
మాట్లాడుతున్న మువ్వా విజయ్‌బాబు
- లాభాల బాటలో సహకార బ్యాంక్
- డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు
ఖమ్మం వ్యవసాయం : రైతులకు సకాలంలో రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల్లో సగం నిధులు రూ.58 కోట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు విడుదలయ్యాయని, నిధులను 1.51 లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన రైతులకు రుణాలు ఇవ్వనున్నామని, పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. గతేడాది జేఎల్‌జీ కింద ఎంపిక చేసిన 5,600 భూమిలేని నిరుపేద రైతుల గ్రూపులకు రూ.56 కోట్ల రుణాలు ఇచ్చామని, ఆ రుణాలు చెల్లించినవారికి తిరిగి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు ఇస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ద్విచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రుణాలను జిల్లాలోని ముల్కలపల్లి సహకార సంఘం నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 10 సంఘాలకు ఐసీడీపీ కింద గోదాముల నిర్మాణానికి రూ.2.15 కోట్లు మంజూరు చేశామని, గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సహకార బ్యాంక్ లాభాల్లో నడుస్తోందని, గతేడాది రూ.9.62 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏటీఎంలను ఆగస్టులో ఏర్పాటు చేయటానికి నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు పాల్గొన్నారు.