మురికి కాలువ నుంచి ఉన్న తాగునీటి పైపు లైన్లు, తాగునీటికి ఉపయోగిస్తున్న కలుషిత బావి
విష జ్వరాలు పెదబూరాడపేట, చినబూరాడపేట గ్రామాలను పట్టి పీడిస్తున్నాయి. సుమారు మూడు వారాలుగా ఇదే పరిస్థితి ఆయా గ్రామాల్లో నెలకొంది. గ్రామస్తులు జ్వరాల బారిన పడి ఆస్పత్రుల పాలవుతున్నారు. ఇలా జ్వరాలు ప్రబలడానికి ఆయా గ్రామాల్లో తాగునీరే కారణమని వైద్యులు చెబుతున్నారు.
సాక్షి, నెల్లిమర్ల రూరల్: విష జ్వరాలతో పెద బూరాడపేట, చిన బూరాడపేట వాసులు మంచం పట్టారు. వర్షాకాలం, తాగునీటి కాలుష్యం వెరసి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. రెండు గ్రామాల్లోను ప్రజలు జ్వరం, దగ్గు, విరేచనాలతో పాటు, కీళ్ల నొప్పులు, కాళ్ల వాపులతో ఆస్పత్రుల పాలవుతున్నారు. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రత్యేకాధికారుల జాడ కాన రావడం లేదు. గడిచిన పది రోజులుగా ఇదే పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రజలు రోగాలతో అల్లాడుతున్నారు. జ్వర పీడితులు మండల కేంద్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందని స్థానికులు వాపోతున్నారు. రెండు గ్రామాల్లో ఒక్కో కుటుంబం నుంచి ఇద్దరు మంచం పట్టి ఉన్నారు. దీంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు .గడిచిన ఇరవై రోజుల నుంచి ప్రధానంగా కీళ్ల నొప్పులు, కాలు వాపుల సమస్యలతో బాధ పడుతున్నారు.
రెండు గ్రామాల్లోనూ సుమారు 70మందికి పైగా ఈ సమస్యతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. నీటి కాలుష్యం వల్ల ఈ సమస్య ఏర్పడిందని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో మంగళవారం ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వాహకులు స్వచ్ఛంధంగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. రోగులకు తనిఖీలు నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. గ్రామంలో పలువురు యువకులు వైద్యాధికారులకు సమాచారం ఇవ్వడంతో కొండవెలగాడ పీహెచ్‌సీ సిబ్బంది వెంటనే గ్రామాన్ని సందర్శించి జ్వర పీడితుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
కలుషిత నీటితోనే..
కలుషిత నీటిని తాగడం వలనే ప్రజలు రోగాల బారిన పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. ట్యాంక్ నుంచి తాగునీటి సదుపాయం ఉన్నప్పటికీ ప్రజలు ఆ నీటిని వినియోగించడం లేదు. సమీపంలో పంట పొలాల్లో ఉన్న బావి నీటినే తాగేందుకు వినియోగిస్తున్నారు. ఆ నీరు పూర్తిగా కలుషితమని వైద్యులు చెబుతున్నారు. గ్రామంలో తాగునీటి పైపులైన్లు కూడా అస్తవ్యస్తంగా ఉన్నాయి. గతంలో మురుగు నీటి కాలువల నుంచి తాగునీటి పైపు లైన్లను ఏర్పాటు చేయడంతో ఆ నీరు కూడా కలుషితంగా మారింది.
వైద్యాధికారి ఏమన్నారంటే...
ఈ సమస్యపై స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి ప్రశాంత్ రాజ్‌ను వివరణ కోరగా గ్రామంలో ఇప్పటికే సర్వే చేశామని గడిచిన 15 రోజుల నుంచి తరుచూ వైద్య తనిఖీలను చేపడుతున్నామన్నారు. ప్రస్తుతం గ్రామంలో జ్వరాలు అదుపులో ఉన్నాయని చెప్పారు. ట్యాంక్ నుంచి వాటర్ సరఫరా అవుతున్నప్పటికీ ప్రజలు కలుషిత బావి నీటిని వినియోగిస్తున్నారన్నారు. ప్రజలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నామని తెలిపారు. అలాగే ప్రతి రోజు వైద్య సిబ్బంది గ్రామాల్లో అందుబాటులో ఉంటారన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment