కొండకోనల్లో మృత్యుఘోష
కొండకోనల్లో మృత్యుఘోష
Published Sun, Jun 25 2017 11:04 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
- పచ్చని పల్లెపై విషజ్వరాల పడగ
- శవాలదిబ్బగా మారుతున్న చాపరాయి
- మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనుల మృతి
- ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషాదం
కొండకోనల్లోని పదిలంగా ఒదిగిపోయిన ఓ పచ్చని పల్లెలో మృత్యుఘోష మార్మోగింది. విషజ్వరాలు, వాంతులు, విరేచనాలతో బాధపడుతూ.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా పదహారు మంది అడవి బిడ్డల ప్రాణాలు.. మూడు వారాల వ్యవధిలో గాలిలో కలిసిపోయాయి. ఇంత జరుగుతున్నా ఇన్ని రోజులుగా వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ, ఇతర శాఖల సిబ్బంది కనీసంగా కూడా ఆ గ్రామాన్ని సందర్శించలేదు. ఫలితంగా ఇన్ని వరుస మరణాలు సంభవిస్తున్న విషయం వెలుగులోకి రాలేదు. శనివారం రాత్రి ఈ మరణాల విషయం వెలుగులోకి రావడంతో ప్రభుత్వ యంత్రాంగం ఆ గ్రామం.. చాపరాయికి హడావుడిగా పరుగు తీసింది.
రంపచోడవరం : కొండల మధ్య ఉన్న ఆ పచ్చని పల్లె శవాల దిబ్బగా మారింది. మూడు వారాల వ్యవధిలో 16 మంది గిరిజనులు ఆ గ్రామంలో మృత్యువాత పడ్డారు. రోజుకు ఇద్దరు ముగ్గురు గిరిజనులు విషజ్వరాల బారిన పడి మరణిస్తున్నా.. వారి దుస్థితిని గుర్తించడంలో ప్రభుత్వ యంత్రాంగం విఫలమవడంతో.. ఆ విషాదం బాహ్య ప్రపంచానికి తెలియని పరిస్థితి. దీంతో ఆ గిరిజనుల మరణ వేదన వారు నిత్యం తిరుగాడే కొండల్లో కలిసిపోయింది. వై.రామవరం మండలం ఎగువ ప్రాంతం బొడ్డగండి పంచాయతీ చాపరాయి గ్రామంలోని గిరిజనులు ఈ నెల ఒకటో తేదీ నుంచి విషజ్వరాలు, వాంతులు, విరేచనాల బారిన పడి మరణిస్తున్నారు. అరవై కుటుంబాలు ఉన్న ఈ గ్రామంలోని గిరిజనులు వైద్య సేవలు పొందాలంటే 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుర్తేడు పీహెచ్‌సీకి వెళ్లాలి. అంత దూరం రోడ్డు సదుపాయం లేకపోవడంతో కాలినడకే వారికి శరణ్యం. అనారోగ్యం బారిన పడిన వారు నడవలేని స్థితిలో ఆ పీహెచ్‌సీకి కూడా వెళ్లలేకపోయారు. గ్రామంలోనే నాటు వైద్యాన్ని ఆశ్రయించారు. ఎవరో చేతబడి చేశారని భావించారు. ఫలితంగా అప్పటి నుంచీ ఈ నెల 21 వరకూ గ్రామంలో 16 మంది మృత్యువాత పడ్డారు. వరుసగా గ్రామస్తులు మరణిస్తున్నా.. ఒక్కరు కూడా గుర్తేడు పీహెచ్‌సీకి వచ్చి వైద్యసేవలు పొందలేదు. చావు తరుముకొస్తున్నా గ్రామంలోనే ఉండిపోయారు. శనివారం సాయంత్రం గ్రామానికి చెందిన ఒకరిద్దరు మారేడుమిల్లి సంతకు రావడంతో ఈ విషయం ఎట్టకేలకు వెలుగులోకి వచ్చింది. విషయం ఐటీడీఏ పీవో ఏఎస్ దినేష్‌కుమార్ దృష్టికి వెళ్లింది. వెంటనే స్పందించిన ఆయన మారేడుమిల్లికి 70 కిలోమీటర్ల దూరంలోని చాపరాయి గ్రామానికి హుటాహుటిన ఏజెన్సీ వైద్య, ఆరోగ్య శాఖ అధికారితోపాటు వైద్యులను, ఇద్దరు తహసీల్దార్లను పంపించారు. అక్కడ అనారోగ్యంతో ఉన్న గిరిజనులకు ప్రథమ చికిత్స అందించారు. చాపరాయి గ్రామంలో అనారోగ్యంతో ఉన్నవారిలో 22 మందిని అంబులెన్సులలో రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి, ఎనిమిది మందిని మారేడుమిల్లి పీహెచ్‌సీకి తరలించారు. ఆస్పత్రికి వచ్చిన చాపరాయి గ్రామస్తుడు చాదల భూమిరెడ్డి మాట్లాడుతూ జ్వరాల కారణంగానే గ్రామంలో మరణాలు సంభవించినట్లు తెలిపారు.
