జల్లూరును వణికిస్తున్న జ్వరాలు
జల్లూరును వణికిస్తున్న జ్వరాలు
Published Wed, Aug 17 2016 11:54 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM
ఒకరు మృతి ∙
డెంగీ లక్షణాలు గల మరొకరికి చికిత్స ∙పలువురు ఆస్పత్రిపాలు
పిఠాపురం రూరల్ : పిఠాపురం మండలం జల్లూరు గ్రామాన్ని విషజర్వాలు వణికిస్తున్నాయి. పదుల సంఖ్యలో గ్రామస్తులు మంచానపడ్డారు. కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతున్న పితాని లక్ష్మి (55) బుధవారం తెల్లవారుజామున మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జల్లూరు గంగానగర్ కాలనీలో ఇంటి వద్ద హోటల్ నిర్వహించే లక్ష్మి వారం రోజులగా జ్వరంతో బాధపడుతోంది. ఆమె స్థానిక ప్రైవేటు వైద్యుల వద్ద చికిత్స పొందింది. మంగళవారం ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆమెను పిఠాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు కాకినాడ తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు ప్రమాదం ఏమీలేదని చెప్పారు. బెడ్స్ ఖాళీగాలేవని, ఇంటికి తీసుకెళ్లవచ్చని చెప్పడంతో బంధువులు ఆమెను ఆస్పత్రి ఆవరణలోని చెట్టు వద్దకు చేర్చారు. కొంత సేపటికి స్పృహ కోల్పోయిన లక్ష్మిని అత్యవసర విభాగానికి తరలించారు. అక్కడ చికిత్స అందించేలోపే ఆమె మరణించింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే లక్ష్మి మృతి చెందిందని బంధువులు ఆరోపించారు. ఇదిలా ఉండగా అదే కాలనీకి చెందిన కురుకూరి బుచ్చివేణి హైదరాబాద్‌లో ఉంటూ ఇటీవల తిరిగి ఇంటికి వచ్చింది. ఆమెకు జ్వర తీవ్రత ఎక్కువగా ఉండడంతో కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో చేర్పించగా డెంగీ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అలాగే కట్టా సత్యవతి అనే మహిళ ఫైలేరియా జ్వరంతో మంచం పట్టింది. ఇంజుమళ్ల రాంబుల్లి మలేరియా జ్వరంతో, పారా అచ్చియమ్మ విషజ్వరంతో బాధపడుతున్నారు. వీరే కాకుండా రోజుకు పదుల సంఖ్యలో జ్వరపీడితులు ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. వైద్య శిబిరాలను నిర్వహించడంతో పాటు పారిశుద్ధా్యన్ని మెరుగుపర్చాలని చేస్తున్నారు. దీనిపై పిఠాపురం మండల ప్రత్యేకాధికారి జేవీ పద్మశ్రీని ‘సాక్షి’ వివరణ కోరగా తక్షణమే విషజ్వరాల నివారణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Advertisement
Advertisement