పడకేసిన జంగాల కాలనీ
పడకేసిన జంగాల కాలనీ
Published Sun, Sep 4 2016 10:43 PM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
డెంగీ లక్షణాలతో 20 మందికి తీవ్ర జ్వరాలు
పారిశుద్ధ్య నివారణ చర్యలు మృగ్యం
పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కత్తిపూడి శివారు జంగాల కాలనీలో సుమారు 20 మంది డెంగీ లక్షణాలతో మంచానపడ్డారన్న విషయం కలకలం రేపింది. సుమారు 200 మంది బుడగ జంగాలకు చెందినవారు నివసించే ఈ కాలనీలో కొన్నాళ్లుగా పారిశుద్ధ్య నిర్వహణ జరగడం లేదు. దోమల బెడద అధికమై ప్రజలు అల్లాడుతున్నారు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధులు అక్కడ ప్రబలుతున్నాయి.
– కత్తిపూడి (శంఖవరం)
జంగాల కాలనీలో శనివారం రాత్రి కొందరికి జ్వరాలు సోకడంతో మంచాన పడ్డారు. వీరిలో మోతు రాంబాబు 15 ఏళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, అతడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇతడికి డెంగీ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని కాలనీవాసులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాలనీవాసులు స్థానిక ఆర్‌ఎంపీలను ఆశ్రం¬ంచారు. వ్యాధి తీవ్రరూపం దాల్చి ఆదివారం ఉదయానికి మరో 20 మంది జ్వరాల బారిన పడినట్టు కాలనీవాసులు గుర్తించి, శంఖవరం పీహెచ్‌సీ వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి పీహెచ్‌సీ వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. పంచాది గంగాభవాని, మోతు కుమారికి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు జరపడంతో టైఫాం¬డ్ సోకినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. పంచాది నూకరత్నం, భద్రాద్రి రాజేశ్వరి, మోతు రాజులమ్మ, మోతు గంగ జ్వరాలతో బాధపడుతున్నారు.
హుటాహుటిన పారిశుద్ధ్య చర్యలు
శనివారం రాత్రి జంగాల కాలనీలో అనేకమంది జ్వరాల బారిన పడ్డారని తెలియడంతో, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. ముగ్గులు వేసినట్టుగా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారని స్థానికులు ఆరోపించారు. శంఖవరం పీహెచ్‌సీ ప్రధాన వైద్యాధికారి ఎన్ దయానందరావు ఆధ్వర్యంలో వైద్య బృందం శిబిరం ఏర్పాటు చేసింది. సుమారు 38 మందికి రక్తపూత నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపారు. మోతు కుమారి, పంచాది గంగాభవానికి టైఫాం¬డ్ జ్వరాలు సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. జ్వరాలు సోకిన నలుగురినీ శంఖవరం పీహెచ్‌సీకి తరలించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరో రెండు రోజులు వైద్య శిబిరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
Advertisement