వాషింగ్టన్: అధ్యక్ష ఎన్నికలు సమీపిస్తోన్న వేళ వైట్‌హౌస్ నుంచి పలు వివాదకర సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వెలువడిన కొన్ని ఆడియో క్లిప్స్ దేశంలో సంచలనం సృష్టిస్తున్నాయి. అమెరికా మాజీ అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ భారతీయ మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు ఈ టేప్స్ వివరిస్తున్నాయి. ‘భారతీయ మహిళలు.. ప్రపంచంలోనే అత్యంత అందవిహీనులు.. సెక్స్‌లెస్, ఆకర్షణ లేనివారు, ఎలా పునరుత్పత్తి చేస్తారో తెలియదు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు నిక్సన్. ఈ విషయాన్ని తాజాగా ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ గ్యారీ జె. బాస్ ది న్యూయార్క్ టైమ్స్‌కు ఇచ్చిన ఓపీనియన్ పోల్‌లో వెల్లడించారు. అమెరికాకు 37వ అధ్యక్షుడిగా రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు పనిచేశారు. ఇక ఆయనకు సంబంధించిన ఈ టేప్స్‌ను రిచర్డ్ నిక్సన్ లైబ్రరీ అండ్ మ్యూజియం విడుదల చేసింది. (చదవండి: ట్రంప్‌ను పొగడుదామని తప్పులో కాలేసింది)
భారతీయుల పట్ల నిక్సన్‌లో ఉన్న వ్యతిరేకతకు ఆ సమయంలో జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిస్సింజర్ వీరాభిమాని అని బాస్ తెలిపారు. అంతేకాక హెన్రీ 1970 ల ప్రారంభంలో భారత్ పట్ల అమెరికా విధానాన్ని కూడా నిర్ణయించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదించింది. జూన్ 17, 1971 న సాయంత్రం 5:15-6:10 గంటల మధ్య జరిగిన సమావేశంలో భాగంగా నిక్సన్ ఈ వ్యాఖ్యలు చేశారు. వీటిని ఓవల్ ఆఫీస్ టేపింగ్ సిస్టమ్ రికార్డ్ చేసింది. ఈ టేప్స్‌ను బాస్ తన పుస్తకం ‘ది బ్లడ్ టెలిగ్రామ్’లో ప్రస్తావించారు. నిక్సన్ భారతీయ మహిళలను నల్లజాతి మహిళలతో పోల్చారు. ‘నా ఉద్దేశ్యం ఏమిటంటే, బ్లాక్ ఆఫ్రికన్లలో కొద్దిగా ఆకర్షణ ఉంటుంది. కానీ భారతీయ మహిళలు చూడటానికి అందవిహీనులుగా ఉంటారు’ అని నిక్సన్ పేర్కొన్నారు. అంతేకాకుండా నిక్సన్ నవంబర్ 4, 1971న అప్పటి భారత ప్రధాన మంత్రి ఇందిరా గాంధీతో మాట్లాడుతున్నప్పుడు ‘నాకైతే వారు అసలు నచ్చరు. మిగిలిన వ్యక్తులకు వారు ఎలా నచ్చుతున్నారో తెలియట్లేదు’ అని చెప్పినట్లు విన్నానని బాస్ స్పష్టం చేశారు.(చదవండి: వైట్‌హౌస్ ఒరలో ఇమడరనీ!)
అంతేకాక ఈ టేపులు అంతర్జాతీయ సంఘటనలు, నటుల పట్ల నిక్సన్ వైఖరిని ప్రతిబింబిస్తున్నాయి. వ్యక్తిగత జాత్యహంకారం, భారతీయుల పట్ల అతని వ్యతిరేకతను ఈ టేపులు వెల్లడిస్తున్నాయి. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) లోని బెంగాలీ ప్రజలపై పాకిస్తాన్ సైన్యం చేసిన దురాగతాల విషయలో కూడా నిక్సన్ సానుకూల వైఖరిని కలిగి ఉండటమే కాక భారత్ పట్ల ఎంతటి శత్రుత్వం కలిగి ఉన్నారో కూడా ఈ టేపులు స్పష్టం చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment