత్రం పొందడం ఏజెన్సీలో రెవెన్యూ వ్యవస్థలో అవినీతికి పరాకాష్ట అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు పత్తిగుళ్ల భారతి, ఐటీడీఏ పీఓ రవి పట్టాన్‌శెట్టి తదితరులు పాల్గొన్నారు. స్టాళ్లలో కనిపించని ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాళ్లలో ఎక్కడా గిరిజన సంస్కృతీసంప్రదాయాలను ప్రతిబింబించే ఏర్పాట్లు చేయలేదు. కేవలం హార్టికల్చర్, జీసీసీ, ఉచిత వైద్యం శిబిరం, వంటి వాటితో మమ అనిపించారు. ఎమ్మెల్యేను సన్మానించిన సంస్కృతి సంఘం స్దానిక గిరిజన సంక్షేమ సంస్కృతిక సం«ఘం ఆ««దl్వర్యంలో జరిగిన ఆదివాసీ దినోత్సవంలో ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పాల్గొన్నారు. గిరిజన హక్కుల సాధన కోసం ఐక్యంగా పోరాడాలన్నారు. ఏజెన్సీలోని సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రాజేశ్వరి, ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డిలను సంఘం నాయకులు కడబాల రాంబాబు, కంగల శ్రీనువాస్,కుసం ఫకీరుదొర తదితరులు ఘనంగా సన్మానించారు. కోనసీమ అందాలపై శతకం అంకితం అంతర్వేది(సఖినేటిపల్లి) : అంతర్వేది పుణ్యక్షేత్రంలో మంగళవారం సాగరసంగమం వద్ద ప్రముఖ తెలుగు వేదకవి, సినీ గేయ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు స్వీయ రచన చేసిన కోనసీమ శతకాన్ని వాయుదేవునికి అంకితం చేశారు. గాలిపటంపై కోనసీమ గొప్పతనాన్ని వర్ణిస్తూ పటానికి ఒక వైపు 60, రెండోవైపు 48 పద్యాలు రాసి వశిష్టగోదావరి, సముద్రం సంగమం ప్రదేశంలో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. విశ్వశాంతిని కలిగించు వేదఘోషను ప్రతిధ్వనించే సాగరసంగమం, పుణ్యతీర్థాల క్షేత్రాల ముక్తి సీమ–కోనసీమ, వేదాన్ని– వ్యవసాయాన్ని ప్రతిబింబించే కోనసీమ, గలగల పారే గోదావరి, పక్షుల కిలకిలరావాలతో పులకరించే కోనసీమ, సంప్రదాయం–సంపద కలిగియుండే కోనసీమ, సుఖశాంతులతో ధాన్యాగారంగా తులతూగే కోనసీమ లోగిళ్లు, రేయింబవళ్లు కష్టించి పనిచేసే రైతుల మధుర సీమ కోనసీమ, కదలి గౌతమీపై గాలి, కడలి గాలి, చెరువులోని కలువతామరుల కమ్మనిగాలి, పైరుగాలి–తోట గాలిల సమ్మేళనం మానససరోవరం కోనసీమ అంటూ తదితర వాటిపై ఆయన 108 పద్యాలను రాశారు. తొలుత శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయంలో ఆయన స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం రామలింగేశ్వరరావు కుటుంబ సభ్యులకు అర్చకులు ఆశీర్వచనాలు చెప్పి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అదేవిధంగా నిత్యాన్నదాన పథకంలో ఆయన భోజనం చేశారు. వెంట శతావధానులు పాలపర్తి శ్యామలానంద్ప్రసాద్, గురు సహస్రావధాని కడిమెళ్ల వరప్రసాద్, సాహతీవేత్త ధవేజీ పాల్గొన్నారు. బుర్రిలంకలో సినీ సందడి నర్సరీల్లో ‘మిక్చర్ పొట్లం’ చిత్ర సన్నివేషాలు చిత్రీకరణ కడియం : మండలంలోని బుర్రిలంకలోని పలు నర్సరీల్లో మంగళవారం సినిమా షూటింగ్ సందడి చేసింది. శ్వేతాబసుప్రసాద్ ప్రధాన పాత్రలో గోదావరి సినీటోన్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘మిక్చర్ పొట్లం’ సినిమా షూటింగ్ జరిగింది. బుర్రిలంకలోని శ్రీ వెంకటరమణ నర్సరీ గార్డెన్లో ఒక పాటలోని పలుసన్నివేశాలను చిత్రీకరించారు. ఎంఎల్ సతీష్‌కుమార్ దర్శకత్వంలో భానుచందర్ కుమారుడు జయంత్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారని చిత్రబృందం తెలిపింది. అలాగే సుమన్, పోసాని కృష్ణమురళి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారన్నారు. చిత్ర బృందంలో కృష్ణభగవాన్, చిట్టిబాబు, జూనియర్ రేలంగి తదితర నటులు నర్సరీ వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది. స్థానిక యువకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని వారితో ఫోటోలు దిగేందుకు పోటీపడ్డారు. ఆద్యంతం హాస్యభరితం ‘మిక్చర్‌పొట్లం’ కంబాలచెరువు : గోదావరి సినీటోన్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ‘మిక్చర్ పొట్లం’ ఆద్యంతం హాస్యభరితంగా సాగుతుందని ఆ చిత్ర నిర్మాతల్లో ఒకరైన డాక్టర్ కంటే వీరన్న చౌదరి అన్నారు. ఆ సినిమా విశేషాలపై రాజమహేంద్రవరం రివర్‌బేలో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రముఖ హీరో భానుచందర్ కుమారుడు జయంత్ హీరోగా, గీతాంజలి హీరోయిన్గా నటిస్తున్నారన్నారు. మాధవపెద్ది సురేష్ సంగీతానందిస్తుండగా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సతీష్‌కుమార్ వహిస్తున్నారన్నారు. -
ఉపాధ్యాయులు లేని చదువులా?: రాజేశ్వరి
రంపచోడవరం: పెదగెద్దాడ వసతి గృహాన్ని ఆశ్రమ పాఠశాలగా మార్చి రెండునెలలైనప్పటికీ అక్కడ ఉపాధ్యాయులను నియమించకపోవడంపై ఎమ్మెల్యే రాజేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె సోమవారం ఆ పాఠశాలను సందర్శించారు. ఆ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఏజెన్సీలోని 14 ఆశ్రమ పాఠశాలల్లో ఇదే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థులకు అందిస్తున్న ఆహారాన్ని ఆమె పరిశీలించారు. నాణ్యమైన ఆహారం అందించాలని, మెనూ అమలులో కక్కుర్తి పడితే సహించేది లేదన్నారు. ప్రజాదర్బారుతో ప్ర యోజనమేంటి? గిరిజనుల సమస్యలను పరిష్కరిం చలేని ప్రజాదర్బారును నిర్వహించడంతో ఎవరికీ ఉపయోగం లేదని రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. ఉపాధిహామీ పథకంలో వాచ్ అండ్ వార్డులో జీడిమామిడి మొక్కలను సంరక్షించుకున్న గిరిజన రైతులకు మూడేళ్లుగా వేతనాలు చెల్లించడం లేదని ఎమ్మె ల్యే ఆరోపించారు. వారు వేతనాలు ఇ ప్పించాలంటూ పదేపదే ప్రజాదర్బారులో ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోయిందన్నారు. ఐటీడీఏ సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజాదర్బారులో గిరిజన రైతులతో కలిసి ఆమె ఆ విషయంలో అధికారులను నిల దీశారు. ఇప్పటికైనా అధికారులు వారి వే తనాల చెల్లింపునకు చర్యలు తీసుకోకుంటే ఐటీడీఏ ఎదుట ఆందోళన చేస్తామన్నారు. ఆదివాసీ దినోత్సవ ఏర్పాట్ల పరిశీలన స్దానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం నిర్వహించే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఏర్పాట్లను పార్టీ నాయకులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే రాజేశ్వరి పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ అరగాటి సత్యనారాయణరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి పత్తిగుళ్ల రామాజంనేయులు, సర్పంచ్ పండా రామకృష్ణదొర, ఎంపీటీసీ సభ్యులు కారుకోడి పూజా తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీ జలమయం
భద్రాచలం : భారీ వర్షాలతో భద్రాచలం ఏజన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలోగల ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి, గురువారం సాయంత్రానికి 33 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల పైకి వరద నీరు చేరింది. గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నాన ఘట్టాల రేవులో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రాచలం దిగువనున్న శబరి ఉధృతంగా ప్రవహిస్తుండటంగో వాగులకు వరద నీరు పోటెత్తుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఆరు అడుగుల వరకు ఎత్తి 50,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డివిజన్లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు చోట్ల వాగులు ఉధృతికి రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతంలోని మండలాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ ఆదేశించారు. -
ఏజెన్సీ జలమయం
భద్రాచలం: భారీ వర్షాలతో భద్రాచలం ఏజన్సీలో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతంలోగల ప్రాజెక్టుల నుంచి కూడా భారీగా వరద నీరు దిగువకు వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ఒక్కసారిగా పెరిగి, గురువారం సాయంత్రానికి 33 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల పైకి వరద నీరు చేరింది. గోదావరి నీటి మట్టం క్రమేపీ పెరుగుతుండడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. స్నాన ఘట్టాల రేవులో భద్రతను కట్టుదిట్టం చేశారు. భద్రాచలం దిగువనున్న శబరి ఉధృతంగా ప్రవహిస్తుండటంగో వాగులకు వరద నీరు పోటెత్తుతోంది. చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టు 18 గేట్లను ఆరు అడుగుల వరకు ఎత్తి 50,500 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. డివిజన్లోని దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లో పలు చోట్ల వాగులు ఉధృతికి రోడ్లపైకి వరద నీరు చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరద పెరుగుతుండటంతో పరివాహక ప్రాంతంలోని మండలాల అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని ఐటీడీఏ పీఓ రాజీవ్ ఆదేశించారు. -
నగరంలో పార్కుల అభివృద్ధికి చర్యలు
మంచినీరు, పారిశుద్ధ్యం,రోడ్లపై ప్రత్యేక దృష్టి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం కమర్షియల్ జోన్లలో రోడ్డుపై కాగితం పడితే రూ.500 ఫైన్ విలేకరుల సమావేశంలో మేయర్ డాక్టర్ పాపాలాల్ ఖమ్మం మామిళ్లగూడెం: నగరంలో పార్కులు అధ్వానంగా ఉన్నాయని,వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నట్లు నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు.మంగళవారం తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అవసరమైన మంచినీరు,పారిశుద్ధ్యం,రోడ్లపై దృష్టి సారించినట్లు, ఇక నుంచి నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించినట్లు చెప్పారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటర్‌ట్యాంకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూలై 2 వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్పొరేషన్‌లోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు. కమర్షియల్ జోన్లలో కాగితం వేస్తే రూ.500 జరిమానా వైరారోడ్డులోని పలుసెంటర్లను కమర్షియల్ జోన్లుగా గుర్తించి ఆ ప్రదేశాల్లో కాగితాలు వేస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మిషన్లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వైరా రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందితోపాటు పార్కింగ్ ఇబ్బంది కూడా ఉందని, అందుకు చేపల మార్కెట్ కోసం నిర్మించే నూతన భవనంలో అండర్ గ్రౌండ్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ నిర్మాణంపై స్టే ఉందని చెప్పారు. పంపులకు మోటార్లు పెడితే కఠిన చర్యలు.. నగరంలో పంపులకు మోటార్లు పెట్టి ఎవరైనా నీటిని వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆమోదం పొందని ఇళ్లకు నోటరీ ద్వారా పంపు కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఫంక్షన్‌హాళ్లలో చెత్త తొలగింపు కోసం ప్రస్తుతం రూ.1000 వసూలు చేస్తున్నట్లు,దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి రేటు పెంచి 4 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు పాల్గొన్నారు. -
రవాణా సేవలన్నీ ఆన్లైన్లోనే
ఖమ్మం క్రైం: రవాణా శాఖ అందించే మొత్తం 57 సేవలు మంగళవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆన్లైన్లో అందుబాటులోకి వస్తున్నాయి. రవాణా శాఖకు సంబంధించి ఇప్పటివరకు 15 రకాల సేవలే ఆన్లైన్లో అందుతున్నాయి. ఇకపై మొత్తం 57 సేవలు అందుబాటులోకి వస్తాయి. దళారీ వ్యవస్థకు కొంతమేరకు చెక్ జిల్లాలోని అన్ని రవాణా శాఖ కార్యాలయాల్లో దళారుల వ్యవస్థ ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయింది. దీనికి తోడు కార్యాలయాలకు వచ్చే వాహనదారులు గంటలతరబడి వేచి చూడలేక దళారులను ఆశ్రయిస్తున్నారు. దీంతో రవాణా శాఖ కార్యాలయాల్లో అవినీతి పెరిగింది. రవాణా సేవలన్నీ ఆన్లైన్లో అందుబాటులోకి వస్తే దళారీ వ్యవస్థకు కొంతవరకు చెక్ పడుతుంది. రవాణాశాఖ కార్యాలయాలన్నీ క్యాష్‌లెస్ ఆన్లైన్ సేవలతో జిల్లాలోని రవాణా శాఖ కార్యాలయాలన్నీ క్యాష్‌లెస్‌గా మారతాయి. మీ–సేవ కార్యాలయంలో నిర్ణీత నగదు చెల్లించి ఆన్లైన్లో సేవలు పొందవచ్చు. రవాణాశాఖ కార్యాలయాల్లో ఎటువంటి నగదు లావాదేవీలు జరగవు. ఆన్లైన్లో సేవలు ఇలా పొందవచ్చు వాహనదారులు లైసెన్స్, ఇతరత్రా సేవలు పొందేందుకు రవాణా శాఖ వెబ్సైట్(గిగిగి.్టట్చటఞౌట్ట.్ట్ఛl్చnజ్చn్చ.జౌఠి.జీn)లోకి వెళ్లాలి. కావాల్సిన సేవలను ఎంచుకున్న తరువాత, వివరాలతోపాటు వ్యక్తిగత సెల్æనెంబర్ నమోదు చేయాలి. సంబంధిత సేవ పొందేందుకు తేదీ, సమయాన్ని ఎంచుకోవాలి. ఆ తరువాత రుసుమును నెట్ బ్యాంకింగ్, ఆన్లైన్ ద్వారా చెల్లించవచ్చు. ఈ సదుపాయం లేని వారు తమ ఆన్లైన్ దరఖాస్తు సంఖ్య ఆధారంగా ఈ–సేవ, మీ–సేవ కేంద్రాల్లో 24 గంటల్లో రుసుము చెల్లించాలి. ఆ తరువాత, స్లాట్ ఖరారుకు సంబంధించిన సంక్షిప్త సందేశం (ఎస్ఎంఎస్) మీరు ఇచ్చిన సెల్ ఫోన్ నంబర్‌కు వస్తుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్‌తో నిర్ణీత సమయానికి రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లి పొందవచ్చు. -
నివురుగప్పిన నిప్పు!
దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు వ్యూహరచనలో పోలీసులు, మావోయిస్టులు ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ నాలుగు రాష్ట్రాలను అనుకుని ఉన్న దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దండకారణ్య సరిహద్దు ప్రాంతాన్ని తమ షెల్టర్‌జోన్‌గా వినియోగించుకుంటూ, తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులు.. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే సరిహద్దులో మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారోత్సవాలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు, మావోయిస్టు చర్యలను నియంత్రించేందుకు పోలీసులు వారివారి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. వారోత్సవాల వేళ మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – చింతూరు చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో మావోయిస్టులు ఇటీవల మందుపాతరలు అమర్చడం కలకలం రేపింది. కూంబింగ్ కోసం వచ్చే జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు నాలుగు సార్లు మందుపాతర్లను అమర్చారు. వీటిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్రమత్తమై వాటిని నిర్వీర్యం చేయగా, రెండు మందుపాతరలు వాటంతటవే పేలిపోయాయి. దీంతో పోలీసులకు భారీనష్టం తప్పింది. ఇదే క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ సరిహద్దుల్లోని తెలంగాణలో భద్రాచలం–చర్ల రహదారిపై మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. దీనికితోడు ఆంధ్రా సరిహద్దు సమీపంలో గంగరాజుపాడు వద్ద ఆంధ్రా–ఛత్తీస్‌గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ నెల 21న చింతూరు మండలానికి చెందిన ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. వినూత్న వ్యూహాల్లో మావోయిస్టులు దండకారణ్య పరిధిలో ఇటీవలి కాలంలో ఎన్కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టులు కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. వారోత్సవాల సమయంలో దండకారణ్య ప్రాంతంలోని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, రిక్రూట్మెంట్ చేపట్టడం ద్వారా కేడర్‌ను పెంచుకునే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ముమ్మరంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఎన్కౌంటర్లో లభ్యమైన డైరీ ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. శిక్షణలో భాగంగా గగనతల దాడులను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిసింది. సైన్యంలో ఇచ్చే శిక్షణ మాదిరిగానే నిలింగ్, స్టాండింగ్, ప్రోన్ పొజీషన్లతో పాటు ఎల్ఎంజీ ద్వారా హెలికాఫ్టర్లపై దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు గగనతల దాడుల నుంచి క్యాంపులను కాపాడుకునేందుకు అండర్‌గ్రౌండ్ సొరంగాలు, అండర్‌గ్రౌండ్ నివాసాలు, కొండల నడుమ సొరంగాలు, గుహలు నిర్మించుకోవాలని అగ్రనేతలు సూచించినట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది. తిప్పికొట్టేందుకు పోలీసుల వ్యూహం వారోత్సవాల సమయంలో మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడవచ్చని అనుమానిస్తున్న నాలుగు