తొంగిచూడని క్షేత్రస్థాయి సిబ్బంది
క్షేత్రస్థాయిలో పని చేయాల్సిన వైద్య, ఆరోగ్య శాఖలోని ఏఎన్‌ఎంలు, ఎంపీహెచ్‌డబ్ల్యూలు, పర్యవేక్షణ అధికారులు గడచిన నెల రోజులుగా చాపరాయి గ్రామంవైపు కనీసంగా కూడా తొంగి చూడలేదు. గ్రామంలో 16 మంది గిరిజనులు మరణించినా విషయం తెలియలేదంటేనే వైద్య, ఆరోగ్య శాఖ పనితీరు ఎంత అధ్వానంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆయా పీహెచ్‌సీల్లోని వైద్య సిబ్బంది తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి జ్వరాల కేసులుంటే రక్తపరీక్షలు నిర్వహించి పీహెచ్‌సీ పంపించాలి. కానీ చాపరాయి గ్రామం నుంచి ఒక్క గిరిజనుడిని కూడా వైద్యం కోసం పీహెచ్‌సీకి పంపిన దాఖాలాలు లేవు. కనీసం గ్రామాన్ని సందర్శించి జ్వరాల తీవ్రతను ఉన్నతాధికారుల దృష్టికి తీసువెళ్తే వైద్య బృందాలను పంపించి మరణాలను తగ్గించే ప్రయత్నం జరిగేది.
జగన్ దృష్టికి చాపరాయి మరణాలు
మారేడుమిల్లి / వై.రామవరం : చాపరాయిలో 16 మంది గిరిజనులు మృత్యువాత పడిన ఘటనను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్టు ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి తెలిపారు. మృతి చెందిన 16 మంది గిరిజన కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చాపరాయి గ్రామాన్ని ఆమె ఆదివారం సందర్శించారు. గిరిజనుల మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను, అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత గిరిజనులకు అధికారులు అందిస్తున్న వైద్య సదుపాయలను పర్యవేక్షించారు. అనారోగ్యంతో బాధపడుతున్న మిగిలిన గిరిజనులను 108 అంబులెన్స్‌లో తరలించారు. వ్యాధులు తగ్గేవరకూ గ్రామంలో వైద్య శిబిరం కొనసాగించాలని అన్నారు.
అన్నివిధాలా ఆదుకుంటాం
మారేడుమిల్లి : చాపరాయి బాధితులను అన్నివిధాలా ఆదుకుంటామని కలెక్టర్ కార్తికేయ మిశ్రా అన్నారు. మారేడుమిల్లి పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న పల్లాల చిన్నమ్మ, పల్లాల పండురెడ్డి, అందాల పొట్టమ్మ, అందాల సంతోష్, అందాల సన్యాసరెడ్డి, అందాల సావిత్రి, పల్లాల చిట్టమ్మ, పల్లాల చిన్నారెడ్డిలను ఆయన ఆదివారం సాయంత్రం పరామర్శించారు. వ్యాధులకు గల కారణాలను త్వరితగతిన నిర్ధారించాలని అధికారులను ఆదేశించారు. వారి రక్తాన్ని పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపామన్నారు. సోమవారంలోగా పరిస్థితి మొత్తం అదుపులోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ నయీం ఆస్మీ, డాక్టర్ ఉదయశ్రీ తదితరులు పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా : రాజప్ప
రంపచోడవరం : తూర్పు గోదావరి జిల్లా వై.రామవరం మండలం చాపరాయి గ్రామానికి చెందిన గిరిజనులను ప్రభుత్వ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో వైద్యసేవలు పొందుతున్న గిరిజనులను ఆదివారం రాత్రి ఆయన పరామర్శించారు. చనిపోయినవారి కుటుంబ సభ్యులకు రూ.2 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తామని ప్రకటించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందజేస్తామని తెలిపారు. చాపరాయి గ్రామానికి రోడ్డు సదుపాయం, మంచినీరు సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. ఏజెన్సీలోని కొన్ని గ్రామాలకు శాటిౖలైట్ ఫోన్లు సమకూర్చనున్నట్లు తెలిపారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే శీతంశెట్టి వెంకటేశ్వరరావు, సర్పంచ్ వై.నిరంజనీదేవి తదితరులున్నారు.
ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే..
చాపరాయి మరణాలపై కన్నబాబు
కాకినాడ : ఏజెన్సీలో గిరిజనులు విషజ్వరాలతో మృతి చెందడం వెనుక రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు విమర్శించారు. చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు మృతి చెందిన ఘటన నేపథ్యంలో ఆయన ఆదివారం విలేకర్లతో మాట్లాడారు. చాపరాయిలో గిరిజనుల మృతి విషయాన్ని పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లానన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలిపారన్నారు. త్వరలోనే బాధిత కుటుంబాల పరామర్శకు జగన్ రానున్నారని చెప్పారు. ఈలోగా బాధితులను పరామర్శించి భరోసా కల్పించాల్సిందిగా జగన్ ఆదేశించడంతో సోమవారం చాపరాయి వెళ్తున్నామని చెప్పారు. వై.రామవరం మండల ఎగువ ప్రాంతంలో కనీస సదుపాయాలు లేక, వైద్యం అందడంలేదని, ఇదే అమాయకులైన గిరిజనుల మరణాలకు కారణమైందని ధ్వజమెత్తారు. రాష్ట్రమంతా ఫైబర్‌గ్రిడ్ ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇంటి యజమానితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని చెబుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి గిరిజనుల మరణాలు 20 రోజుల వరకూ వెళ్లకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఏజెన్సీలో పదుల సంఖ్యలో నవజాత శిశువులు, గర్భిణుల మరణాలు సంభవించినప్పటికీ సకాలంలో సరైన చర్యలు తీసుకోలేదని విమర్శించారు. అదేవిధంగా కాళ్ళవాపు వ్యాధితో గిరిజనులు మృతి చెందినా కూడా ముఖ్యమంత్రి కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్నారు. ఇప్పుడు 16 మంది మృతి చెందితే పరిహారం ప్రకటించి చేతులు దులుపుకోవడం సరైనది కాదని కన్నబాబు విమర్శించారు.
Advertisement