Tim
-
టికెట్ కష్టమ్!
చార్మినార్ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్తున్న సిటీ బస్సును డ్రైవర్ ఉన్నట్టుండి రోడ్డు పక్కన ఆపేశాడు. ‘వెనుక వచ్చే బస్సులో ఎక్కిస్తాను, పదండి’అంటూ కండక్టర్ ప్రయాణికులకు సూచించాడు. బస్సు పాడైందేమోనని భావించి ప్రయాణికులంతా వెళ్లిపోయారు. బస్సు పాడైతే ఇలా వేరే బస్సుల్లో ప్రయాణికులను పంపటం సహజం. అయితే ఇక్కడ సమస్య బస్సుది కాదు.. టికెట్ జారీ చేసే యంత్రానిది (టిమ్). అది పాడైంది.. బస్సు కదలనంది!! సాక్షి, హైదరాబాద్: మూడేళ్ల క్రితం ఆర్టీసీలో టిమ్ (టికెట్ జారీ చేసే యంత్రం) విధానం ప్రవేశపెట్టారు. కానీ అప్పట్లో నాణ్యమైన యంత్రాలు సరఫరా కాలేదు. ఫలితంగా వాటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడుతున్నాయి. చార్జింగ్ మొదలు.. టికెట్‌ను వెలుపలికి తరలించే గేర్ల వరకు అన్నీ సమస్యలే. కండక్టర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో అధికారులు పాత టికెట్లతో ఉన్న ట్రేను కూడా బస్సులో ఉంచుతూ వస్తున్నారు. ఎక్కడైనా సమస్య ఏర్పడి యంత్రం పనిచేయకుంటే పాత పద్ధతిలో టికెట్లు ఇస్తూ వచ్చారు. అయితే ఏప్రిల్ ఒకటి నుంచి పాతతరం టికెట్ల జారీని పూర్తిగా నిలిపేశారు. ఇప్పుడు ఇదే పెద్ద సమస్యగా మారింది. పాతవి ఆపేసి.. కొత్తవి నిలిపేసి.. టిమ్‌ల జీవితకాలం మూడేళ్లు. కానీ తరచూ మొరాయిస్తుండటం, సిటీలో టికెట్ల జారీ ఎక్కువగా ఉండటంతో మరింత దెబ్బతిన్నాయి. దీంతో వాటి స్థానంలో కొత్త యంత్రాలను జారీ చేయాలని నిర్ణయించిన అధికారులు.. కొన్ని కొనుగోలు చేశారు. వాటిని మూడు నెలల పాటు పరిశీలించారు. కొత్త యంత్రాలు కావటంతో సమస్యలు లేకుండా పనిచేశాయి. ఈ నేపథ్యంలో ఏప్రిల్ ఒకటి నుంచి పాత టికెట్ల విధానాన్ని పూర్తిగా ఎత్తేసి, టికెట్ల ముద్రణను కూడా నిలిపేశారు. అయితే నిధుల సమస్యతో చాలినన్ని యంత్రాలు సమకూరలేదు. దీంతో ఇప్పటికీ పాత యంత్రాలనే వాడుతున్నారు. యంత్రాలు చెడిపోతే టికెట్ల జారీ సాధ్యం కావటంలేదు. పాత తరం టికెట్లు కూడా అందుబాటులో లేకపోవటంతో ప్రయాణికులకు టికెట్లు ఇవ్వలేని పరిస్థితి. దీంతో బస్సులను ఆపేసి ప్రయాణికులను దింపేయాల్సిన పరిస్థితి నెలకొంది. చార్జ్ కావు.. చార్జ్ చేయరు.. ఒక టిమ్‌ను ఫుల్ రీచార్జి చేస్తే 16 గంటలపాటు పనిచేయాలి. కానీ కొన్ని అంతసేపు పని చేయలేకపోతున్నాయి. కొన్ని యంత్రాలు సరిగా చార్జ్ కావటం లేదు. సిబ్బంది నిర్లక్ష్యం వల్ల కొన్ని ఫుల్ చార్జ్ కాకుండానే బస్సుల్లోకి చేరుతున్నాయి. మరోవైపు తొలి షిఫ్ట్ పూర్తి చేసుకున్న కండక్టర్ రెండో షిఫ్ట్‌లో వచ్చే కండక్టర్‌కు టిమ్‌ను అప్పగించాలి. ఈలోపే అది నిలిచిపోయే సమస్య వస్తోంది. దీంతో ఒక్కో షిఫ్ట్‌కు ఒక్కో యంత్రం ఇవ్వాలని నిర్ణయించారు. అది జరగాలంటే భారీగా యంత్రాలు కొనాల్సి ఉంది. కానీ ఆర్టీసీ వద్ద డబ్బులు లేక కొనలేదు. పాత టికెట్లు ఇవ్వాల్సిందే.. బస్సు చెడిపోతే దాన్ని బాగు చేసేందుకు నగరంలో ప్రస్తుతం రిలీఫ్ వ్యాన్లు ఉన్నాయి. ఐదు ద్విచక్ర రిలీఫ్ వాహనాలున్నాయి. వీటిలో పది చొప్పున స్పేర్ టిమ్‌లు ఉంచి, బస్సులో యంత్రం పాడైనట్టు తెలియగానే అక్కడికి వెళ్లి ఇవ్వాలని నిర్ణయించారు. కానీ కొత్తవి రాకపోవటంతో అది ఇంకా అమలు కావటం లేదు. కొత్త టిమ్‌లు రాకముందే పాత పద్ధతిలో టికెట్ల జారీని పూర్తిగా నిలిపివేయటంపై డిపో స్థాయి అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం కండక్టర్లకు రూ.3 వేల నుంచి రూ.4 వేల విలువైన మినిమమ్ డినామినేషన్లతో కూడిన పాత టికెట్లు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. -
రుణాలు సకాలంలో అందేలా చర్యలు
లాభాల బాటలో సహకార బ్యాంక్ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు ఖమ్మం వ్యవసాయం : రైతులకు సకాలంలో రుణాలు అందే విధంగా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ (డీసీసీబీ) చైర్మన్ మువ్వా విజయ్‌బాబు తెలిపారు. బుధవారం సాయంత్రం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మూడో విడత రుణమాఫీ నిధుల్లో సగం నిధులు రూ.58 కోట్లు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌కు విడుదలయ్యాయని, నిధులను 1.51 లక్షల రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమచేసే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆగస్టు 1వ తేదీ నుంచి నూతన రైతులకు రుణాలు ఇవ్వనున్నామని, పట్టాదారు పాస్‌పుస్తకం కలిగిన రైతులకు రూ.3 లక్షల వరకు పంట రుణాలు ఇచ్చేందుకు నిర్ణయించామని తెలిపారు. గతేడాది జేఎల్‌జీ కింద ఎంపిక చేసిన 5,600 భూమిలేని నిరుపేద రైతుల గ్రూపులకు రూ.56 కోట్ల రుణాలు ఇచ్చామని, ఆ రుణాలు చెల్లించినవారికి తిరిగి రూ.1.50 లక్షల చొప్పున రుణాలు ఇస్తామన్నారు. సహకార సంఘాల ద్వారా రైతులకు ద్విచక్ర వాహనాలు అందించాలని నిర్ణయించామని, అందుకోసం రూ.50 కోట్లను మంజూరు చేశామని తెలిపారు. ఈ నెల 25వ తేదీ నుంచి ఈ రుణాలను జిల్లాలోని ముల్కలపల్లి సహకార సంఘం నుంచి ప్రారంభించనున్నామని పేర్కొన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని 10 సంఘాలకు ఐసీడీపీ కింద గోదాముల నిర్మాణానికి రూ.2.15 కోట్లు మంజూరు చేశామని, గోదాములు నిర్మాణ దశలో ఉన్నాయని పేర్కొన్నారు. కాగా, సహకార బ్యాంక్ లాభాల్లో నడుస్తోందని, గతేడాది రూ.9.62 కోట్ల లాభం వచ్చిందని వివరించారు. జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఏటీఎంలను ఆగస్టులో ఏర్పాటు చేయటానికి నిర్ణయించామని చెప్పారు. సమావేశంలో బ్యాంక్ సీఈఓ వి.నాగచెన్నారావు పాల్గొన్నారు. -
ఐఫోన్ పాస్ వర్డ్ కోసం తిప్పలు..!
శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్ పాస్ వర్డ్ ను ఎంత ప్రయత్నించినా ఎఫ్‌బీఐ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని అన్‌లాక్ చేయలేకపోతున్నారు. ఘటన జరిగినప్పుడు కాల్పుల ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ లోని సమాచారం సేకరించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పాస్ వర్డ్ అన్ లాక్ చేయడం కోసం యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఐఫోన్ అన్ లాక్ చేసేందుకు సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది. ఉగ్రవాది ఐ ఫోన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆ పాస్వర్డ్ ను మార్చివేసినట్లు అధికారులు గమనించారు. రిమోట్ గా కూడా పాస్వర్డ్ రీసెట్ చేసే అవకాశం ఉండటంతో... బ్యాకప్ తొలగించి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఎఫ్‌బీఐకి యాపిల్ సంస్థ సహకరించాలని వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీ సాఫ్ట్వేర్ విషయంలో సహకరించాలని, వినియోగదారుల భద్రతపై రాజీ లేకుండా ప్రయత్నించాలని మేజిస్ట్రేట్ సూచించింది. అయితే కోర్టు ఆదేశాలను యాపిల్ సంస్థ సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది. ఐఫోన్ పాస్వర్డ్ ను అన్ లాక్ చేయాలంటే పాస్ కోడ్ తప్పనిసరిగా అవసరం. పాస్ కోడ్ ను పదే పదే తప్పుగా టైప్ చేస్తే ఫోన్ డేటా కూడా డిలీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రిజ్వాన్ ఐఫోన్ ను డేటా డిలీట్ కాకుండా అన్ లాక్ చేయాలని యాపిల్ సంస్థకు కోర్టు సూచించింది. ఫరూక్ ఫోన్ లోని డేటాను మరో ఫోన్ కు మార్చి, తర్వాత అన్ లాక్ చేసే ప్రయత్నం చేయమని చెప్పింది. అంతేకాక విభిన్న పాస్ కోడ్ లతో ఐఫోన్ తెరిచే ప్రయత్నానికి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు కోరింది. ఫరూక్ నాలుగు నెంబర్ల పాస్ వర్డ్ వాడినట్లుగా ఎఫ్ బీ ఐ అంచనా వేస్తుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని కోర్టు చెప్పింది. అయితే విభిన్న పాస్ వర్డ్స్ తో అన్ లాక్ ప్రయత్నాలు చేయడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, వినియోగదారుల భద్రతకు ప్రమాదమని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఏ రూపంలో పాస్ వర్డ్ అన్ లాక్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ను పూర్తిగా మార్చాలని, అది ప్రపంచంలోని ఐఫోన్ వినియోగదారులందరికీ అందించాలని చెప్తున్న సంస్థ... ఫెడరల్ జడ్జి ఆర్డర్ ను సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కోర్టు ఆర్డర్ ను బహిరంగ లేఖద్వారా విమర్శించారు. దీని వెనుక చట్టపరమైప చిక్కులెన్నో కలిగి ఉన్నాయని అన్నారు. కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినో కౌంటీ కి చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి సయ్యద్ ఫరూక్ ఐఫోన్ వాడేవాడు. అతడు అతడి భార్య తష్ ఫీన్ మాలిక్ తో కలసి డిసెంబర్ 2న కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ఐ ఫోన్ వారితోపాటు తీసుకెళ్ళారు. అప్పట్లో ఘటనలో 14 మంది చనిపోగా, 22 మంది గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన దంపతులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాల్పుల ప్రదేశంలో దొరికిన ఐఫోన్ ద్వారా ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.