జనం చూస్తుండగా హిల్లరీ హత్య చేసినా..!
అమెరికా అధ్యక్ష బరిలో రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ఉన్న అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ తన విమర్శల స్థాయిని మరింత పెంచేశారు. ఇప్పటికే తన ప్రత్యర్థి, డెమొక్రటిక్ పార్టీకి చెందిన అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై ఎన్నో విమర్శలు చేసిన ట్రంప్ శుక్రవారం ఫ్లోరిడాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మరోసారి రెచ్చిపోయారు. 'జనం చూస్తుండగానే హిల్లరీ ఓ వ్యక్తిని హత్య చేసి విచారణ లేకుండా తప్పించుకోగలరు' అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసినా శిక్ష నుంచి తప్పించుకోవటం తన జీవితంలో హిల్లరీ సాధించిన ఏకైక ఘనత అని డోనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు.
గతంలో విదేశాంగమంత్రిగా ఉన్న సమయంలో ప్రైవేట్ ఈమెయిల్స్ వాడి తన అధికారాన్ని దుర్వినియోగం చేయడంతో పాటు సమాచారాన్ని వ్యక్తిగతంగా వాడారన్న నేపథ్యంలో ట్రంప్ ఇలా తన ప్రత్యర్థిని విమర్శించారు. ఇంకా చెప్పాలంటే దాదాపు 20 వేలకు పైగా ప్రజలు చూస్తుండగానే ఓ వ్యక్తి గుండెల్లో బుల్లెట్ దింపి, చాకచక్యంగా ఈ కేసు విచారణ నుంచి తప్పించుకోవడంలో ఆమె దిట్ట అని పేర్కొన్నారు. ఎఫ్బీఐ విచారణ చేపట్టినా హిల్లరీని కేసు నుంచి ఎందుకు తప్పిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతికి పాల్పడ్డ రాజకీయ నాయకురాలు హిల్లరీ అని మండిపడ్డారు.