సీపీసీఆర్‌ఐకి గ్రీన్ సిగ్నల్
సీపీసీఆర్‌ఐకి గ్రీన్ సిగ్నల్
Published Mon, Nov 21 2016 10:12 PM | Last Updated on Mon, Sep 4 2017 8:43 PM
అంగీకరించిన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి
మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు
జనవరిలో శంకుస్థాపన
కోనసీమలో క్షేత్రస్థాయి పరిశోధనలకు 60 ఎకరాలు
అమలాపురం : కొబ్బరి రైతులు సుదీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న సెంట్రల్ ప్లానిటేషన్ క్రాప్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సీపీసీఆర్‌ఐ) ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు మార్గం సుగమమయింది. రాజమహేంద్రవరం సమీపంలోని కడియం మండలం మాధవరాయుడుపాలెంలో సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధాసింగ్ మోహన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విస్తారంగా కొబ్బరి సాగు జరిగే గోదావరి జిల్లాల్లో సీపీసీఆర్‌ఐని ఏర్పాటు చేయాలని కొన్ని దశాబ్దాలుగా రైతులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో 2.7 లక్షల ఎకరాల్లో కొబ్బరిసాగు జరుగుతుండగా, తూర్పు గోదావరి జిల్లాలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. సీపీసీఆర్‌ఐని ఏర్పాటు చేస్తే ఈ ప్రాంతంలో కొబ్బరి సాగుకు మరింత మేలు జరుగుతుందని రైతులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజన నేపథ్యంలో ఈ డిమాండ్‌కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. తొలుత దీనిని కోనసీమలో ఏర్పాటు చేయాలనుకున్నారు. ఇందుకు అవసరమైన 60 ఎకరాలు స్థానికంగా లభ్యత లేకపోవడంతో అంబాజీపేట ఉద్యాన పరిశోధనా స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని గతంలో నిర్ణయించారు. ఇక్కడ పరిశోధనలకు ఇబ్బందిగా మారే అవకాశం ఉండడంతో మాధవరాయుడుపాలెంలోని 94 ఎకరాల ప్రభుత్వ భూమిలో లో 50 ఎకరాలు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్)కు లేఖ రాసింది.
ఐసీఏఆర్ సిఫార్సు మేరకు జూన్ 9న సీపీసీఆర్‌ఐ డైరెక్టర్ డాక్టర్ చౌడప్ప బృందం ఆ భూమిని పరిశీలించి ఈ ప్రాంతం అన్నింటికీ అనువుగా ఉంటుందని గుర్తించింది. సారవంతమైన భూమితో పాటు ఇరువైపులా ప్రధాన రహదారి ఉండడం, పుష్కలంగా భూగర్భ జలాలు, చెంతనే గోదావరి డెల్టా ప్రధాన కాలువ ఉండడం అన్నివిధాలా ఈ భూమి యోగ్యంగా ఉంటుందని వారు ఇచ్చిన నివేదిక మేరకు ఇక్కడ సీపీసీఆర్‌ఐ ఏర్పాటుకు కేంద్ర మంత్రి అంగీకారం తెలిపారు. అన్నీ అనుకున్నట్టు సాగితే వచ్చే ఏడాది జనవరిలో శంకుస్థాపన జరగనుంది.
కోనసీమలో మరో 60 ఎకరాలు
సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయాన్ని మాధవరాయుడుపాలెంలో ఏర్పాటు చేయడంతోపాటు క్షేత్రస్థాయిలో విస్తృత స్థాయి పరిశోధనలు చేసేందుకు కొబ్బరి అధికంగా పండించే కోనసీమలో భూమి ఉండాలని సీపీసీఆర్‌ఐ ఉన్నతాధికారుల బృందం భావిస్తోంది. ఇందుకోసం కోనసీమలో సుమారు 60 ఎకరాల కొబ్బరి తోటను సేకరిస్తే మేలు జరుగుతుందని వారంటున్నారు. కొంత కొబ్బరి ఉండి, మరికొంత సాగుయోగ్యమైన భూమి ఉన్నా చాలని భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సీపీసీఆర్‌ఐ అధికారులు లేఖ రాయనున్నట్టు సమాచారం.
కొబ్బరి ప్రస్థానంలో మరో మైలురాయి
సీపీసీఆర్‌ఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో కొబ్బరి సాగుకు ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. పొట్టి రకాల పెంపకం, విలువ ఆధారిత కొబ్బరి ఉత్పత్తుల తయారీ, కొబ్బరి అంతర పంటల సాగు ప్రోత్సాహం, రైతుకు సాంకేతిక బదిలీ వంటి అంశాలను సీపీసీఆర్‌ఐ ప్రాధాన్యతలుగా పెట్టుకుంది. రాష్ట్ర కొబ్బరి ప్రస్థానంలో ఇదో మైలురాయి అవుతోంది.
– పాలెం చౌడప్ప, సీపీసీఆర్‌ఐ డైరెక్టర్, కాసరఘోడ్, కేరళ
Advertisement
Advertisement