తాలిపేరు ప్రాజెక్ట్ నుంచి విడుదలవుతున్న వరద నీరు
ఏజన్సీలో వర్షం
Published Sun, Sep 11 2016 12:00 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
ఖమ్మం వ్యవసాయం: జిల్లాలోని ఏజన్సీ ప్రాంతంలో శనివారం వర్షం పడింది. జిల్లాలోని 25 మండలాల్లో శనివారం ఉదయం 10 గంటల వరకు 5.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ తెలిపింది. భద్రాచలం అటవీ ప్రాంతంతోపాటు గోదావరీ పరీవాహక ప్రాంతంలో వర్షం పడింది. వెంకటాపురం నుంచి కొత్తగూడెం వరకు ఓ మోస్తరు వర్షం పడింది. అత్యధికంగా చర్ల మండలంలో 3.88 సె.మీ వర్షపాతం నమోదైంది. పది మండలాల్లో 1–3 సెం.మీ. మధ్య, 14 మండలాల్లో ఒక సెం.మీ. వరకు వర్షపాతం నమోదైంది. సెప్టెంబర్ నెల సాధారణ వర్షపాతం 164 మి.మీ. ఈ నెల 10వ తేదీ నాటికి 54.6 మి.మీ. పడాలి. దీనికన్నా ఎక్కువగా (69.1 మి.మీ.) వర్షం కురిసింది.
వారం తరువాత వాన
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి కారణంగా సెప్టెంబర్ ఆరంభం నుంచి 3వ తేదీ వరకు జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. 3వ తేదీన వరుణుడు మొఖం చాటేశాడు. మళ్లీ వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షాలు పడుతున్నాయి. సెప్టెంబర్ నెలలో ‘లానిన’ ప్రభావం ఉంటుందని, విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ముందే చెప్పింది.
పైర్లకు ప్రయోజనం
ప్రస్తుత వానతో పైర్లకు ఎంతగానో ప్రయోజనముంటుంది. వారం రోజులుగా వర్షాలు లేకపోవడంతో వర్షాధారంగా వేసిన పైర్లు బెట్టకు గురవుతున్నాయి. ఈ తరుణంలో కురిసన వర్షం.. పైర్లకు ఉపయోగపడుతుందని రైతులు చెబుతున్నారు. ప్రధానంగా జిల్లాలో సాగు చేస్తున్న పత్తి, వరి, మొక్కజొన్న తదితర పంటలకు ఈ వర్షాలు అనుకూలిస్తాయి.
Advertisement