పేదల గుండెల్లో వైఎస్‌ | ys alive in heart of the poor | Sakshi
Sakshi News home page

పేదల గుండెల్లో వైఎస్‌

Published Thu, Sep 1 2016 11:29 PM | Last Updated on Mon, Apr 8 2019 8:07 PM

వైఎస్‌.రాజశేఖరరెడ్డి - Sakshi

వైఎస్‌.రాజశేఖరరెడ్డి

  • పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌
  • సంక్షేమ పథకాలతో లబ్ధిపొందిన నిరుపేదలు
  • ఆరోగ్యశ్రీతో ఆదివాసీలకు వైద్యం
  • గిరిపుత్రులకు అటవీ హక్కు పత్రాలు
  • 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల రుణ మాఫీ
  • వైఎస్‌ వర్థంతి సందర్భంగా స్మరించుకుంటున్న జిల్లా ప్రజలు
  • సాక్షి ప్రతినిధి, ఖమ్మం:
    పేదల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి.. వారి గుండెల్లో సుస్థిర స్థానం ఏర్పరుచుకున్నాడు. తన పాలనలో ఏ పేద విద్యార్థులు చదువుకు దూరం కావద్దన్న ఆలోచనతో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని, పేదలకు కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీని, ప్రతి ఒక్కరి ఇంటి కలను నిజం చేసేందుకు ఇందిరమ్మ ఇళ్లను, ఆసరగా ఉండేందుకు పింఛన్లు.. ఇలా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారు. తన హయాం స్వర్ణ యుగమని చెప్పుకునేలా చేశారు. నేడు వైఎస్‌ 7వ వర్థంతి సందర్భంగా ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ జిల్లా ప్రజలు నివాళులర్పిస్తున్నారు.

    • గూడు లేని నిరుపేదలకు వైఎస్‌ ప్రవేశపెట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం ఓ వరంలా మారింది. వైఎస్‌ అధికారం చేపట్టిన తర్వాత ఇందిరమ్మ పేరుతో మూడు విడతల్లో జిల్లాలో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇంటి నిర్మాణ వ్యయం పెంచి, అడిగిన వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. లబ్ధిదారులు నిర్మాణాలను వేగంగా కట్టుకోవడానికి బిల్లులు సైతం చెల్లించారు. జిల్లాలో ఇందిరమ్మ పథకం ద్వారా 2,69,610 ఇళ్లు మంజూరయ్యాయి. వాటిలో 2.15 లక్షల ఇళ్లు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో ఉన్నాయి.
    • ఆదివాసీలకు పోడుపై హక్కును కల్పిస్తూ వైఎస్‌ ప్రభుత్వం పత్రాలు పంపిణీ చేసింది.  ‘‘ఏళ్లతర బడి పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులు.. ఇక నుంచి దొంగల్లా కాకుండా దొరల్లా బతకండి’’– 2009 ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ దినోత్సవం రోజున భద్రాచలంలో గిరిజనులకు హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమంలో నాటి సీఎం వైఎస్సార్‌ అన్న మాటలివి. నాడు హక్కు పత్రాలు పొందిన గిరిజనులు తమ పోడు భూముల్లో మాగాణి పంటలు పండించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 691 గ్రామాలకు చెందిన 31,961 మంది గిరిజనులకు లబ్ధి చేకూర్చేలా 2.10 లక్షల ఎకరాలకు హక్కు పత్రాలను ఇచ్చేందుకు వైఎస్‌ ఆమోద ముద్ర వేశారు. ఆయన ఆదేశాలతో 2008 నుంచి 2010 వరకు జిల్లాలోని 38 ఏజెన్సీ మండలాల్లో డీఎల్‌సీ ఆమోదం పొందిన 2.10 లక్షల ఎకరాలను అధికారులు పంపిణీ చేశారు.
    • కొత్తగూడెం పట్టణంలో నివసిస్తున్న వారికి తాము నివసిస్తున్న ఇంటిపై పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ  373 జీఓ ఇచ్చారు. సింగరేణి సంస్థ ఏర్పాటుతో 120 ఏళ్ల క్రితం కొత్తగూడెం పట్టణం ఏర్పడింది. మొత్తం స్థలమంతా సింగరేణి ఆధీనంలోనే ఉండేది. అప్పటి నుంచి నివాసం ఉంటున్నప్పటికీ కొత్తగూడెం వాసులకు ఎలాంటి యాజమాన్య హక్కులు కలగలేదు. 2004లో నగర బాట కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం వచ్చిన వైఎస్‌.రాజశేఖరరెడ్డికి స్థానికులు, ప్రజాప్రతినిధులు ఇక్కడి సమస్యను వివరించారు. ఆయన సానుకూలంగా స్పందించారు. 2005 మార్చి 24న 373 జీఓ జారీ చేశారు.

    + 2008లో వైఎస్‌ఆర్‌ ఒకేసారి బేషరతుగా రుణమాఫీ చేసి రైతుల మన్ననలు పొందారు. జిల్లాలో 4.52 లక్షల మంది రైతులకు రూ.2,150 కోట్ల పంట రుణాలు మాఫీ అయ్యాయి. అంతేకాదు, మళ్లీ రైతులకు రుణాలు ఇచ్చారు. బ్యాంకుల్లో రుణ బకాయిలు లేని రైతులకు కూడా ప్రయోజనం కలిగించేందుకుగాను జిల్లాలోని దాదాపు 70 వేల మంది రైతులకు రూ.5000 చొప్పున ప్రోత్సాహకాలను బ్యాంకుల ద్వారా అందించారు.

    • అప్పటివరకు అరకొరగా కొంతమందికే వచ్చే పింఛన్‌ అందేది. వైఎస్‌ అధికారంలోకి వచ్చాక.. ఒక్కసారిగా పింఛన్‌ను రూ.200లకు పెంచారు. జిల్లాలో అర్హులైన 2లక్షల మందికి రూ.200 చొప్పున పింఛన్‌ అందజేశారు.  ప్రస్తుతం ఇంట్లో ఎంతమంది అర్హులున్నా ఒకరికి మాత్రమే ఇస్తున్నారు.
    • నిరుపేద విద్యార్థులకు  ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వరంగా మారింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో జిల్లాలోని నిరుపేద, గిరిజన విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించారు. ఈ విద్యార్థులే ఏటా 10లక్షల మంది రూ.1300 కోట్ల వరకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందారు.
    • అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి పేదవాడికి కార్పొరేట్‌ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ సేవలను వైఎస్సార్‌ ప్రారంభించారు. జిల్లాలో 2008, జూలై 17 న ఈ సేవలు మొదలయ్యాయి. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రితోపాటు ఐదు ఏరియా ఆస్పత్రులు, తొమ్మిది ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నారు.  జిల్లాలో ఈ పథకం కింద 2016, జూన్‌ 27వ తేదీ వరకు 93,300 మంది రోగులు లబ్ధి పొందారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రారంభమైన ఎనిమిదేళ్ల కాలంలో జిల్లాకు రూ.260.30 కోట్లను వెచ్చించింది.
    • ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ఉచిత విద్యుత్‌ ఎందరో రైతులకు వరప్రదాయని అయింది. వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయం చేయలేకుండా ఉన్న రైతులను ఆదుకునేందుకుగాను ఉచిత విద్యుత్‌ పథకాన్ని అధికారంలోకి రాగానే వైఎస్‌ ప్రారంభించారు. జిల్లాలో 1.05లక్షల వ్యవసాయ కనెక్షన్లకు నాటి నుంచి ఉచిత విద్యుత్‌ అందుతోంది.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement