దళితులపై దాడి కేసులో ఏడుగురి అరెస్టు
దళితులపై దాడి కేసులో ఏడుగురి అరెస్టు
Published Thu, Aug 11 2016 1:05 AM | Last Updated on Mon, Aug 20 2018 4:44 PM
గో సంరక్షణ సమితి తదితర సంస్థలకు సంబంధం లేదు
ఆవులను అపహరించి చంపుతున్నారన్న అపోహతోనే ఘటన
జిల్లా ఎస్పీ రవిప్రకాష్
అమలాపురం టౌన్ : ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో చనిపోయిన ఆవు చర్మాన్ని వలుస్తున్న ఇద్దరు చర్మకారులైన దళిత సోదరులపై దాడి చేసి గాయ పరిచిన ఘటనను తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్ తెలిపారు. ఘటన జరిగిన 24 గంటల్లోనే లోతైన దర్యాప్తు చేసి దాడికి పాల్పడిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచామని ఆయన చెప్పారు. అమలాపురం డీఎస్పీ కార్యాలయంలో బుధవారం మధ్యాహ్నం విలేకర్ల సమావేశంలో ఎస్పీ మాట్లాడారు. ప్రస్తుతానికి ఏడుగురిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినప్పటికీ దర్యాప్తు కొనసాగుతోందని, ఇంకా ఎవరైనా ఉంటే వారిని కూడా వదిలేదన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తే వారు ఎంతటి వారైనా సహించేది...క్షమించేది లేదని ఎస్పీ హెచ్చరించారు. అమలాపురం డీఎస్పీ లంక అంకయ్య దర్యాప్తును పారదర్శకంగా...వేగంగా పూర్తి చేశారన్నారు. కామనగరువులో తన తోటలో ఆవులు మేస్తున్నాయని మూడు ఆవులను బంధించి పక్క గ్రామం సమనసలో ఓ రైతు వద్ద ఉంచటం వల్లే దాడులకు మూల కారణమైందని ఎస్పీ చెప్పారు. ఇంతటి రాద్ధా్దంతం జరగటానికి ఆవులను బంధించిన కామనగరువు గ్రామానికి చెందిన వీరి శ్రీనివాసరావుపై కూడా కేసు నమోదు చేశామన్నారు. దళితులపై దాడికి పాల్పడ్డ కామనగరువుకు చెందిన ఉర్రింక నారాయణరావు, రాజులపూడి గంగాధరరావు, రాజులపూడి గణేష్‌కుమార్, రాజులపూడి నరేష్, వాకా వెంకట నాగ దుర్గా ప్రసాద్, కామన దుర్గారావు, ఎం. నారాయలణమూర్తి అనే అబ్బును బుధవారం అరెస్ట్ చేశామని ఎస్పీ చెప్పారు. వీరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో పాటు దాడి, బంధించటం తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ ఘటనలో గోసంరక్షణ సమితి, ఇతర సంస్థల ప్రమేయం లేదని ఎస్పీ స్పష్టం చేశారు. గో సంరక్షణ సమితి ప్రతినిధులకు కూడా కబేళాలను, ఆవులను తరలించే వాహనాలను అడ్డగించే హక్కులేదని ఎస్పీ స్పష్టం చేశారు. అలాంటి సంఘటనలు జరిగినప్పుడు వారు కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్పీ సూచించారు.
Advertisement