Richard Nixon
-
అభిశంసన: ట్రంప్ కన్నా ముందు ఎవరంటే
వాషింగ్టన్: గత వారం కాపిటల్ భవనంలోకి చొరబాట్లను ప్రేరేపించినందుకు గాను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ప్రతినిధుల సభ అభిశంసించింది. దాంతో రెండు సార్లు అభిశంసనకు గురైన ఏకైక అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ చరిత్ర సృష్టించారు. ఇక ట్రంప్ అధ్యక్ష పదవి ముగియడానికి మరి కొద్ది రోజుల సమయం మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆయన డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న సెనేట్ తీసుకువచ్చిన అభిశంసన చర్య విచారణ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ట్రంప్‌ను తొలగించడానికి 232 మద్దతిచ్చారు. కాపిటల్ భవనంపై దాడి ఘటనలో ఐదుగురు మరణించడమే కాక అమెరికాలో ప్రజాస్వామ్య స్థానాన్ని దిగ్భ్రాంతికి గురి చేసినందుకు గాను ట్రంప్‌పై ప్రపంచవ్యాప్తంగా ఆగ్రహం చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో 10 మంది రిపబ్లికన్లు అధ్యక్షుడు ట్రంప్‌ను పదవి నుంచి తొలగించడానికి డెమొక్రాట్లలో చేరారు. ఇక ట్రంప్ కన్నా ముందు అమెరికా చరిత్రలో మరో ముగ్గురు అధ్యక్షులు కూడా అభిశంసనకు గురయ్యారు. వారు బిల్ క్లింటన్, ఆండ్రూ జాన్సన్, రిచర్డ్ నిక్సన్. వీరిలో బిల్ క్లింటన్‌ని, ఆండ్రూ జాన్సన్‌ని సెనెట్ నిర్దోషులుగా తేల్చగా.. రిచర్డ్ నిక్సన్ ఓటింగ్‌కు ముదే రాజీనామా చేశారు. 1867లో ఆండ్రూ జాన్సన్‌పై తొలిసారిగా అభిశంసన తీర్మానం అమెరికా అధ్యక్షుడిగా ఉంటూ తొలిసారిగా అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న వారిలో 17వ అధ్యక్షుడు ఆండ్రూ జాన్సన్ ఉన్నారు. 1865లో ఆయన అభిశంసన తీర్మానం ఎదుర్కొన్నారు. ఇక ఒక్క ఓటు తేడాతో ఆయన గట్టెక్కారు. అబ్రహాం లింకన్ హత్యకు గురైన తర్వాత అప్పటి వరకు వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న ఆండ్రూ జాన్సన్ అధ్యక్షుడయ్యారు. ఆయనపై 1867 పదవీకాల చట్టాన్ని ఉల్లంఘించిన ప్రాథమిక అభియోగంపై సభ 11 అభిశంసన పత్రాలను ఆమోదించింది. ఇక 1868లో ప్రతినిధుల సభలో రిపబ్లికన్లు అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఒక్క ఓటుతో ఆండ్రూ జాన్సన్ గట్టెక్కారు. (చదవండి: అభిశంసనకు గురైన డొనాల్డ్ ట్రంప్) 1999లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం ఇక అభిశంసన తీర్మానం ఎదుర్కొన్న రెండవ అధ్యక్షుడిగా బిల్ క్లింటన్ నిలిచారు. మోనికా లెవెన్స్కీ స్కాండల్‌లో బిల్ క్లింటన్ అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కొన్నారు. మోనికా లెవెన్స్కీతో అక్రమ సంబంధం ఉందని రుజువులతో సహా దొరికినప్పటికీ.. న్యాయస్థానం ముందు తనతో ఎలాంటి సంబంధం లేదని అబద్ధం చెప్పాలంటూ బిల్‌క్లింటన్ ఆమెపై ఒత్తిడి తీసుకురావడం జరిగింది. అభిశంసన తీర్మానానికి ముందు జరిగే ప్రక్రియలో 228 మందిలో 206 మంది క్లింటన్‌పై విచారణ జరిపాలంటూ కోరారు. 1999లో విచారణ తర్వాత సెనేట్‌లో బిల్ క్లింటన్‌పై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టగా... మూడింట రెండోవంతు మెజార్టీ రాలేదు. దాంతో క్లింటన్ అధ్యక్షుడిగా కొనసాగారు. (చదవండి: అందుకే మోనికాతో ఎఫైర్: బిల్ క్లింటన్) ఓటింగ్‌కు ముందే రాజీనామా చేసిన రిచర్డ్ నిక్సన్ రిచర్డ్ నిక్సన్ అమెరికాకు 37వ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1969 నుంచి 1974వరకు అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన హయాంలో వాటర్ గేట్ స్కాండల్ వెలుగుచూసింది. డెమొక్రాటిక్ నేషనల్ కమిటీ కార్యాలయంలో ఏకంగా సోదాలు జరిగాయి. దాంతో అధ్యక్షుడిగా ఉన్న రిచర్డ్ నిక్సన్‌కు చెడ్డపేరు వచ్చింది. ఇక పెద్ద ఎత్తున ఆయనపై ఆరోపణలు రావడంతో అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టాలని డిసైడ్ అయ్యారు. ఇక విచారణలో భాగంగా టెలిఫోన్ టేపులను ఇవ్వాలని కోరగా.. నిక్సన్ నిరాకరించారు. 1974 జూలైలో రిచర్డ్ నిక్సన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, న్యాయసూత్రాలకు విరుద్ధంగా వ్యవహరించారన్న ఆరోపణలపై అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైంది. అయితే ఇంపీచ్‌మెంట్‌పై ఓటింగ్ జరగక ముందే నిక్సన్ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. -
‘భారతీయ మహిళలు అందవిహీనులు’
వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్‌హౌస్ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని ఆడియో క్లిప్స్ దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఈ టేప్స్ వివరిస్తున్నాయి. ‘భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. (చదవండి: ట్రంప్‌ను పొగడుదామని తప్పులో కాలేసింది) భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ‘నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు’ అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.(చదవండి: వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!) అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి. -
ట్రంప్ అభిశంసనకు 42 శాతం మొగ్గు
అమెరికా రాజకీయ సంక్షోభానికి దారితీసిన 70వ దశకం వాటర్‌గేట్ కుంభకోణం ఫలితంగా నాటి అమెరికా అధ్యక్షడు రిచర్డ్ నిక్సన్ ఎదుర్కొన్న అభిశంసన పరిస్థితులే నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎదుర్కొంటున్నట్టు సీఎన్ఎన్, ఎస్ఎస్ఆర్ఎస్ తాజా పరిశోధన తేల్చి చెప్పింది. 1974 మార్చిలో వాటర్ గేట్ కుంభకోణం సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ పదవి నుంచి దిగిపోవాలని 43 శాతం మంది భావిస్తే, ఈ రోజు 42 శాతం మంది అమెరికన్లు ట్రంప్ అభిశంసనని కోరుకుంటున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. 1998లో బిల్‌క్లింటన్ అభిశంసనను కోరుకున్న 29 శాతం కంటే ఇది ఎక్కువ. అదేవిధంగా బరాక్ ఒబామా, జార్జ్ బుష్‌లు అధ్యక్షస్థానంలో ఉన్నప్పుడు వారిని పదవినుంచి దిగిపోవాలని దాదాపు 29 నుంచి 30 శాతం మంది కోరుకున్నారు. దానికంటే కూడా ఎక్కువమంది అమెరికన్లు ట్రంప్ అధ్యక్షపదవి నుంచి తొలగిపోవాలంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. వాటర్‌గేట్ కుంభకోణం లాంటి అతిపెద్ద స్కాం బయటపడే వరకూ కూడా రిచర్డ్ నిక్సన్ ని పదవినుంచి దిగిపోవాలని ఇంత భారీ సంఖ్యలో అమెరికన్లు కోరుకోకపోవడం గమనించాల్సిన విషయం. అంతిమంగా అభిశంసనపై ఓటింగ్‌కి ముందే అధ్యక్ష పదవికి నిక్సన్ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాప్రమేయంపై రాబర్ట్ ముల్లర్ దర్యాప్తు చేస్తుండడం వల్ల ట్రంప్ అభిశంసన విషయాన్ని డెమొక్రాట్లు ప్రస్తుతానికి పక్కనపెట్టారు. అభిశంసన అంశంపై ఒక నిర్ణయానికి వస్తే నవంబర్ లో జరగబోయే ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న భయం కూడా డెమొక్రాట్లను వెంటాడుతోంది. అదే సందర్భంలో టామ్ స్టీవర్ వంటి డెమొక్రటిక్ పార్టీ కార్యకర్తలు మాత్రం అభిశంసన అంశాన్ని ఎజెండాలోకి తెచ్చే బా«ధ్యతను తమపై వేసుకున్నారు. ముల్లర్ నిర్వహిస్తోన్న దర్యాప్తు తీరుపై జనామోదం గతం కంటే తగ్గింది. 48 శాతం నుంచి ఇప్పుడు 41 శాతానికి తగ్గినట్టు సిఎన్ఎన్ తెలిపింది. ముల్లర్ విచారణకు హాజరుకమ్మని కోరితే, ట్రంప్ తప్పనిసరిగా అంగీకరించి విచారణను ఎదుర్కోవాలని దాదాపు 70 శాతం కోరుతున్నారు. చదవండి: ట్రంప్ వాదనలో నిజమెంత ? -
చక్రబంధంలో ట్రంప్!
అమెరికా అధ్యక్ష పీఠాన్ని అధిరోహించాక డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రకటనలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఆ దేశ పౌరులను మాత్రమే కాదు... ప్రపంచ ప్రజానీకాన్నే విస్మయపరుస్తున్నాయి. ఈ పరంపరలో ఆయన వెలువరించిన తాజా ట్వీట్ వాటన్నిటినీ తలదన్నింది. అధ్యక్షుడిగా తనను తాను క్షమించుకునే అధికారం తనకున్నదన్నదే ఆ ట్వీట్ సారాంశం. అలా అంటూనే తాను ఆ పని చేయా ల్సిన అవసరం రాదని ముక్తాయించారు. ఎందుకంటే ఆయన ఏ తప్పూ చేయలేదట! ఇప్పటికిప్పుడు ట్రంప్ ఇలా చెప్పడానికి కారణం ఉంది. అధ్యక్ష ఎన్నికల ప్రక్రియపై అమెరికా పౌరుల్లో ఉన్న విశ్వసనీయతనూ, ట్రంప్ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ అవకాశాలనూ దెబ్బతీయడానికి ప్రయత్నించిన రష్యాతో ఆయన కుమ్మక్కయ్యారన్న అభియోగాలపై సాగుతున్న విచారణ కీలక దశకు చేరింది. ఏడాదినుంచి ఎఫ్‌బీఐ మాజీ డైరెక్టర్ రాబర్ట్ ఎస్. మ్యూలర్ నేతృత్వంలో కొనసాగుతున్న ఈ విచా రణపై ట్రంప్‌కు మొదటినుంచీ అసహనం ఉంది. దానిపై వీలు చిక్కినప్పుడల్లా ఆయన విరుచుకు పడుతూనే ఉన్నారు. ఈమధ్యకాలంలో ట్రంప్ న్యాయవాద బృందం మ్యూలర్ విచారణ చెల్లుబాటు కాదని వాదించడం మొదలుపెట్టారు. అంతేకాదు... పదవిలో ఉన్నంతకాలం ఎలాంటి ప్రాసిక్యూషన్ నుంచి అయినా ట్రంప్‌కు రక్షణ ఉంటుందని కూడా బల్లగుద్ది చెబుతున్నారు. ఆఖరికి ట్రంప్ ఎవరి నైనా కాల్చిచంపినా సరే ఆ విషయంలో ఆయనపై చర్య తీసుకోవడానికి వీలుండదని కూడా సెల విస్తున్నారు. దానికి కొనసాగింపుగానే ట్రంప్ తాజా ట్వీట్ చేసినట్టు కనబడుతోంది. వాటర్‌గేట్ కుంభకోణంలో చిక్కుకుని 1974లో పదవీభ్రష్టుడైన రిచర్డ్ నిక్సన్ కూడా ట్రంప్ మాదిరే మాట్లా డేవారు. వాటర్‌గేట్ విచారణ సాగుతున్న సమయంలో ‘అధ్యక్షుడు ఏదైనా చేస్తే అది చట్టవిరుద్ధం కాదనే అర్థం’ అని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించారు. మరో మాటలో చెప్పాలంటే అధ్యక్షుడు అన్ని చట్టాలకూ అతీతుడని నిక్సన్ వాదనలోని సారాంశం. ఇంతకూ ట్రంప్ ‘స్వీయ క్షమాభిక్ష’ నిర్ణయం తీసుకుంటారా లేక ఆ అవసరం రానివిధంగా ఏకంగా మ్యూలర్ విచారణనే రద్దు చేస్తారా అన్నది ఇంకా చూడాల్సి ఉంది. ఏం చేసినా అది అమె రికాలో పెను సంక్షోభాన్ని కలిగించడం ఖాయం. అమెరికా రాజ్యాంగం అధ్యక్షుడికుండే క్షమాభిక్ష అధికారాల గురించి, ఏ విచారణనైనా ప్రారంభించమని లేదా నిలిపేయమని కోరే అధికారం గురించి వివరంగానే మాట్లాడినా...అధ్యక్షుడిగా ఉండే వ్యక్తి తన విషయంలో తాను ఇలా చేయవచ్చునా అనే సంగతిని మాత్రం చెప్పలేదు. అధ్యక్షుడిగా ట్రంప్ వంటివారు వస్తారని రాజ్యాంగాన్ని రచించినవారి ఊహకు తట్టి ఉండకపోవచ్చు. కానీ ఆ లొసుగును ట్రంప్ ఉపయోగించుకునే అవకాశం లేకపోలేదని ఆయన నుంచీ, ఆయనవైపునుంచీ వెలువడుతున్న ప్రకటనలు గమనిస్తే అర్ధమవుతుంది. విచారణలో భాగంగా ట్రంప్‌ను పిలిపించినా, దానికి ఆయన కట్టుబడాల్సిన అవసరం లేదని ఇప్పటికే మ్యూల ర్కు అందించిన లేఖలో ట్రంప్ న్యాయవాదులు స్పష్టం చేశారు. విచారణకు ట్రంప్ హాజరైతే అది అధ్యక్ష బాధ్యతల్ని నిర్వర్తించడంలో అవరోధంగా మారుతుందని, ఆయన స్థాయిని తగ్గిస్తుందని కూడా వారు వాదించారు. అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్ టీంలో సభ్యులుగా ఉండి ఆ తర్వాత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన పలువురు వివిధ కారణాలరీత్యా తప్పుకోవాల్సి వచ్చింది. స్వల్పకాలం జాతీయ భద్రతా సలహాదారుగా పనిచేసిన మైకేల్ ఫ్లిన్ అందులో ఒకరు. ఆయన ట్రంప్ ఎన్నికల ప్రచార బృందంలో సభ్యుడిగా ఉన్నప్పుడు రష్యా రాయబారితో మాట్లాడిన మాటలు నిరుడు వెల్లడయ్యాయి. రష్యాపై అప్పటికి అమలులో ఉన్న ఆంక్షల్ని ట్రంప్ అధ్యక్షు డయ్యాక తొలగిస్తారన్నది ఆ మాటల సారాంశం. ఆ సంభాషణలు వెల్లడయ్యాక ఫ్లిన్ రాజీనామా చేయాల్సివచ్చింది. దానిపై అప్పటి ఎఫ్‌బీఐ డైరెక్టర్ జేమ్స్ కోమీ దర్యాప్తునకు ఆదేశించగా దాన్ని నిలిపేయమని ట్రంప్ ఆయన్ను కోరారు. విననందుకు ఆగ్రహించి కోమీని తప్పించారు. కోమీ కూడా ట్రంప్‌కు ఒకప్పుడు సన్నిహితుడే. ట్రంప్ ఏరికోరి తెచ్చుకున్న 26మంది ఉన్నతాధికారులు ఇలా వివిధ సందర్భాల్లో తమంత తాము వైదొలగవలసి వచ్చింది. లేదా కొందరిపై ఆగ్రహించి ట్రంప్ తొలగించారు. ముఖ్యంగా మ్యూలర్ చేసిన అభియోగాలకు సరిగా జవాబు చెప్పలేక నలుగురు రాజీనామా చేశారు. ఇలా పదే పదే జరగడం వల్ల కావొచ్చు... విచారణ కీలక దశకు చేరుకుని తనపై అభియోగాలు మోపే అవకాశాలు స్పష్టంగా కనబడటం వల్ల కావొచ్చు ట్రంప్ తాజా ట్వీట్ చేశారని అనుకోవాలి. అమెరికా రాజ్యాంగం ‘స్వీయ క్షమాభిక్ష’ గురించి చెప్పకపోయినా ‘ఎవరూ తమ గురించి తాము తీర్పు ఇచ్చుకోరాద’న్న సంప్రదాయమైతే ఉంది. అయితే ట్రంప్ విశిష్టత ఏమంటే ఆయన ఏ సంప్రదాయాలనూ గౌరవించే రకం కాదు. నిక్సన్ చెప్పినట్టు అధ్యక్షుడు ఏం చేసినా చట్టవిరుద్ధం కాదని ఆయన బలంగా నమ్ముతారు. ట్రంప్ స్వీయ క్షమాభిక్షకు పూనుకున్నా, రష్యా ప్రమేయంపై సాగే దర్యాప్తులో నిందితులుగా నిర్ధారణ అయిన తన బృందంలోని వారికి క్షమాభిక్ష పెట్టేందుకు ప్రయత్నించినా, మ్యూలర్ దర్యాప్తును మూలపడేసినా అది ట్రంప్‌పై ఉన్న అభియోగాల తీవ్రతను మరింత పెంచుతుంది. ఆ అభియోగాల్లో నూరు శాతం నిజం ఉండొచ్చునని ప్రతి ఒక్కరూ భావించే ప్రమాదం ఏర్పడు తుంది. తనను అన్యాయంగా వేధిస్తున్నారని, బాధ్యతలపై దృష్టి కేంద్రీకరించకుండా అవరోధం కలిగిస్తు న్నారని ట్రంప్ వాపోతున్నా ఆయన తప్పించుకోవడం సాధ్యం కాదు. అధ్యక్షుడిగా ఆయన తీసుకునే నిర్ణయాల్లోని అసంబద్ధతలపైనా, అందులో ఉండే పరస్పర వైరుధ్యాలపైనా ఇప్పటికే అందరిలోనూ అసంతృప్తి ఉంది. మ్యూలర్ దర్యాప్తును ఏమాత్రం ఆటంకపరిచినా ఇది మరిన్ని రెట్లు పెరుగుతుంది. అమెరికన్ కాంగ్రెస్ ఆయనపై మహాభియోగ తీర్మానం చేసేందుకు కూడా సిద్ధపడొచ్చు. ట్రంప్ వివేకంతో వ్యవహరిస్తారో, తెగేదాకా లాగేందుకు ప్రయత్నిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
మీడియా విందుకు ట్రంప్ డుమ్మా
హాజరు కావడంలేదని ట్విటర్లో వెల్లడించిన అధ్యక్షుడు వాషింగ్టన్ : మీడియాపై తరచూ నోరుపారేసు కుంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. జర్నలిస్టులపై తన వైఖరిని మరోసారి ప్రదర్శించారు. జర్నలిజం స్కాలర్‌షిప్‌లకోసం ప్రతి ఏటా వైట్‌హౌస్ కరస్పాండెట్స్ అసోసి యేషన్ (డబ్ల్యూహెచ్‌సీఏ) నిర్వహించే విందు కు తాను హాజరుకావడంలేదని చెప్పారు. దశాబ్దాల తర్వాత ఈ విందుకు డుమ్మా కొట్టిన అధ్యక్షుడు ట్రంపే కావడ గమనార్హం. ‘‘వైట్ హౌస్ కరస్పాండెంట్ల విందుకు నేను హాజరుకావడంలేదు. అందరికీ శుభాకాంక్షలు, విందు బాగా జరగాలని కోరుకుంటు న్నా’’ అని ట్విటర్లో ట్రంప్ పేర్కొన్నారు. జర్నలిజం స్కాలర్షిప్ ఫండ్ కోసం ప్రతి ఏటా ఈ విందును నిర్వహిస్తారు. దీనికి అమెరికా అధ్యక్షుడు, జర్నలిస్టులు, ప్రముఖులు హాజరవుతారు. 1920లో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ఏడాది ఏప్రిల్ 29న విందు ఏర్పాటు చేశారు. 1972లో అప్పటి అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఈ విందుకు హాజరు కాలేదు. నిక్సన్ తర్వాత ట్రంప్ ఈ విందుకు హాజరుకావడంలేదు. 1981లో అప్పటి అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ కూడా విందుకు వ్యక్తిగతంగా హాజరుకాలేదు. అంతకుముందు ఆయనపై హత్యాయత్నం జరగడంతో దాని నుంచి కోలుకునే క్రమంలో విందులో పాల్గొనలేకపోయారు. -
ఐ యామ్ నాట్ ఎ క్రూక్
ఆ నేడు 17 నవంబర్, 1973 రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు అమెరికా 37వ అధ్యక్షునిగా పని చేశారు. ఆరోపణలతో తనకు తానుగా పదవి నుంచి దిగిపోయిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే. చంద్రుడిపైకి అంతరిక్షయానం, వియత్నాం యుద్ధం, ‘వాటర్‌గేట్’ కుంభకోణం... నిక్సన్ హయాంలోనే యు.ఎస్.కు కీర్తిని, అపకీర్తిని తెచ్చిపెట్టాయి. 1972 అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వాషింగ్టన్‌లోని ‘వాటర్‌గేట్ కాంప్లెక్స్’లో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ కార్యాలయంలోకి రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్సన్ మనుషులు ఐదుగురు అద్దాలను బద్దలు కొట్టి మరీ ప్రవేశించారు. ఈ ఘటన రాజకీయ కుంభకోణంగా పేరుమోసి చివరికి ‘వాటర్‌గేట్ స్కామ్’గా చరిత్రలో పేరుమోసింది. 1973 నవంబర్ 17న అమెరికా అధ్యక్షుడి హోదాలో నిక్సన్ పాత్రికేయుల ‘ప్రశ్న-సమాధానం’ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘తమ అధ్యక్షుడు నేరస్థుడా (క్రూక్) కాదా అని తెలుసుకునే హక్కు ఉంది. నేను క్రూక్ని కాదు’’ అని అనడం అమెరికా రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది.