తాలిపేరు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తివేయడంతో పరవళ్లు తొక్కుతూ దిగువకు వస్తున్న వరద నీరు
-
– 1.24 సెం.మీ. వర్షపాతం నమోదు
-
– వెంకటాపురం మండలంలో అత్యధికంగా 7.04 సెం.మీ.
ఖమ్మం వ్యవసాయం: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో జిల్లాలో మంగళవారం ఓ మోస్తరు వర్షం కురిసింది. సగటున 1.24 సెం.మీ. వర్షపాతం నమోదైంది. తిరుమలాయపాలెం, కూసుమంచి, వేంసూరు, సింగరేణి మండలాల్లో మాత్రం చినుకు జాడ కనిపించలేదు. అత్యధికంగా భద్రాచలం అటవీ ప్రాంతంలో ఎక్కువ వర్షపాతం నమోదైంది. వెంకటాపురం మండలంలో అత్యధికంగా 7.04 సెం.మీ., మూడు మండలాల్లో 3 నుంయచి 6 సెం.మీ. మధ్య వర్షపాతం నమోదైంది. మధిర మండలంలో 4.46 సెం.మీ., వాజేడు మండలంలో 3.96 సెం.మీ., అశ్వారావుపేట మండలంలో 3.82 సెం.మీ. వర్షపాతం నమోదైంది. 12 మండలాల్లో 1 నుంచి 3 సెం.మీ. మధ్య కురిసింది. వైరా మండలంలో 2.68 సెం.మీ., బయ్యారం మండలంలో 2.60 సెం.మీ., బోనకల్లు మండలంలో 2.10 సెం.మీ., దమ్మపేట మండలంలో 2.06 సెం.మీ., దుమ్ముగూడెం మండలంలో 1.94 సెం.మీ., చండ్రుగొండ మండలంలో 1.88 సెం.మీ.; మణుగూరు, జూలూరుపాడు మండలాల్లో 1.74 సెం.మీ., కామేపల్లి మండలంలో 1.54 సెం.మీ., ముల్కలపల్లి మండలంలో 1.44 సెం.మీ., చర్ల మండలంలో 1.38 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మైదాన ప్రాంతంలోగల 21 మండలాల్లో 1 సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. బయ్యారం, ఇల్లెందు, టేకులపల్లి, కొత్తగూడెం, బూర్గంపాడు, భద్రాచలం, వాజేడు, వెంకటాపురంలో ఓ మోస్తరు వర్షం కురిసింది. ఈ వర్షంతో ఆగస్టు లోటు వర్షపాతం భర్తీ కాలేదు. ఆగస్టు నెల వర్షపాతం 276 మి.మీ. 30వ తేదీ నాటికి 267.3 మి.మి. వర్షం కురవాలి. 30వ తేదీ వరకు 129.9 మి.మీ. వర్షపాతమే నమోదైంది. ఇంకా –51.4 శాతం లోటు వర్షపాతం ఉంది. నాటు వేసిన వరికి, సాగులో ఉన్న పత్తికి, మొక్కజొన్నకు, నాటుతున్న మిర్చికి ఈ వర్షం కొంతవరకు ప్రయోజనకరంగా ఉంటుంది. మిర్చి దుక్కుల్లో పైరు నాటడానికి బాగా ఉపయోగపడుతుంది.
-
‘తాలిపేరు’ గేట్లు ఎత్తివేత
పెదమిడిసిలేరు (చర్ల): పెదమిడిసిలేరు సమీపంలోగల తాలిపేరు మధ్య తరహా ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుకుమా, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లోగల అటవీ ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో మంగళవారం తెల్లవారుజామున ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరింది. దీంతో, ప్రాజెక్టుకున్న మొత్తం 25 క్రషర్ గేట్లకుగాను మంగళవారం మధ్యాహ్నం ఎనిమిది గేట్లను, సాయంత్రానికి మరో రెండు గేట్లను ఎత్తివేసి 20,000 క్యూసెక్కుల చొప్పున వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ ఎగువ ప్రాంతంలో మరింతగా వర్షాలు కురిసే అవకాశముండడంతో ప్రాజెక్టులోకి మరింతగా వరద నీరు వస్తుందని అధికారులు అంచనా వేశారు. ప్రాజెక్ట్ వద్ద సిబ్బందిని అప్రమత్తం చేశారు. ప్రాజెక్ట్ వద్ద పరిస్థితిని ప్రాజెక్ట్ జేఈ వెంకటేశ్వరావు ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు చేరవేస్తున్నారు.