రాష్ట్రాల పోలీసులు.. వీటిని తిప్పికొట్టే వ్యూహంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, కూంబింగ్ ము మ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సంయు క్తంగా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ల పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరోవైపు కూంబింగ్ నిర్వహించే పోలీసులను లక్ష్యంగా చేసుకుని, సరిహద్దుల్లో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో డాగ్‌స్కా్వడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వనాల్ని వీడండి.. జనాల్లో కలవండి.. చింతూరు: ‘అడవుల్లో అన్నలారా! లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవండి’ అని మావోయిస్టులకు హితవు పలుకుతూ చింతూరు పోలీసులు బుధవారం జరిగిన వారాంతపు సంతలో ర్యాలీ నిర్వహించారు. ‘ఆయుధాలు వద్దు.. ఏబీసీడీలు ముద్దు, బాణాలు వీడండి.. జనంలో కలవండి, ఆయుధాలు వద్దు.. అభివృద్ధి ముద్దు, అడవిలో అన్నలారా! లొంగిపోయి ప్రశాంత జీవితాలు గడపండి!’ అంటూ నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పాల్గొన్నారు. -
మూడు నెలల్లో
రత్నగిరిపై యోగ, ఆయుర్వేద వైద్య సేవలు ‘సాక్షి’ వార్తలతో దిగివచ్చిన ‘బెంగళూర్ యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ సహజ ఆసుపత్రిని సందర్శించిన యూనివర్సిటీ ప్రతినిధులు అన్నవరం : అన్నవరం దేవస్థానంలో అధునాతన పరికరాలతో యోగ, ఆయుర్వేద వైద్యం అందిస్తామని చెప్పి బెంగళూరులోని వివేకానంద యోగ, ఆయుర్వేద యూనివర్సిటీ రూ.30 లక్షలు తీసుకుని నాలుగునెలలైనా పనులు ప్రారంభించకపోవడంపై ‘సాక్షి’ ఈనెల 21న ‘ఆ యోగం కలిగేనా?’ శీర్షికన ప్రచురించిన కథనానికి దేవస్థానం ఈఓ కె.నాగేశ్వరరావు, దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తీవ్రంగా స్పందించండంతో బెంగళూరు యూనివర్సిటీ అధికారులు దిగివచ్చారు. మంగళవారం అన్నవరం దేవస్థానానికి ఆ యూనివర్సిటీ హైదరాబాద్ విభాగ సభ్యుడు కేఎస్ఆర్ మూర్తి, ప్రతినిధి సుందరరామయ్య, ఇంజినీర్ బుచ్చిరాజు తదితరులు వచ్చారు. అక్టోబర్ నాటికల్లా పనులన్నీ పూర్తి చే యించి, యోగా, ఆయుర్వేద వైద్యం ప్రారంభిస్తామని చెప్పారు. అంతేకాదు దేవస్థానం చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావులతో కలసి సహజ ప్రకృతి చికిత్సాలయాన్ని సందర్శించి, యోగ, ఆయుర్వేద వైద్యం కోసం అందులో చేయాల్సిన మార్పులపై చర్చించారు. సహజ ఆసుపత్రిని కిందకు మారుస్తాం ప్రస్తుతం దేవస్థానం నిర్వహిస్తున్న సహజ ప్రకృతి చికిత్సాలయంలో 26 మంది ఇన్పేషెంట్లుగా ఉన్నారు. వివేకానంద యోగ యూనివర్సిటీ ప్రారంభించనున్న యోగ, ఆయుర్వేద వైద్యం కోసం సహజ భవనంలో మార్పులు చేయడానికి వీలుగా తాత్కాలికంగా సహజ ఆసుపత్రిని కొండదిగువన దేవస్థానం ఆసుపత్రికి మారుస్తాం. వారు భవనంలో ఏ మార్పు చేయడానికైనా సహకరిస్తాం. సాధ్యమైనంత త్వరగా యోగ, ఆయుర్వేద వైద్యం అందించాలన్నదే మా ధ్యేయం. – కే నాగేశ్వరరావు, ఈఓ మార్పులు శాశ్వతంగా ఉండేలా చేయాలి వివేకానంద యూనివర్సిటీకి 11 సంవత్సరాలు మాత్రమే యోగ, ఆయుర్వేద వైద్యం అందించడానికి దేవస్థానం ఒప్పందం కుదుర్చుకుంది. ఆ తరువాత ఈ భవనంలో దేవస్థానం సొంతంగా ఈ వైద్యం అందించడానికి వీలుగా భవనంలో మార్పులు ఉండాలి. మరలా మేము కొత్తగా మార్పులు చేసుకునేలా ఉండకూడదు. అందుకే ఏ మార్పులు చేయాలని అనుకుంటున్నారో! వాటిని ప్లాన్ రూపంలో అందజేయాలని కోరాం.