
విదేశీ నౌకరి అదే వారికి కడసారి
మలికిపురం: అయిన వారిని వదిలి ఉపాధి కోసం విదేశాలకు వెళ్తున్న వారు పడుతున్న ఇబ్బందులకు ఈ ఉదంతం మరో ఉదాహరణగా నిలుస్తుంది. మలికిపురం మండలం కత్తిమండ గ్రామానికి చెందిన భార్యాభర్తలు కడలి సత్య సాయి ప్రసాద్, వాణి చంద్రకళ. వారిద్దరూ ఉపాధి కోసం రెండు నెలల కిత్రం విదేశాలకు వెళ్లారు. భార్య దోహా కత్తర్‌లో, భర్త కువైట్‌లో ఉంటున్నారు. వారికి ఇద్దరు కుమార్తెలు. వారిని కత్తిమండలోని నానమ్మ, తాతయ్యల వద్ద ఉంచారు. చిన్న కుమార్తె ఖ్యాతిశ్రీ తాత నాగేశ్వరరావుతో కలసి గత ఆదివారం పొలం వెళ్లింది.
ప్రమాదవశాత్తూ అక్కడ రొయ్యల చెరువులో పడిపోయింది. ఆరోజే మృతదేహం పైకి తేలింది. అయితే ఈ విషయం బయట వారెవరికీ తెలియనీయలేదు. ఈ సమాచారాన్ని వెంటనే విదేశాల్లో ఉన్న ఆమె తల్లిదండ్రులకు తెలియజేశారు. దోహా కత్తర్‌లో పని చేస్తున్న తల్లి వాణి చంద్రకళ తన కుమార్తెను కడసారి చూసుకొనేందుకు స్వస్థలం వెళ్లేందుకు ఆమె పని చేస్తున్న యజమాని షేట్ ఇండియా వెళ్లేందుకు అంగీకరించలేదు. తనను పంపించమని కాళ్ళా వేళ్ళా పడింది. అయినా వారు కనికరించలేదు. బోరుమని విలపిస్తూ ఆమె బతిమిలాడగా ఎట్టకేలకు రూ. లక్ష తన వద్ద సెక్యూరిటీ ఇచ్చి వెళ్ళమన్నాడు. చివరికి విషయం తెలుసుకున్న అక్కడి తెలుగు వారు దోహా కత్తర్‌లో ఉంటున్న మలికిపురానికి చెందిన జీఎన్నార్ ట్రస్ట్ అధ్యక్షుడు డాక్టర్ గెద్దాడ నాగేశ్వరరావుకు విషయం తెలిపారు.
ఆయన వాణి చంద్రకళ పని చేస్తున్న సేట్ వద్దకు వెళ్లారు. సేట్‌కు సెక్యూరిటీ ఇచ్చారు. వాణి చంద్రకళకు రూ. 50 వేలతో మంగళవారం బిజినెస్ క్లాస్‌లో విమా నం టికెట్ బుక్ చేసి స్వస్థలం పంపారు. ఆమె బుధవారం రాత్రి స్వస్థలం కత్తిమండ చేరుకొంది. ప్రత్యేక బాక్స్‌లో భద్రపరచిన కుమార్తె మృతదేహాన్ని చూసి బోరున విలపించింది. ఆ బాలిక తండ్రి కూడా కువైట్ నుంచి మంగళవారం కుమార్తె చివరి చూపు కోసం వచ్చాడు. బుధవారం రాత్రి ఆబాలిక అంత్య క్రియలు జరిగాయి. ఆ విషయం గురువారం నాడు బయట ప్రపంచానికి తెలిసింది.