మరో గిరిజన పసికందు మృతి
Published Sun, Oct 9 2016 11:49 PM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
రాజవొమ్మంగి : ఏజెన్సీలో గిరిజన శిశువుల మృత్యుఘోష ఆగడం లేదు. సరైన వైద్య సదుపాయం అందక తాజాగా రాజవొమ్మంగి మండలంలో మరో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు. అప్పలరాజుపేటకు చెందిన పేద కుటుంబంలోని గోరా దేవి అనే గిరిజన మహిళకు తొలి కాన్పులో పుట్టిన మగబిడ్డ చికిత్స పొందుతూ రంపచోడవరం ఏరియా ఆసుపత్రిలో ఆదివారం మరణించాడు. దేవికి జులై 15న రాజవొమ్మంగి పీహెచ్‌సీలో ఆ బిడ్డ జన్మించాడు. ఊపిరి పీల్చుకునేందుకు రెండు రోజులుగా ఈ బిడ్డ ఇబ్బంది పడుతుండడంతో తొలుత రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వైద్య నిపుణులు అందుబాటులో లేకపోవడంతో ఇక్కడి స్టాఫ్ నర్స్ ఆ శిశువును రంపచోడవరం ఆసుపత్రికి రిఫర్ చేసింది. రంపచోడవరంలో చికిత్స పొందుతూ ఆ శిశువు ఆదివారం తెల్లవారుజామున మరణించాడు. గత తొమ్మిది రోజుల్లో మండలంలో మృతి చెందిన గిరిజన శిశువుల సంఖ్య మూడుకు చేరింది. ఈనెల ఒకటో తేదీన పూదూడిలో వంతల రాజేశ్వరికి పుట్టిన 45 రోజుల వయసున్న మగబిడ్డ, మూడో తేదీన పాకవెల్తిలో భీంరెడ్డి లక్ష్మికి పుట్టిన రెండు నెలల వయసున్న ఆడబిడ్డ మరణించిన సంగతి తెలిసిందే.
Advertisement