విషజ్వరంతో జనం విలవిల
-
రామగుండం 49వ డివిజన్‌లో ప్రబలుతున్న వ్యాధులు
-
నాలుగు కాలనీలలో ఇంటికో పేషెంట్
-
మొక్కుబడిగా వైద్య శిబిరాలు
రామగుండం : విషజ్వరంతో రామగుండం కార్పొరేషన్ 49వ డివిజన్ ప్రజలు విలవిలలాడుతున్నారు. డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్, నూర్‌నగర్, శివాజీనగర్, రహ్మత్‌నగర్ కాలనీలలో 15 రోజులుగా వ్యాధులు ప్రబలుతున్నాయి. ఇంటికొకరు అంతుచిక్కని వ్యాధులతో మంచం పట్టారు. ముందుగా కీళ్ల నొప్పులు, తలనొప్పితో ప్రారంభమై 102 డిగ్రీల జ్వరానికి చేరుతుంది. జ్వరం తీవ్రత పక్షం రోజుల వరకు ఉంటుంది. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం ఉండడం లేదని బాధితులు చెబుతున్నారు. ఈ సమయంలో ఒళ్లంతా దురద ఉంటుందని, దద్దుర్లు వస్తున్నాయని, కీళ్ల వద్ద వాపులు విపరీతమైన నొప్పి ఉంటుందని పేర్కొంటున్నారు. 50వ డివిజన్ పరిధిలోని ఎస్టీ కాలనీ, విద్యుత్‌నగర్ కాలనీలలో విషజ్వరాలు ప్రబలుతున్నాయి. పలువురు డెంగీ లక్షణాలతో కరీంనగర్‌లో చికిత్స పొందుతున్నారు.
– అపరిశుభ్ర పరిసరాలతోనే....
కాలనీలలో డ్రెయినేజీలు పూర్తిగా శిథిలావస్థకు చేరడంతో మురుగు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోతుంది. దీనికితోడు కాలనీలలో పందులు, ఈగలు, దోమల బెడద అధికంగా ఉండడంతో వ్యాధులు ప్రబలుతున్నాయని స్థానికులు అంటున్నారు. కార్పొరేషన్ సరఫరా చేసే తాగునీటితోనే వ్యాధులు ప్రబలుతున్నాయని కొంతమంది పేర్కొంటున్నారు.