– ఐవీ రోహిత్, దేవస్థానం చైర్మన్ మూడు నెలల్లో మార్పులు చేసి వైద్య సేవలందిస్తాం యూనివర్సిటీ నిపుణులు అందించే యోగ, నేచురోపతి, ఆయుర్వేదం వైద్యం కోసం సహజ ప్రకృతి చికిత్సాలయ భవనంలో మార్పులు చేయాల్సి ఉంది. వాస్తు రీత్యా ప్రస్తుతం ఉన్న మార్గాన్ని మూసి, ఉత్తరం వైపునుంచి మార్గం ఏర్పాటు చేస్తాం. అక్కడి ఘాట్ రోడ్లో నుంచి ర్యాంప్ ఏర్పాటు చేస్తాం. గదులన్నీ ఆధ్యాత్మికత, ప్రశాంత వాతావరణం ఉట్టిపడేలా తయారు చేస్తాం. స్పీనల్ స్ప్రే, హిప్ బాత్, ఫుట్ అండ్ హార్మ్ బాత్, అండర్ వాటర్ మసాజ్, లోకల్ స్టీమ్ బాత్ తదితర 20 యోగ, ఆయుర్వేద చికిత్సలు ఇక్కడ నిర్వహించేంలా మార్పులు చేస్తాం. శిరోధార, మడ్ బాత్, వంటివి కూడా ఇక్కడ నిర్వహిస్తారు. ప్రస్తుతం సహజలో దేవస్థానం ఒక రోజు చికిత్సకు రూ.250 వసూలు చేస్తోంది. అయితే మేము చేసే చికిత్సలో మూడు రకాల ఫీజులు ఉంటాయి. రూ.500 నుంచి రూ.వేయి వరకూ వసూలు చేస్తాం. దానికి తగ్గట్టుగానే వైద్యం లభిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోను అక్టోబర్‌లో ఈ వైద్యం ప్రారంభమయ్యేలా చేస్తాం. – కేఎస్ఆర్ మూర్తి -
విదేశీ నౌకరి అదే వారికి కడసారి
► చెరువులో పడి కుమార్తె మృతి ► కూతురు కడసారి చూపుకోసం తల్లి ఆవేదన ► దాత సహాయంతో చివరకు స్వస్థలం చేరుకున్న తల్లి విదేశాల్లో ఉపాధి.. అందమైన రంగుల వల. ఆ వలలో చిక్కుకున్నవారు పడే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. నిర్దయులైన యజమానుల తీరు. అయినవారికి జరగకూడనిది జరిగినప్పుడు వచ్చేందుకు నానా తంటాలు పడాలి. దానికి అద్దంపడుతుందీ సంఘటన. మలికిపురం: అయిన వారిని వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారు పడుతున్న ఇబ్బందులకు ఈ ఉదంతం మరో ఉదాహరణగా నిలుస్తుంది. మలికిపురం మండలం కత్తిమండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కడలి సత్య సాయి ప్రసాద్, వాణి చంద్రకళ. వారిద్దరూ ఉపాధి కోసం రెండు నెలల కిత్రం విదేశాలకు వెళ్లారు. భార్య దోహా కత్తర్లో, భర్త కువైట్‌లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారిని కత్తిమండలోని నానమ్మ, తాతయ్యల వద్ద ఉంచారు. చిన్న కుమార్తె ఖ్యాతిశ్రీ తాత నాగేశ్వరరావుతో కలసి గత ఆదివారం పొలం వెళ్లింది. ప్రమాదవశాత్తూ అక్కడ రొయ్యల చెరువులో పడిపోయింది. ఆరోజే మృతదేహం పైకి తేలింది. అయితే ఈ విషయం బయట వారెవరికీ తెలియనీయలేదు. ఈ సమాచారాన్ని వెంటనే విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. దోహా కత్తర్లో పని చేస్తున్న తల్లి వాణి చంద్రకళ తన కుమార్తెను కడసారి చూసుకొనేందుకు స్వస్థలం వెళ్లేందుకు ఆమె పని చేస్తున్న యజమాని షేట్ ఇండియా వెళ్లేందుకు అంగీకరించలేదు. తనను పంపించమని కాళ్ళా వేళ్ళా పడింది. అయినా వారు కనికరించలేదు. బోరుమని విలపిస్తూ ఆమె బతిమిలాడగా ఎట్టకేలకు రూ. లక్ష తన వద్ద సెక్యూరిటీ ఇచ్చి వెళ్ళమన్నాడు. చివరికి విషయం తెలుసుకున్న అక్కడి తెలుగు వారు దోహా కత్తర్లో ఉంటున్న మలికిపురానికి చెందిన జీఎన్నార్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ గెద్దాడ నాగేశ్వరరావుకు విషయం తెలిపారు. ఆయన వాణి చంద్రకళ పని చేస్తున్న సేట్ వద్దకు వెళ్లారు. సేట్‌కు సెక్యూరిటీ ఇచ్చారు. వాణి చంద్రకళకు రూ. 