Sankavaram
-
'ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు'
సాక్షి, శంఖవరం/పిఠాపురం: ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలైన సంఘటన కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్ సమీపాన చోటుచేసుకుంది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన మేడపోతుల శివ ఈశ్వరుడు (38) లారీ డ్రైవర్‌గా, ఆకుల రామ్‌కుమార్ (35) క్లీనర్‌గా పని చేస్తున్నారు. వారు ఆదివారం కత్తిపూడిలోని ఒక డీలర్ వద్ద లారీలో డ్రింకులు లోడు చేసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. లారీపై టార్పాలిన్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో తీవ్రస్థాయిలో విద్యుదాఘాతానికి గురైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీఐ కిశోర్‌బాబు, అన్నవరం ఎస్సై రవికుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు) మృతుల్లో ఒకరైన శివ (పాతచిత్రం) ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు మృతులిద్దరిదీ చిన్నప్పటి నుంచీ మోటారు ఫీల్డే. వాస్తవానికి ఒకరు లారీ డ్రైవర్. మరొకరు ట్రాక్టర్ డ్రైవర్. ఒక్కోసారి ఇద్దరూ కలిసి డ్రైవర్, కీనర్లుగా లారీపై వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం లారీపై డ్యూటీకి బయలుదేరారు. ఎంత లేటైనా రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. ఈ ప్రమాదంతో కొత్త ఇసుకపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. మృతుడు శివ ఈశ్వరుడికి భార్య శాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు రామ్‌కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, అప్పుడప్పుడు లారీపై క్లీనర్‌గా వెళ్తూండేవాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, ఇక తమకు దిక్కెవరని ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టిస్తోంది. -
శంఖవరంలో కొనసాగుతున్న 144 సెక్షన్
తూర్పు గోదావరి, శంఖవరం: శంఖవరం ఎస్సీ పేటలో 144 సెక్షన్ కొనసాగుతోంది. ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదంలో బత్తిన నూకరాజు, బత్తిన ప్రసాద్ సజీవదహనమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్సీ పేటలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అక్కడ రెవెన్యూ, పోలీస్ ఉన్నత అధికారుల ఆదేశాల 144 సెక్షన్ శుక్రవారం కూడా కొనసాగింది. ఇరు వర్గాల మధ్య ఎలాంటి అవాంఛనీయ ఘర్షణలు జరగకుండా ఎస్సీ పేటలో ప్రతి వీధిలో పెద్దాపురం డీఎస్పీ సీహెచ్ వెంకట రామారావు ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన భద్రత కొనసాగుతోంది. మృతదేహాలు అప్పగింత.. సజీవదహనమైన మృతులు మృతదేహాలను పోస్టుమార్టం అనంతరం పోలీసులు స్వగ్రామానికి తీసుకొచ్చి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహలను చూసి కుటుంబీకులు, బంధువులు బోరున విలపించారు. కుటుంబ సభ్యులతో దహన సంస్కారాలు చేశారు. గ్రామంలో శాంతి భద్రతలు నిలకడగా ఉండే వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎసై.పార్ధసారథి, తహసీల్దార్ ఎం సుజాత వివరించారు. హత్యాకాండకు బాధ్యులైన పదిమంది నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు డీఎస్పీ సీఎచ్వీ రామారావు విలేకర్లకు తెలిపారు. -
పడకేసిన జంగాల కాలనీ
డెంగీ లక్షణాలతో 20 మందికి తీవ్ర జ్వరాలు పారిశుద్ధ్య నివారణ చర్యలు మృగ్యం పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న కత్తిపూడి శివారు జంగాల కాలనీలో సుమారు 20 మంది డెంగీ లక్షణాలతో మంచానపడ్డారన్న విషయం కలకలం రేపింది. సుమారు 200 మంది బుడగ జంగాలకు చెందినవారు నివసించే ఈ కాలనీలో కొన్నాళ్లుగా పారిశుద్ధ్య నిర్వహణ జరగడం లేదు. దోమల బెడద అధికమై ప్రజలు అల్లాడుతున్నారు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధులు అక్కడ ప్రబలుతున్నాయి. – కత్తిపూడి (శంఖవరం) జంగాల కాలనీలో శనివారం రాత్రి కొందరికి జ్వరాలు సోకడంతో మంచాన పడ్డారు. వీరిలో మోతు రాంబాబు 15 ఏళ్ల బాలుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో, అతడిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఇతడికి డెంగీ ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారని కాలనీవాసులు చెబుతున్నారు. దీంతో అప్రమత్తమైన కాలనీవాసులు స్థానిక ఆర్ఎంపీలను ఆశ్రం¬ంచారు. వ్యాధి తీవ్రరూపం దాల్చి ఆదివారం ఉదయానికి మరో 20 మంది జ్వరాల బారిన పడినట్టు కాలనీవాసులు గుర్తించి, శంఖవరం పీహెచ్సీ వైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. జ్వరాలతో బాధపడుతున్న వారికి పీహెచ్సీ వైద్య బృందం చికిత్స ప్రారంభించింది. పంచాది గంగాభవాని, మోతు కుమారికి వ్యాధి లక్షణాలు ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. వీరికి వైద్య పరీక్షలు జరపడంతో టైఫాం¬డ్ సోకినట్టు వైద్య వర్గాలు తెలిపాయి. పంచాది నూకరత్నం, భద్రాద్రి రాజేశ్వరి, మోతు రాజులమ్మ, మోతు గంగ జ్వరాలతో బాధపడుతున్నారు. హుటాహుటిన పారిశుద్ధ్య చర్యలు శనివారం రాత్రి జంగాల కాలనీలో అనేకమంది జ్వరాల బారిన పడ్డారని తెలియడంతో, పంచాయతీ అధికారులు హుటాహుటిన ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్వహణ చర్యలు చేపట్టారు. ముగ్గులు వేసినట్టుగా బ్లీచింగ్ పౌడర్‌ను చల్లారని స్థానికులు ఆరోపించారు. శంఖవరం పీహెచ్సీ ప్రధాన వైద్యాధికారి ఎన్ దయానందరావు ఆధ్వర్యంలో వైద్య బృందం శిబిరం ఏర్పాటు చేసింది. సుమారు 38 మందికి రక్తపూత నమూనాలు సేకరించి, పరీక్షలు జరిపారు. మోతు కుమారి, పంచాది గంగాభవానికి టైఫాం¬డ్ జ్వరాలు సోకినట్టు తేలిందని పేర్కొన్నారు. జ్వరాలు సోకిన నలుగురినీ శంఖవరం పీహెచ్‌సీకి తరలించే చర్యలు చేపట్టినట్టు తెలిపారు. జ్వరాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని మరో రెండు రోజులు వైద్య శిబిరం కొనసాగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. -
లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు: 20 మందికి గాయాలు
శంఖవరం: తూర్పుగోదావరి జిల్లాలోని శంఖవరం మండలం కత్తిపూడి వద్ద సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పుష్కర యాత్రికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 20 మందికి గాయాలయ్యాయి. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.