కుటుంబ కల్లోలం... ఎవరిదీ పాపం
కుటుంబ కల్లోలం... ఎవరిదీ పాపం
Published Sat, Jul 8 2017 11:04 PM | Last Updated on Tue, Sep 5 2017 3:34 PM
– జ్వరాలతో ఇద్దరు పిల్లలు చనిపోయినా పరామర్శలతో సరి
– తల్లి వైద్యానికి ప్రభుత్వపరంగా ఆదుకుంటామంటూ హామీలు
– ఆనక మొహం చాటేసిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ
– చావుబతుకుల మధ్య మట్టపర్తి వెంకటలక్ష్మి
– వైద్యానికి చిల్లగవ్వలేక తల్లడిల్లుతున్న ఇరు కుటుంబాలు
– ఆరోగ్యశ్రీ పథకంలో నుంచి జ్వరాల తీసివేత
– ప్రభుత్వం ఆదుకుంటేనే ప్రాణాలతో వెంకటలక్ష్మి
– నల్లమిల్లికి ఎమ్మెల్యే పదవి పెద్దాడ గ్రామ బిక్షే..
సాక్షి, రాజమహేంద్రవరం: ఉన్నా లేకున్నా గ్రామాల్లో లైటింగ్, గ్రాంథాలయం, ఇళ్లు, కుళాయి, పారిశుద్ధ్యంపై పన్నులు వసూలు చేస్తున్నా కనీసం పారిశుద్ధ్య పనులు కూడా చేయించడం లేదు. ఫలితంగా ప్రజలు విష జ్వరాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. కుటుంబాలకు కుటుంబాలనే జ్వరాలు బలిగొంటున్నాయి. కనీస సౌకర్యాలు కల్పించకుండా ఇసుక, మట్టి, నీరు–చెట్టు పథకాల్లో కోట్ల రూపాయల ముడుపులు అందుకుంటున్న నేతలు తమకు ఓట్లేసి గెలిపించిన ప్రజలు చనిపోయిన తర్వాత పరామర్శలు, అమలుకాని హామీలతో సరిపుచ్చుతున్నారు. అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం పెద్దాడ గ్రామంలో ఇద్దరు పిల్లలు చనిపోగా తల్లి రాజమహేంద్రవరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. చనిపోయిన చిన్నారులను తీసుకురాలేకున్నా తీవ్ర అనారోగ్యంతో ఉన్న తల్లిని బతికించుకునేందుకు ఆ పేద కుటుంబానికి ప్రభుత్వపరంగా సహాయం అందిస్తామని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, పెద్దాడ గ్రామస్తుడు బొడ్డు భాస్కర రామారావు శుక్రవారం హామీ ఇచ్చారు. రాజకీయ సభలు, సమావేశాల్లాగానే ఇక్కడ కూడా ఇచ్చిన హామీని ఆ క్షణమే మర్చిపోయారు. అత్యవసర వైద్య సహాయం అందించాల్సిన సమయంలో నేతలిద్దరూ చూస్తాం.. చేస్తాం.. అంటూ కాలం గడుపుతున్నారు. నిమిషాలు... గంటలు గడిచేకొద్ది మరణం వైపు పయనించే పరిస్థితుల మధ్య ఉన్న వెంకటలక్ష్మికి ఖరీదైన వైద్యం అందిస్తే ప్రాణాలు నిలబతాయని ఆస్పత్రి వైద్యులు చెబుతున్నారు. వెంకటలక్ష్మి పరిస్థితి గురువారంతో పోల్చుకుంటే శుక్రవారం కొద్దిగా కోలుకున్నారు. ప్రస్తుతం వైద్యానికి రోజుకు రూ.20 వేలు ఖర్చవుతోంది. జ్వరాలకు వైద్యం చేసే అవకాశాన్ని ప్రభుత్వం ఆరోగ్యశ్రీ నుంచి తీసేయడంతో ఆ పేద కుటుంబం అయోమయ పరిస్థితుల్లో పడిపోయింది. తమను ప్రభుత్వం ఆదుకోకపోతారా అన్న ఆశతో వెంకటలక్ష్మి తల్లిదండ్రులు, అక్క చెల్లెలు ఆశతో రాజమõßహేంద్రవరంలోని ప్రైవేటు ఆస్పత్రి వద్ద పడిగాపులు కాస్తున్నారు. పసి పిల్లలు కనుమరుగయ్యారు..కనీసం తమ బిడ్డనైనా బతికించుకునేందుకు ఆ ముసలి తల్లిదండ్రులు, ఆమె తోబుట్టువులు, భర్త శివశంకర్ బంధువులు ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు.
ఎమ్మెల్యే నల్లమిల్లికి రాజకీయ భిక్ష పెట్టిన పెద్దాడ...
గత సార్వత్రిక ఎన్నికల్లో అనపర్తి స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఎమ్మెల్యే అయ్యారంటే అది తమ గ్రామం పెద్దాడ పెట్టిన భిక్షేనని గ్రామస్తులు ముక్త కంఠంతో చెబుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో 1373 ఓట్ల అతి స్వల్ప మెజారిటీతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డిపై గెలిచారు. ఆ ఎన్నికల్లో నల్లమిల్లికి 83,398 ఓట్లు రాగా, డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డికి 82,025 ఓట్లు వచ్చాయి. అతి స్వల్ప మెజారిటీతోనైనా నల్లమిల్లి గెలుపొందడానికి పెద్దాడ గ్రామమే ప్రధాన కారణమని ఆ పార్టీ నేతలే ఒప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు సొంత గ్రామమైన పెద్దాడలో 3000 ఓట్లు ఉన్నాయి. ఇందులో సుమారు 2500 ఓట్లు టీడీపీకే పడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు. నియోజవర్గం మొత్తంమీద నల్లమిల్లికి మెజారిటీ 1373 అయితే ఒక్క పెద్దాడలో వచ్చిన మెజారిటీ 2000 ఓట్లు. తాను అసెంబ్లీలో కూర్చోవడంతో అత్యంత కీలకభూమిక పోషించిన గ్రామంలో ఇలాంటి పరిస్థితులున్నా ఎమ్మెలే నల్లమిల్లి రాజకీయ నాయకుడిలాగే ఉత్తుత్తి ప్రకటనలతో సరిపెట్టడం తమను బాధిస్తోందని ఆ గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండి పందులు తిరుగుతుండడంతో మాయదారి జ్వరాల పడి మరణిస్తున్నారని మండిపడుతున్నారు.
Advertisement