50 వేలతో మంగళవారం బిజినెస్ క్లాస్‌లో విమా నం టికెట్ బుక్ చేసి స్వస్థలం పంపారు. ఆమె బుధవారం రాత్రి స్వస్థలం కత్తిమండ చేరుకొంది. ప్రత్యేక బాక్స్‌లో భద్రపరచిన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఆ బాలిక తండ్రి కూడా కువైట్ నుంచి మంగళవారం కుమార్తె చివరి చూపు కోసం వచ్చాడు. బుధవారం రాత్రి ఆబాలిక అంత్య క్రియలు జరిగాయి. ఆ విషయం గురువారం నాడు బయట ప్రపంచానికి తెలిసింది. -
ఫిబ్రవరిలో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పర్యాటకం, ఐటీ, వ్యవసాయం తదితర రంగాల్లో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటూ జార్ఖండ్ ముఖ్యమంత్రి రఘుబర్ దాస్ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. సత్వర అనుమతులు, నిరంతర విద్యుత్‌తో వ్యాపారాలకు అనువైన పరిస్థితులు కల్పిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 16-17 తారీఖుల్లో జార్ఖండ్‌లో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహించనున్న నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌లో జరిగిన రోడ్‌షోలో రఘుబర్ దాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ సిమెంట్‌తోనూ, విద్యార్థులకు నైపుణ్యాల శిక్షణ కోసం ఐటీ సంస్థ ఒరాకిల్‌తోనూ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు ఆయన విలేకరులకు తెలిపారు. శ్రీ సిమెంట్ దాదాపు రూ. 600 కోట్లతో జార్ఖండ్‌లో గ్రైండింగ్ యూనిట్ ఏర్పాటు చేయనున్నట్లు రఘుబర్ దాస్ ఈ సందర్భంగా చెప్పారు. -
రుణాలు సకాలంలో అందేలా చర్యలు
లాభాల బాటలో సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఖమ్మం వ్యవసాయం : రైతులకు సకాలంలో రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల్లో సగం నిధులు రూ.58 కోట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు విడుదలయ్యాయని, నిధులను 1.51 లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన రైతులకు రుణాలు ఇవ్వనున్నామని, పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. గతేడాది జేఎల్‌జీ కింద ఎంపిక చేసిన 5,600 భూమిలేని నిరుపేద రైతుల గ్రూపులకు రూ.56 కోట్ల రుణాలు ఇచ్చామని, ఆ రుణాలు చెల్లించినవారికి తిరిగి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు ఇస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ద్విచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రుణాలను జిల్లాలోని ముల్కలపల్లి సహకార సంఘం నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 10 సంఘాలకు ఐసీడీపీ కింద గోదాముల నిర్మాణానికి రూ.2.15 కోట్లు మంజూరు చేశామని, గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సహకార బ్యాంక్ లాభాల్లో నడుస్తోందని, గతేడాది రూ.9.62 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏటీఎంలను ఆగస్టులో ఏర్పాటు చేయటానికి నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు పాల్గొన్నారు.