నివురుగప్పిన నిప్పు!
నివురుగప్పిన నిప్పు!
Published Wed, Jul 27 2016 11:09 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం
నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు
వ్యూహరచనలో పోలీసులు, మావోయిస్టులు
ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా సరిహద్దులు నివురుగప్పిన నిప్పులా మారాయి. ఈ నాలుగు రాష్ట్రాలను అనుకుని ఉన్న దండకారణ్యంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దండకారణ్య సరిహద్దు ప్రాంతాన్ని తమ షెల్టర్‌జోన్‌గా వినియోగించుకుంటూ, తమ ఉనికిని చాటుకుంటున్న మావోయిస్టులు.. నేటి నుంచి ఆగస్టు 3 వరకు అమర వీరుల వారోత్సవాల నిర్వహణకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఇప్పటికే సరిహద్దులో మావోయిస్టులు కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు. వారోత్సవాలను విజయవంతం చేసేందుకు మావోయిస్టులు, మావోయిస్టు చర్యలను నియంత్రించేందుకు పోలీసులు వారివారి వ్యూహాల్లో నిమగ్నమయ్యారు. వారోత్సవాల వేళ మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడే అవకాశం ఉండడంతో సరిహద్దుల్లోని ఆదివాసీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. – చింతూరు
చింతూరు మండలంలోని ఏడుగురాళ్లపల్లి, పేగ రహదారిలో మావోయిస్టులు ఇటీవల మందుపాతరలు అమర్చడం కలకలం రేపింది. కూంబింగ్ కోసం వచ్చే జవాన్లను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు నాలుగు సార్లు మందుపాతర్లను అమర్చారు. వీటిని ముందుగానే పసిగట్టిన పోలీసులు అప్రమత్తమై వాటిని నిర్వీర్యం చేయగా, రెండు మందుపాతరలు వాటంతటవే పేలిపోయాయి. దీంతో పోలీసులకు భారీనష్టం తప్పింది. ఇదే క్రమంలో వారోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ సరిహద్దుల్లోని తెలంగాణలో భద్రాచలం–చర్ల రహదారిపై మావోయిస్టులు మందుపాతరలు అమర్చారు. దీనికితోడు ఆంధ్రా సరిహద్దు సమీపంలో గంగరాజుపాడు వద్ద ఆంధ్రా–ఛత్తీస్‌గఢ్ పోలీసుల జాయింట్ ఆపరేషన్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. ఈ నెల 21న చింతూరు మండలానికి చెందిన ఆరుగురు మావోయిస్టు సానుభూతిపరులు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
వినూత్న వ్యూహాల్లో మావోయిస్టులు
దండకారణ్య పరిధిలో ఇటీవలి కాలంలో ఎన్‌కౌంటర్లు, అరెస్టులు, లొంగుబాట్ల కారణంగా మావోయిస్టులు కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్నారు. వారోత్సవాల సమయంలో దండకారణ్య ప్రాంతంలోని గ్రామాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి, రిక్రూట్‌మెంట్ చేపట్టడం ద్వారా కేడర్‌ను పెంచుకునే అవకాశాలు ఉన్నట్టు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఇటీవలి కాలంలో దండకారణ్య ప్రాంతంలో మావోయిస్టులు ముమ్మరంగా శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఛత్తీస్‌గఢ్ పోలీసుల దృష్టికి వచ్చింది. ఇటీవల జరిగిన ఓ ఎన్‌కౌంటర్‌లో లభ్యమైన డైరీ ద్వారా ఈ విషయాలు వెలుగుచూశాయి. శిక్షణలో భాగంగా గగనతల దాడులను ఎలా ఎదుర్కోవాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనే అంశాలపై కూడా తర్ఫీదు ఇస్తున్నట్టు తెలిసింది. సైన్యంలో ఇచ్చే శిక్షణ మాదిరిగానే నిలింగ్, స్టాండింగ్, ప్రోన్ పొజీషన్‌లతో పాటు ఎల్‌ఎంజీ ద్వారా హెలికాఫ్టర్లపై దాడులు ఎలా చేయాలనే దానిపై శిక్షణ ఇస్తున్నట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతోపాటు గగనతల దాడుల నుంచి క్యాంపులను కాపాడుకునేందుకు అండర్‌గ్రౌండ్ సొరంగాలు, అండర్‌గ్రౌండ్ నివాసాలు, కొండల నడుమ సొరంగాలు, గుహలు నిర్మించుకోవాలని అగ్రనేతలు సూచించినట్టు డైరీ ద్వారా వెలుగులోకి వచ్చినట్టు తెలిసింది.
తిప్పికొట్టేందుకు పోలీసుల వ్యూహం
వారోత్సవాల సమయంలో మావోయిస్టులు భారీ ఘటనలకు పాల్పడవచ్చని అనుమానిస్తున్న నాలుగు రాష్ట్రాల పోలీసులు.. వీటిని తిప్పికొట్టే వ్యూహంలో ఉన్నారు. ఆయా రాష్ట్రాల సరిహద్దుల్లో భారీగా బలగాలను మోహరించి, కూంబింగ్ ము మ్మరం చేశారు. సరిహద్దు రాష్ట్రాల పోలీసులతో సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ సంయు క్తంగా దండకారణ్యాన్ని జల్లెడ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఈనెల 23వ తేదీన ఆంధ్రా, ఛత్తీస్‌గఢ్‌ల పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. మరోవైపు కూంబింగ్ నిర్వహించే పోలీసులను లక్ష్యంగా చేసుకుని, సరిహద్దుల్లో మావోయిస్టులు భారీగా మందుపాతరలు అమర్చి ఉంటారనే అనుమానంతో డాగ్‌స్కా్వడ్, మెటల్ డిటెక్టర్లతో అణువణువునా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
వనాల్ని వీడండి.. జనాల్లో కలవండి..
చింతూరు: ‘అడవుల్లో అన్నలారా! లొంగిపోయి, జనజీవన స్రవంతిలో కలవండి’ అని మావోయిస్టులకు హితవు పలుకుతూ చింతూరు పోలీసులు బుధవారం జరిగిన వారాంతపు సంతలో ర్యాలీ నిర్వహించారు. ‘ఆయుధాలు వద్దు.. ఏబీసీడీలు ముద్దు, బాణాలు వీడండి.. జనంలో కలవండి, ఆయుధాలు వద్దు.. అభివృద్ధి ముద్దు, అడవిలో అన్నలారా! లొంగిపోయి ప్రశాంత జీవితాలు గడపండి!’ అంటూ నినాదాలు చేశారు. నేటి నుంచి మావోయిస్టుల వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో పోలీసులు ఈ ర్యాలీని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఐ దుర్గారావు, ఎస్సై గజేంద్రకుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement