రికార్డుల్లో నమోదు చేయాలి
భువనగిరి అర్బన్ : గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని వివరాలను రికార్డుల్లో నమోదు చేయాలని డీపీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. గురువారం భువనగిరి ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రధానంగా పారిశుద్ధ్య సమస్య తలెత్తకుండా చూడాలని, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి చేయించాలన్నారు. గ్రామాల్లో పట్టపగలు కూడా వీధి దీపాలు వెలుగుతున్నాయని, ఆన్ ఆఫ్‌లు ఏర్పాటు చేయాలని కోరారు. నీటి సమస్య పరిష్కరించాలని, నూరు శాతం పన్ను వసూలు చేయాలన్నారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని పేర్కొన్నారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీవరకు అన్ని గ్రామాల్లో గ్రామ సభలను నిర్వహించాలన్నారు. కొత్తగా జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో రికార్డులను తప్పనిసరిగా సరి చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎల్‌పీఓ ఎ. రవికుమార్, ఎండీపీఓ గోపాలకి షన్‌రావు, భగవన్‌రెడ్డి, రాఘవేంద్రరావు, పంచాయతీ కార్యదర్శులు నర్సింహ, శ్రీనివాస్, దినాకర్, వెంకటేశ్వర్లు ఉన్నారు.