విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న మేయర్ పాపాలాల్
-
మంచినీరు, పారిశుద్ధ్యం,రోడ్లపై ప్రత్యేక దృష్టి
-
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు బయోమెట్రిక్ విధానం
-
కమర్షియల్ జోన్లలో రోడ్డుపై కాగితం పడితే రూ.500 ఫైన్
-
విలేకరుల సమావేశంలో మేయర్ డాక్టర్ పాపాలాల్
ఖమ్మం మామిళ్లగూడెం: నగరంలో పార్కులు అధ్వానంగా ఉన్నాయని,వాటిని అభివృద్ధి చేసి ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం కల్పించనున్నట్లు నగర మేయర్ డాక్టర్ పాపాలాల్ అన్నారు.మంగళవారం తన చాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మేయర్ మాట్లాడుతూ నగరంలో ప్రజలకు అవసరమైన మంచినీరు,పారిశుద్ధ్యం,రోడ్లపై దృష్టి సారించినట్లు, ఇక నుంచి నగరంలో ఫ్లెక్సీల ఏర్పాటును కూడా నిషేధించినట్లు చెప్పారు.నగరంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, వాటర్‌ట్యాంకులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న తరుణంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టనున్నట్లు తెలిపారు. మహిళల కోసం షీ టాయిలెట్ల నిర్మాణాన్ని వచ్చే ఏడాది జూలై 2 వ తేదీ వరకు పూర్తి చేయనున్నట్లు వివరించారు. కార్పొరేషన్‌లోని ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు చెప్పారు.
కమర్షియల్ జోన్లలో కాగితం వేస్తే రూ.500 జరిమానా
వైరారోడ్డులోని పలుసెంటర్లను కమర్షియల్ జోన్‌లుగా గుర్తించి ఆ ప్రదేశాల్లో కాగితాలు వేస్తే రూ.500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు శుభ్రం చేసేందుకు స్వీపింగ్ మిషన్‌లు అందుబాటులో ఉంచుతామని చెప్పారు. వైరా రోడ్డులో ట్రాఫిక్ ఇబ్బందితోపాటు పార్కింగ్ ఇబ్బంది కూడా ఉందని, అందుకు చేపల మార్కెట్ కోసం నిర్మించే నూతన భవనంలో అండర్ గ్రౌండ్‌ను కేటాయించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం మార్కెట్ నిర్మాణంపై స్టే ఉందని చెప్పారు.
-
పంపులకు మోటార్లు పెడితే కఠిన చర్యలు..
నగరంలో పంపులకు మోటార్లు పెట్టి ఎవరైనా నీటిని వాడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఆమోదం పొందని ఇళ్లకు నోటరీ ద్వారా పంపు కనెక్షన్లు ఇస్తామని తెలిపారు. ఫంక్షన్‌హాళ్లలో చెత్త తొలగింపు కోసం ప్రస్తుతం రూ.1000 వసూలు చేస్తున్నట్లు,దీనిపై కౌన్సిల్ సమావేశంలో చర్చించి రేటు పెంచి 4 ట్రాక్టర్ల ద్వారా చెత్తను తరలించడం జరుగుతుందన్నారు. సమావేశంలో కమిషనర్ బోనగిరి శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, 26వ డివిజన్ కార్పొరేటర్ పగడాల నాగరాజు పాల్గొన్నారు.