మృతదేహాల వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు
- మిషన్ కాకతీయ పనులతో ప్రమాదం
- చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు..
రేజర్ల (సత్తుపల్లి రూరల్) : ఆ పిల్లలు దసరా సెలవుల్లో హాయిగా గడుపుదామని ఇంటికి వచ్చారు. ఆడుకుంటూ చెరువువైపు వెళ్లిన గేదెను తోలుకొద్దామని వెళ్లారు. అంతలోనే పెను ప్రమాదం. చెరువులో 15 అడుగుల గొయ్యి ఉందని తెలియని చిన్నారులు అందులో మునిగి చనిపోయారు. ప్రమాదంలో సత్తుపల్లి మండలం రేజర్ల గ్రామానికి చెందిన నక్కా ఏసు, కృష్ణవేణి దంపతుల కుమార్తె దివ్య (9), కృష్ణాజిల్లా చాట్రాయి మండలం పోలవరం గ్రామానికి చెందిన గాదె సత్యవతి, మహేశ్వరరావు కుమారుడు అంజి (12) ఉన్నారు. ‘ఒక్కసారి లేచి మాట్లాడండ్రా’ అంటూ చిన్నారుల తల్లిదండ్రులు విలపించడంతో అక్కడి వారంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సెలవులకు పోలవరంలోనే ఉన్నా ప్రాణాలు దక్కేవని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు.
గొయ్యి ఉండటం వలే..
జీలుగుమిల్లి చెరువులో గతేడాది మిషన్ కాకతీయ పనులు చేపట్టారు. ఈ పనుల్లో కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా మట్టిని ఎక్కడబడితే అక్కడ లోతుగా తవ్వడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. చెరువు పనుల్లో చుట్టూ కందకం ఏర్పాటుచేసి గట్టు వేయాల్సి ఉండగా ప్రమాదం జరిగిన ప్రదేశం (చెరువు మొదటి భాగం)లో సుమారు 15 అడుగుల లోతులో గోతులు తీశారు. చెరువు మొదటి భాగంలో అడుగు నుంచి 2 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. అలాంటిది చెరువు మొదట్లోనే 15 నుంచి 20 అడుగుల లోతు గోతులు తీసి మట్టి తరలించుకుపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వారు ఆరోపిస్తున్నారు. చెరువు మొదట్లోనే అంతలోతు గొయ్యి తీసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. సత్తుపల్లి సీఐ పి.రాజేంద్రప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదం వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.