అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ పౌరులను మాత్రమే కాదు... ప్రపంచ ప్రజానీకాన్నే విస్మయపరుస్తున్నాయి. ఈ పరంపరలో ఆయన వెలువరించిన తాజా ట్వీట్ వాటన్నిటినీ తలదన్నింది. అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం తనకున్నదన్నదే ఆ ట్వీట్ సారాంశం. అలా అంటూనే తాను ఆ పని చేయా ల్సిన అవసరం రాదని ముక్తాయించారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదట! ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఉంది.
అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై అమెరికా పౌరుల్లో ఉన్న విశ్వసనీయతనూ, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అవకాశాలనూ దెబ్బతీయడానికి ప్రయత్నించిన రష్యాతో ఆయన కుమ్మక్కయ్యారన్న అభియోగాలపై సాగుతున్న విచారణ కీలక దశకు చేరింది. ఏడాదినుంచి ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ఎస్. మ్యూలర్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచా రణపై ట్రంప్‌కు మొదటినుంచీ అసహనం ఉంది. దానిపై వీలు చిక్కినప్పుడల్లా ఆయన విరుచుకు పడుతూనే ఉన్నారు.
ఈమధ్యకాలంలో ట్రంప్ న్యాయవాద బృందం మ్యూలర్ విచారణ చెల్లుబాటు కాదని వాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాసిక్యూషన్ నుంచి అయినా ట్రంప్‌కు రక్షణ ఉంటుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఆఖరికి ట్రంప్ ఎవరి నైనా కాల్చిచంపినా సరే ఆ విషయంలో ఆయనపై చర్య తీసుకోవడానికి వీలుండదని కూడా సెల విస్తున్నారు. దానికి కొనసాగింపుగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసినట్టు కనబడుతోంది. వాటర్‌గేట్ కుంభకోణంలో చిక్కుకుని 1974లో పదవీభ్రష్టుడైన రిచర్డ్ నిక్సన్ కూడా ట్రంప్ మాదిరే మాట్లా డేవారు. వాటర్‌గేట్ విచారణ సాగుతున్న సమయంలో ‘అధ్యక్షుడు ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం కాదనే అర్థం’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. మరో మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు అన్ని చట్టాలకూ అతీతుడని నిక్సన్ వాదనలోని సారాంశం.
ఇంతకూ ట్రంప్ ‘స్వీయ క్షమాభిక్ష’ నిర్ణయం తీసుకుంటారా లేక ఆ అవసరం రానివిధంగా ఏకంగా మ్యూలర్ విచారణనే రద్దు చేస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఏం చేసినా అది అమె రికాలో పెను సంక్షోభాన్ని కలిగించడం ఖాయం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికుండే క్షమాభిక్ష అధికారాల గురించి, ఏ విచారణనైనా ప్రారంభించమని లేదా నిలిపేయమని కోరే అధికారం గురించి వివరంగానే మాట్లాడినా...అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి తన విషయంలో తాను ఇలా చేయవచ్చునా అనే సంగతిని మాత్రం చెప్పలేదు.
అధ్యక్షుడిగా ట్రంప్ వంటివారు వస్తారని రాజ్యాంగాన్ని రచించినవారి ఊహకు తట్టి ఉండకపోవచ్చు. కానీ ఆ లొసుగును ట్రంప్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని ఆయన నుంచీ, ఆయనవైపునుంచీ వెలువడుతున్న ప్రకటనలు గమనిస్తే అర్ధమవుతుంది. విచారణలో భాగంగా ట్రంప్‌ను పిలిపించినా, దానికి ఆయన కట్టుబడాల్సిన అవసరం లేదని ఇప్పటికే మ్యూల ర్‌కు అందించిన లేఖలో ట్రంప్ న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణకు ట్రంప్ హాజరైతే అది అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడంలో అవరోధంగా మారుతుందని, ఆయన స్థాయిని తగ్గిస్తుందని కూడా వారు వాదించారు.
అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీంలో సభ్యులుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు వివిధ కారణాలరీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. స్వల్పకాలం జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ అందులో ఒకరు. ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు రష్యా రాయబారితో మాట్లాడిన మాటలు నిరుడు వెల్లడయ్యాయి. రష్యాపై అప్పటికి అమలులో ఉన్న ఆంక్షల్ని ట్రంప్ అధ్యక్షు డయ్యాక తొలగిస్తారన్నది ఆ మాటల సారాంశం.
ఆ సంభాషణలు వెల్లడయ్యాక ఫ్లిన్ రాజీనామా చేయాల్సివచ్చింది. దానిపై అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తునకు ఆదేశించగా దాన్ని నిలిపేయమని ట్రంప్ ఆయన్ను కోరారు. విననందుకు ఆగ్రహించి కోమీని తప్పించారు. కోమీ కూడా ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహితుడే. ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న 26మంది ఉన్నతాధికారులు ఇలా వివిధ సందర్భాల్లో తమంత తాము వైదొలగవలసి వచ్చింది. లేదా కొందరిపై ఆగ్రహించి ట్రంప్ తొలగించారు. ముఖ్యంగా మ్యూలర్ చేసిన అభియోగాలకు సరిగా జవాబు చెప్పలేక నలుగురు రాజీనామా చేశారు.
ఇలా పదే పదే జరగడం వల్ల కావొచ్చు... విచారణ కీలక దశకు చేరుకుని తనపై అభియోగాలు మోపే అవకాశాలు స్పష్టంగా కనబడటం వల్ల కావొచ్చు ట్రంప్ తాజా ట్వీట్ చేశారని అనుకోవాలి. అమెరికా రాజ్యాంగం ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి చెప్పకపోయినా ‘ఎవరూ తమ గురించి తాము తీర్పు ఇచ్చుకోరాద’న్న సంప్రదాయమైతే ఉంది. అయితే ట్రంప్ విశిష్టత ఏమంటే ఆయన ఏ సంప్రదాయాలనూ గౌరవించే రకం కాదు. నిక్సన్ చెప్పినట్టు అధ్యక్షుడు ఏం చేసినా చట్టవిరుద్ధం కాదని ఆయన బలంగా నమ్ముతారు.
ట్రంప్ స్వీయ క్షమాభిక్షకు పూనుకున్నా, రష్యా ప్రమేయంపై సాగే దర్యాప్తులో నిందితులుగా నిర్ధారణ అయిన తన బృందంలోని వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నించినా, మ్యూలర్ దర్యాప్తును మూలపడేసినా అది ట్రంప్‌పై ఉన్న అభియోగాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఆ అభియోగాల్లో నూరు శాతం నిజం ఉండొచ్చునని ప్రతి ఒక్కరూ భావించే ప్రమాదం ఏర్పడు తుంది. తనను అన్యాయంగా వేధిస్తున్నారని, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించకుండా అవరోధం కలిగిస్తు న్నారని ట్రంప్ వాపోతున్నా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు.
అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాల్లోని అసంబద్ధతలపైనా, అందులో ఉండే పరస్పర వైరుధ్యాలపైనా ఇప్పటికే అందరిలోనూ అసంతృప్తి ఉంది. మ్యూలర్ దర్యాప్తును ఏమాత్రం ఆటంకపరిచినా ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఆయనపై మహాభియోగ తీర్మానం చేసేందుకు కూడా సిద్ధపడొచ్చు. ట్రంప్ వివేకంతో వ్యవహరిస్తారో, తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment