![వేడెక్కుతున్న అమెరికా ఎన్నికల రాజకీయాలు - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/4/71477649938_625x300_0.jpg.webp?itok=Vy55VGXa)
వేడెక్కుతున్న అమెరికా ఎన్నికల రాజకీయాలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఓ వైపు సమయం దగ్గర పడుతుండటంతో తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విమర్శలు గుప్పించారు. ఈమెయిల్స్ వ్యవహారంలో ఆమె చేసిన తప్పిదాలకు హిల్లరీ క్రిమినల్ కేసు చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఓ ల్యాప్ టాప్ నుంచి పంపిన 65,000 ఈమెయిల్స్ ను హిల్లరీ భర్త, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, పార్టీ సన్నిహితులు షేర్ చేసుకున్నారని ఎఫ్ బీఐ తన దర్యాప్తులో కనుగొన్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. స్వీయ తప్పిదాలకు హిల్లరీ ఒక్కరే ఇందులో బాధితురాలు కాదని, అమెరికన్ ప్రభుత్వ తీరుతో ప్రజలందరూ ఈమెయిల్స్ కుంభకోణంలో బాధితులుగా మిగిలారని ట్రంప్ అభిప్రాయపడ్డారు.
ఓర్లాండోలో ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ట్రంప్ మాట్లాడుతూ.. విఫలమైన ఓ నాయకురాలికి ఎవరైనా మద్ధతిస్తారా అని ఈ సందర్బంగా ప్రశ్నించారు. ఆమె గత తరం నాయకురాలు అని, భవిష్యత్తు కోరుకునే వాళ్లు తన వెంట ఉండాలని ట్రంప్ పిలుపునిచ్చారు. 'హిల్లరీ అందర్నీ బ్లేమ్ చేయాలనుకుంటున్నారు. ఆమె గత కొన్ని రోజులుగా చేస్తున్న ప్రసంగాలలో ఈ విషయం తేటతెల్లమయింది. ఎఫ్ బీఐ, అమెరికన్ కాంగ్రెస్ కు కూడా ఆమె ఎన్నో పర్యాయాలు అబద్ధాలు చెప్పారు. ఆమె హయాంలో 13 ఫోన్లు మాయం చేశారు. 33,000 వేల ఈమెయిల్స్ ను లేకుండా చేశారు. ఈ విషయాన్ని ఎవరూ నమ్మడం లేదు' అని ట్రంప్ పేర్కొన్నారు.