పెద్దాడ గడగడ | viral fevers in peddada | Sakshi
Sakshi News home page

పెద్దాడ గడగడ

Published Fri, Jul 7 2017 10:58 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM

పెద్దాడ గడగడ - Sakshi

పెద్దాడ గడగడ

పచ్చకామెర్లు, వైరల్‌ జ్వరాలతో ఇద్దరు చిన్నారుల మృతి
రాజమహేంద్రవరం సాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తల్లి వెంకటలక్ష్మి, 
తండ్రి శివశంకర్, అతని నాన్నమ్మ మంగయమ్మ కాకినాడ తరలింపు
పారిశుద్ధ్య లోపంపై డీఎంహెచ్‌ఓ ఆగ్రహం
ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బొడ్డు బాధిత కుటుంబాలకు పరామర్శ
పెద్దాడ (పెదపూడి) :  పెదపూడి మండలం పెద్దాడ గ్రామానికి చెందిన ఇద్దరు చిన్నారులు పచ్చకామెర్లు (హెపటైటిస్‌-సీ), వైరల్‌ జ్వరాలతో మృతి చెందడంతో పెద్దాడ గడగడలాడుతోంది. ఏజెన్సీ ప్రాంతాల్లో వైరల్, విష జ్వరాలతో మృత్యువాతపడుతున్న నేపథ్యంలో ఈ డెల్టా ప్రాంతంలో ఒక్కసారిగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడడం, తల్లి వెంటిలేటర్‌పై అపస్మారకస్థితిలో ఉండడం, తండ్రి, నాన్నమ్మ  చలిజ్వరానికి గురికావడంతో గ్రామంలో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. స్థానికులు, అధికారులు, వైద్యులు తెలిపిన వివరాల మేరకు గ్రామానికి చెందిన మట్టపర్తి శివశంకర్‌ అనే వ్యక్తి దేవీపట్నం మండలంలోని వీరవరం గ్రామానికి చెందిన వెంకటలక్ష్మిని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వారికి 4 సంవత్సరాల శ్రావణి, ఏడాది  వయసు ఉన్న చిట్టితల్లి సంతానం ఉన్నారు. అయితే వెంకటలక్ష్మి కుటుంబం పొలవరం ప్రాజెక్టు నిర్వాసితులు కావడంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం నిమిత్తం రెండు నెలల క్రితం సొంత ఊరు వీరవరం వెళ్లారు. అక్కడ నుంచి గత నెల 22న తల్లిదండ్రులు, ఇద్దరు చిన్నారులు జూన్‌ 24న చిట్టి తల్లి పుట్టిన రోజు నిమిత్తం గ్రామానికి వచ్చారు. వీరిని తీసుకురావడానికి శివశంకర్‌ నాన్నమ్మ మంగయమ్మ వెళ్లి నాలుగు రోజులు ఉండి అంతా కలిసి వచ్చారు.  వీరు ఇక్కడకు వచ్చే సరికి  జ్వరాలు, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. ఈనేపథ్యంలో ఈనెల 2న శ్రావణికి మూత్రం పసుపురంగులో ఉందని, శరీరం తెల్లగా పాలిపోయి నీరసంగా ఉందంటూ బిక్కవోలులోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి అనపర్తి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రథమ చికిత్స చేసి కాకినాడ జీజీహెచ్‌కు తరలించాలని సూచించారు. వెంటనే తండ్రి కాకినాడ ఆస్పత్రిలో శ్రావణిని చేర్చారు. ఆ చిన్నారితో పాటు, ఆమె తల్లి వెంకటలక్ష్మిని కూడా చేర్పించాలని వైద్యులు చెప్పారు. అయితే చికిత్స పొందుతూ 4న ఉదయం శ్రావణి చనిపోయింది. ఆ విషయం తల్లికి తెలియజేయనీయలేదు. అయితే తల్లి వెంకటలక్ష్మికి మెరుగైన వైద్యం అందించాలని బంధువులు కాకినాడ నుంచి రాజమహేంద్రవరంలోని సాయి ప్రైవేటు ఆస్పత్రిలో అదేరోజు చేర్చారు. ఇది ఇలా ఉండగా ఈ నెల 6న ఉదయం చిట్టి తల్లికి కూడా బాగోలేదని జి.మామిడాడలోని ఒక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వెంటనేæ కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే తన పెద్ద కుమార్తె శ్రావణి అదే అస్పత్రిలో చనిపోయిందని, ఆలోచించి బంధువులు సంజీవ్‌ అనే ఒక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. గురువారం ఉదయం చేర్చిన చిట్టితల్లి అదేరోజు రాత్రి 9.30 గంటల ప్రాంతంలో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే శివశంకర్, మంగయమ్మలకు వైద్యం అందించాలని, ఇద్దరినీ కాకినాడలోని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. వెంకటలక్ష్మి రాజమహేంద్రవరంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు.  
పారిశుద్ధ్యం బాగోలేదు–డీఎంఅండ్‌హెచ్‌వో
డీఎంఅండ్‌హెచ్‌వో చంద్రయ్య శుక్రవారం గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఆయన  బాధితులతో మాట్లాడారు. జరిగిన సంఘటన వివరాలు అడిగితెలుసుకున్నారు. చంద్రయ్య మాట్లాడుతూ చిన్నారుల తల్లికి మెరుగైన వైద్యం అందించాలని, అవసరమైన డెంగీ, స్వైన్‌ఫ్లూ, మొదలైన వైద్య పరీక్షలు చేయించాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వోకు ఆదేశించామన్నారు. శివశంకర్, మంగయమ్మలను అంబులెన్స్‌లో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగోలేదని ఇలాంటి పరిస్థితులు ఉంటే వ్యాధులు ప్రబలుతాయన్నారు. ఇలాంటి సంఘటనలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే వారిని సస్పెండ్‌ చేయాలని జిల్లా కలెక్టర్‌కు  సిఫార్సు చేస్తానని హెచ్చరించారు. గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ప్రసవాలు ఎందుకు చేయడంలేదు? ఆస్పత్రి నిర్వహణ సక్రమంగా లేదంటూ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామంలో పారిశుద్ధ్యం బాగోలేదని డీఎంఅండ్‌హెచ్‌వో చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావుతో ఫోన్‌లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మెరుగైన వైద్యానికి, ప్రభుత్వం పరంగా ఆదుకోడానికి కృషి
గ్రామంలో జ్వరాలతో  చనిపోయిన బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పరామర్శించారు. జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి చికిత్స పొందుతున్న బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, అలాగే చనిపోయిన చిన్నారులకు సంబంధించి ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని కోరారు. గ్రామంలో పరిస్థితులు ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఎంపీడీవో చక్రధరరావు, తహసీల్దార్‌ వెంకటేశ్వరరావు, వైద్యులు స్వర్ణ లతలను ఆదేశించారు. అలాగే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామరావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వం పరంగా ఆదుకోడానికి కృషి చేస్తామన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement