హ్యాకింగ్ ఉచ్చులో అమెరికా!
అమెరికా నిఘా సంస్థ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్బీఐ) కొన్ని రోజులుగా హ్యాకింగ్ అంశంపై ఆందోళన చెందుతోంది. త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికలలో హ్యాకింగ్ కీలకపాత్ర పోషించనుందని అమెరికా నిఘా వర్గాలు భావిస్తున్నాయి. తమ దేశ అంతర్గత విషయాలు, ప్రభుత్వ పాలనాపరమైన రహస్యాలను వేరే దేశాలు తెలుసుకునేందుకు యత్నిస్తున్నాయని అమెరికా నిఘా సంస్థలు ఆరోపిస్తున్నాయి.
దేశ రహస్యాలు బహిర్గతమైతే అధ్యక్ష ఎన్నికలపై ఇవి తీవ్ర ప్రభావాన్ని చూపుతాయని ఎఫ్బీఐ డైరెక్టర్లలో ఒకరైన జేమ్స్ కొమీ అభిప్రాయపడ్డారు. హ్యాకింగ్ విషయమై డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ఇది వరకే హెచ్చరించారు. రష్యా తమ దేశ రహస్యాలను హ్యాకింగ్ ద్వారా తెలుసుకోవడంలో బిజీగా ఉందని ఆమె ఆరోపించారు. డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(ఎన్డీసీ) సీక్రెట్స్ పై సైబర్ క్రైమ్ కు కూడా వెనుకాడటం లేదన్నారు. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుండగా ఆధిక్యం ఎవరిదో కనిపెట్టడానికి రష్యా లాంటి దేశాలు యత్నిస్తున్నాయని నిఘా వర్గాలు వెల్లడించాయి.
అమెరికా కంప్యూటర్ నెట్ వర్క్లను తమ కంట్రోల్ లోకి తెచ్చుకునేందుకు రష్యా ఎప్పుడూ యత్నిస్తుందని మరో డైరెక్టర్ జేమ్స్ క్లాప్పర్ ఆరోపించారు. మరోవైపు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ మాత్రం రష్యా నామస్మరణ చేస్తుండటం గమనార్హం. ఇందులో భాగంగానే వ్లాదిమిర్ పుతిన్ తమ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా కంటే ఎన్నో రెట్లు బెటర్ నాయకుడంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.