ఎంసీఓలకు ప్రశంసాపత్రాలను అందజేస్తున్న జెడ్సీ చైర్‌పర్సన్
-
జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత
కూసుమంచి: అక్షరాస్యత సాధనలో జిల్లాను రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపాలని జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత అన్నారు. కూసుమంచిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించిన అంతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్షరాస్యతలో రాష్ట్రం దేశంలో 32వ స్థానంలో ఉండటం దురదృష్టకరమన్నారు. దీనిని అధిగమించేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ప్రతి ఒక్కరు చదవడం, రాయడం నేర్చుకున్న రోజే సమాజం మీద వారికి అవగాహన కలిగి అభివృద్ధి చెందుతారన్నారు. జిల్లాలోని సాక్షరభారత్ కేంద్రాలను పటిష్టంగా నిర్వహిస్తూ ప్రజలను అక్షరాస్యులుగా తయారు చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం సాక్షరభారత్ స్టేట్ రిసోర్స్ పర్సన్ కాత్యాయని మాట్లాడుతూ సాక్షరభారత్ కేంద్రాల ద్వారా జిల్లాలో 6.95 లక్షల మంది అక్షరాస్యులుగా మార్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సంలో ఐదు వయోజన విద్యాకేంద్రాలను ఆదర్శ కేంద్రాలుగా మార్చి కంప్యూటర్, ఎల్‌సీడీలను సమకూర్చినట్లు తెలిపారు. అంతకు ముందు అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని సాక్షరభారత్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీని నిర్వహించారు. సాక్షరభారత్ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న ఎంసీఓలు, వీసీఓలకు ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ వడ్త్యియ రాంచంద్రునాయక్, బారి శ్రీను, సాక్షరభారత్ డీడీ ధనరాజ్, ఎంఈఓ శ్రీనివాస్, హెచ్‌ఎం లక్ష్మీనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్ హకీంపాషా, డీసీఓలు రమ్య, భవానీ, ఎంసీఓలు కళ్లెం అంజిరెడ్డి, నూకల చెన్నయ్య, వీరయ్యలు పాల్గొన్నారు.