
ఐఫోన్ పాస్ వర్డ్ కోసం తిప్పలు..!
శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్ పాస్ వర్డ్ ను ఎంత ప్రయత్నించినా ఎఫ్ బీ ఐ అధికారులు తెలుసుకోలేక పోతున్నారు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా అన్ లాక్ చేయ లేకపోతున్నారు. పాస్ వర్డ్ అన్ లాక్ చేయడం కోసం యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
శాన్ బెర్నార్డినో కాల్పుల ఉగ్రవాది ఐఫోన్ పాస్ వర్డ్ ను ఎంత ప్రయత్నించినా ఎఫ్‌బీఐ అధికారులు తెలుసుకోలేకపోతున్నారు. ఎన్ని రకాలుగా చూసినా దాన్ని అన్‌లాక్ చేయలేకపోతున్నారు. ఘటన జరిగినప్పుడు కాల్పుల ప్రదేశం నుంచి స్వాధీనం చేసుకున్న ఉగ్రవాది సయ్యద్ రిజ్వాన్ ఫరూక్ ఐఫోన్ లోని సమాచారం సేకరించేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేసి విఫలమయ్యారు. పాస్ వర్డ్ అన్ లాక్ చేయడం కోసం యాపిల్ సంస్థ సాయాన్ని కోరుతూ కోర్టును ఆశ్రయించారు. దీంతో ఐఫోన్ అన్ లాక్ చేసేందుకు సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు ఆదేశించింది.
ఉగ్రవాది ఐ ఫోన్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న కొద్ది గంటల్లోనే ఆ పాస్‌వర్డ్ ను మార్చివేసినట్లు అధికారులు గమనించారు. రిమోట్ గా కూడా పాస్‌వర్డ్ రీసెట్ చేసే అవకాశం ఉండటంతో... బ్యాకప్ తొలగించి ఉండొచ్చని కూడా అనుమానిస్తున్నారు. దీంతో కోర్టును ఆశ్రయించిన ఎఫ్‌బీఐకి యాపిల్ సంస్థ సహకరించాలని వాషింగ్టన్ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్ విషయంలో సహకరించాలని, వినియోగదారుల భద్రతపై రాజీ లేకుండా ప్రయత్నించాలని మేజిస్ట్రేట్ సూచించింది. అయితే కోర్టు ఆదేశాలను యాపిల్ సంస్థ సవాలు చేసే అవకాశం కనిపిస్తోంది.
ఐఫోన్ పాస్‌వర్డ్ ను అన్ లాక్ చేయాలంటే పాస్ కోడ్ తప్పనిసరిగా అవసరం. పాస్ కోడ్ ను పదే పదే తప్పుగా టైప్ చేస్తే ఫోన్ డేటా కూడా డిలీట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. దీంతో రిజ్వాన్ ఐఫోన్ ను డేటా డిలీట్ కాకుండా అన్ లాక్ చేయాలని యాపిల్ సంస్థకు కోర్టు సూచించింది. ఫరూక్ ఫోన్ లోని డేటాను మరో ఫోన్ కు మార్చి, తర్వాత అన్ లాక్ చేసే ప్రయత్నం చేయమని చెప్పింది. అంతేకాక విభిన్న పాస్ కోడ్ లతో ఐఫోన్ తెరిచే ప్రయత్నానికి సహకరించాలని యాపిల్ సంస్థను కోర్టు కోరింది. ఫరూక్ నాలుగు నెంబర్ల పాస్ వర్డ్ వాడినట్లుగా ఎఫ్ బీ ఐ అంచనా వేస్తుండటంతో ఆ దిశగా ప్రయత్నాలు సాగించాలని కోర్టు చెప్పింది. అయితే విభిన్న పాస్ వర్డ్స్ తో అన్ లాక్ ప్రయత్నాలు చేయడం కంపెనీ నిబంధనలకు విరుద్ధమని, వినియోగదారుల భద్రతకు ప్రమాదమని యాపిల్ సంస్థ భావిస్తోంది. ఏ రూపంలో పాస్ వర్డ్ అన్ లాక్ చేయాలన్నా ఆపరేటింగ్ సిస్టమ్ ను పూర్తిగా మార్చాలని, అది ప్రపంచంలోని ఐఫోన్ వినియోగదారులందరికీ అందించాలని చెప్తున్న సంస్థ... ఫెడరల్ జడ్జి ఆర్డర్ ను సవాల్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే యాపిల్ సీఈవో టిమ్ కుక్.. కోర్టు ఆర్డర్ ను బహిరంగ లేఖద్వారా విమర్శించారు. దీని వెనుక చట్టపరమైప చిక్కులెన్నో కలిగి ఉన్నాయని అన్నారు.
కాలిఫోర్నియా శాన్ బెర్నార్డినో కౌంటీ కి చెందిన ఆరోగ్య శాఖ ఉద్యోగి సయ్యద్ ఫరూక్ ఐఫోన్ వాడేవాడు. అతడు అతడి భార్య తష్ ఫీన్ మాలిక్ తో కలసి డిసెంబర్ 2న కాల్పులకు తెగబడ్డాడు. ఆ సమయంలో ఐ ఫోన్ వారితోపాటు తీసుకెళ్ళారు. అప్పట్లో ఘటనలో 14 మంది చనిపోగా, 22 మంది గాయపడ్డారు. అనంతరం పారిపోయేందుకు ప్రయత్నించిన దంపతులు పోలీసుల కాల్పుల్లో మరణించారు. కాల్పుల ప్రదేశంలో దొరికిన ఐఫోన్ ద్వారా ఘటన పూర్వాపరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.