విజయనగరం జిల్లా కేంద్రాస్పత్రిలో బారులు తీరిన రోగులు
సాక్షి, విజయనగరం ఫోర్ట్: డెంగీ వ్యాధి కోరలు చాస్తోంది. రోజురోజుకూ రోగుల సంఖ్య పెరుగుతోంది. వైరల్ జ్వరాల వ్యాప్తి కూడా అధికంగానే ఉంది. అయితే మలేరియా వ్యాధి వ్యాప్తి మాత్రం గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా మలేరియా వ్యాధి అధికంగా వ్యాప్తి చెందే గిరిజన ప్రాంతంలో వ్యాప్తి తగ్గడం గమనార్హం. మలేరియా వ్యాధి వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం చేపట్టిన ముందుస్తు చర్యలు వల్ల ఈఏడాది మలేరియా వ్యాప్తి గణనీయంగా తగ్గింది. సీజనల్ వ్యాధులు వచ్చిందంటే చాలు గిరిజన ప్రాంత ప్రజలు మలేరియా బారిన పడి మృత్యువాత పడేవారు. అయితే డెంగీ రోగుల సంఖ్య మాత్రం రోజురోజుకూ పెరుగుతోంది.
జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ వరకు నమోదైన రోగుల వివరాలు..
వ్యాధిపేరు రోగుల సంఖ్య
జ్వరాలు 2,30,527
మలేరియా 60
డెంగీ 97
టైపాయిడ్ 820
డయేరియా 17,382
స్వైన్‌ఫ్లూ 20
కిటకిటలాడుతున్న ఆస్పత్రులు..
డెంగీ జ్వరాలతో పాటు వైరల్ జ్వరాలు వ్యాప్తి అధికంగా ఉండడంతో ఆస్పత్రులు జ్వర పీడితులతో కిటకిటలాడుతున్నాయి. పీహెచ్‌సీలు, సీహెచ్‌సీలతో పాటు జిల్లాలోని పలు ప్రైవేట్ ఆస్పత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో వైద్యారోగ్యశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఏడాది జనవరి నెల నుంచి ఆగస్టు 25వ తేదీ నాటికి 2లక్షల 30 వేలకు పైగా జ్వరాల కేసులు నమోదయ్యాయి. ప్రైవేట్‌ఆస్పత్రుల్లో రెండు లక్షల వరకు జ్వరాల కేసులు నమోదయ్యాయి.
దోమల నివారణ మందు పిచికారీ..
గిరిజన ప్రాంతంలో ముందుస్తుగానే ఈ ఏడాది దోమల నివారణ మందు పిచికారీ చేశారు. అదేవిధంగా డెంగీ వ్యాప్తి ప్రాంతాల్లో 8 వారాల పాటు మలాథియాన్ పిచికారీ చేస్తున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో చేరిన డెంగీ రోగులకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలందిస్తున్నారు. అలాగే వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
వదలని డెంగీ జ్వరాలు..
మెంటాడ: మండలంలోని వానిజ, గుర్ల, తమ్మిరాజుపేట గ్రామాల్లో డెంగీ జ్వరాలు ప్రబలాయి. చల్లపేట గ్రామానికి చెందిన సిరిపురపు అప్పలకొండ (40) డెంగీ లక్షణాలతో జిల్లా కేంద్రాస్పత్రిలో చికిత్స పొందుతోంది. అప్పలకొండ తన భర్తతో కలిసి రాజమండ్రి పనుల కోసం వలస వెళ్లి ఇటీవల గ్రామానికి వచ్చింది. మొదట జ్వరం రావడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 24న చికిత్స పొందింది. జ్వరం తగ్గకపోవడంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆమెను గజపతినగం తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెను పరీక్షించి డెంగీతో బాధపడుతున్నట్లు గుర్తించారు. దీంతో చల్లపేట వాసులు ఆందోళన చెందుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment