చార్మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సిటీ బస్సును డ్రైవర్ ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఆపేశాడు. ‘వెనుక వచ్చే బస్సులో ఎక్కిస్తాను, పదండి’అంటూ కండక్టర్ ప్రయాణికులకు సూచించాడు. బస్సు పాడైందేమోనని భావించి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. బస్సు పాడైతే ఇలా వేరే బస్సుల్లో ప్రయాణికులను పంపటం సహజం. అయితే ఇక్కడ సమస్య బస్సుది కాదు.. టికెట్ జారీ చేసే యంత్రానిది (టిమ్). అది పాడైంది.. బస్సు కదలనంది!!
సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల క్రితం ఆర్టీసీలో టిమ్ (టికెట్ జారీ చేసే యంత్రం) విధానం ప్రవేశపెట్టారు. కానీ అప్పట్లో నాణ్యమైన యంత్రాలు సరఫరా కాలేదు. ఫలితంగా వాటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. చార్జింగ్ మొదలు.. టికెట్‌ను వెలుపలికి తరలించే గేర్ల వరకు అన్నీ సమస్యలే.
కండక్టర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు పాత టికెట్లతో ఉన్న ట్రేను కూడా బస్సులో ఉంచుతూ వస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడి యంత్రం పనిచేయకుంటే పాత పద్ధతిలో టికెట్లు ఇస్తూ వచ్చారు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పాతతరం టికెట్ల జారీని పూర్తిగా నిలిపేశారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది.
పాతవి ఆపేసి.. కొత్తవి నిలిపేసి..
టిమ్‌ల జీవితకాలం మూడేళ్లు. కానీ తరచూ మొరాయిస్తుండటం, సిటీలో టికెట్ల జారీ ఎక్కువగా ఉండటంతో మరింత దెబ్బతిన్నాయి. దీంతో వాటి స్థానంలో కొత్త యంత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన అధికారులు.. కొన్ని కొనుగోలు చేశారు. వాటిని మూడు నెలల పాటు పరిశీలించారు. కొత్త యంత్రాలు కావటంతో సమస్యలు లేకుండా పనిచేశాయి.
ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి పాత టికెట్ల విధానాన్ని పూర్తిగా ఎత్తేసి, టికెట్ల ముద్రణను కూడా నిలిపేశారు. అయితే నిధుల సమస్యతో చాలినన్ని యంత్రాలు సమకూరలేదు. దీంతో ఇప్పటికీ పాత యంత్రాలనే వాడుతున్నారు. యంత్రాలు చెడిపోతే టికెట్ల జారీ సాధ్యం కావటంలేదు. పాత తరం టికెట్లు కూడా అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. దీంతో బస్సులను ఆపేసి ప్రయాణికులను దింపేయాల్సిన పరిస్థితి నెలకొంది.
చార్జ్ కావు.. చార్జ్ చేయరు..
ఒక టిమ్‌ను ఫుల్ రీచార్జి చేస్తే 16 గంటలపాటు పనిచేయాలి. కానీ కొన్ని అంతసేపు పని చేయలేకపోతున్నాయి. కొన్ని యంత్రాలు సరిగా చార్జ్ కావటం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొన్ని ఫుల్ చార్జ్ కాకుండానే బస్సుల్లోకి చేరుతున్నాయి. మరోవైపు తొలి షిఫ్ట్ పూర్తి చేసుకున్న కండక్టర్ రెండో షిఫ్ట్‌లో వచ్చే కండక్టర్‌కు టిమ్‌ను అప్పగించాలి. ఈలోపే అది నిలిచిపోయే సమస్య వస్తోంది. దీంతో ఒక్కో షిఫ్ట్‌కు ఒక్కో యంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అది జరగాలంటే భారీగా యంత్రాలు కొనాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వద్ద డబ్బులు లేక కొనలేదు.
పాత టికెట్లు ఇవ్వాల్సిందే..
బస్సు చెడిపోతే దాన్ని బాగు చేసేందుకు నగరంలో ప్రస్తుతం రిలీఫ్ వ్యాన్లు ఉన్నాయి. ఐదు ద్విచక్ర రిలీఫ్ వాహనాలున్నాయి. వీటిలో పది చొప్పున స్పేర్ టిమ్‌లు ఉంచి, బస్సులో యంత్రం పాడైనట్టు తెలియగానే అక్కడికి వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ కొత్తవి రాకపోవటంతో అది ఇంకా అమలు కావటం లేదు.
కొత్త టిమ్‌లు రాకముందే పాత పద్ధతిలో టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేయటంపై డిపో స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కండక్టర్లకు రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువైన మినిమమ్ డినామినేషన్లతో కూడిన పాత టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment