సాక్షి, శంఖవరం/పిఠాపురం: ప్రమాదవశాత్తూ విద్యుత్ తీగలు తగిలి లారీ డ్రైవర్, క్లీనర్ దుర్మరణం పాలైన సంఘటన కత్తిపూడి శివారు రావికంపాడు జంక్షన్ సమీపాన చోటుచేసుకుంది. అన్నవరం పోలీసుల కథనం ప్రకారం.. యు.కొత్తపల్లి మండలం కొత్త ఇసుకపల్లికి చెందిన మేడపోతుల శివ ఈశ్వరుడు (38) లారీ డ్రైవర్‌గా, ఆకుల రామ్‌కుమార్ (35) క్లీనర్‌గా పని చేస్తున్నారు. వారు ఆదివారం కత్తిపూడిలోని ఒక డీలర్ వద్ద లారీలో డ్రింకులు లోడు చేసుకుని శ్రీకాకుళం వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
లారీపై టార్పాలిన్ తీస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తూ పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో తీవ్రస్థాయిలో విద్యుదాఘాతానికి గురైన వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్తిపాడు సీఐ కిశోర్‌బాబు, అన్నవరం ఎస్సై రవికుమార్ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను ప్రత్తిపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అన్నవరం పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
చదవండి: (ఏ జన్మలో చేసుకున్న పాపమో.. ఏడవని రోజంటూ లేదు)
మృతుల్లో ఒకరైన శివ (పాతచిత్రం)
ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు
మృతులిద్దరిదీ చిన్నప్పటి నుంచీ మోటారు ఫీల్డే. వాస్తవానికి ఒకరు లారీ డ్రైవర్. మరొకరు ట్రాక్టర్ డ్రైవర్. ఒక్కోసారి ఇద్దరూ కలిసి డ్రైవర్, కీనర్లుగా లారీపై వెళ్లి వస్తుంటారు. అదేవిధంగా ఆదివారం మధ్యాహ్నం లారీపై డ్యూటీకి బయలుదేరారు. ఎంత లేటైనా రాత్రికి ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లారు. అంతలోనే ఈ ప్రమాదంలో విగత జీవులుగా మారిపోయారు. ఈ ప్రమాదంతో కొత్త ఇసుకపల్లిలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
మృతుడు శివ ఈశ్వరుడికి భార్య శాంతి, ఇద్దరు కుమారులు ఉన్నారు. మరో మృతుడు రామ్‌కుమార్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేస్తూ, అప్పుడప్పుడు లారీపై క్లీనర్‌గా వెళ్తూండేవాడు. ఇతడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఎంత రాత్రయినా ఇంటికి వచ్చేస్తామని చెప్పి వెళ్లిన వారు అటునుంచి అటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారని, ఇక తమకు దిక్కెవరని ఆ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment