ట్రంప్‌ అభిశంసనకు 42 శాతం మొగ్గు | Sakshi
Sakshi News home page

Published Tue, Jun 26 2018 3:00 AM

Poll Places Support for Trump Impeachment at 42 percent - Sakshi

అమెరికా రాజకీయ సంక్షోభానికి దారితీసిన 70వ దశకం వాటర్‌గేట్‌ కుంభకోణం ఫలితంగా నాటి అమెరికా అధ్యక్షడు రిచర్డ్‌ నిక్సన్‌ ఎదుర్కొన్న అభిశంసన పరిస్థితులే నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎదుర్కొంటున్నట్టు సీఎన్‌ఎన్, ఎస్‌ఎస్‌ఆర్‌ఎస్‌ తాజా పరిశోధన తేల్చి చెప్పింది.  1974 మార్చిలో వాటర్‌ గేట్‌ కుంభకోణం సందర్భంగా నాటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ పదవి నుంచి దిగిపోవాలని 43 శాతం మంది భావిస్తే, ఈ రోజు 42 శాతం మంది అమెరికన్లు ట్రంప్‌ అభిశంసనని కోరుకుంటున్నట్టు ఈ పరిశోధనలో వెల్లడయ్యింది. 1998లో బిల్‌క్లింటన్‌ అభిశంసనను కోరుకున్న 29 శాతం కంటే ఇది ఎక్కువ. అదేవిధంగా బరాక్‌ ఒబామా, జార్జ్‌ బుష్‌లు అధ్యక్షస్థానంలో ఉన్నప్పుడు వారిని పదవినుంచి దిగిపోవాలని దాదాపు 29 నుంచి 30 శాతం మంది కోరుకున్నారు. దానికంటే కూడా ఎక్కువమంది అమెరికన్లు ట్రంప్‌ అధ్యక్షపదవి నుంచి తొలగిపోవాలంటున్నారని తాజా నివేదిక వెల్లడించింది. 

వాటర్‌గేట్‌ కుంభకోణం లాంటి అతిపెద్ద స్కాం బయటపడే వరకూ కూడా రిచర్డ్‌ నిక్సన్‌ ని పదవినుంచి దిగిపోవాలని ఇంత భారీ సంఖ్యలో అమెరికన్‌లు కోరుకోకపోవడం గమనించాల్సిన విషయం. అంతిమంగా అభిశంసనపై ఓటింగ్‌కి ముందే అధ్యక్ష పదవికి నిక్సన్‌ రాజీనామా చేశారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యాప్రమేయంపై రాబర్ట్‌  ముల్లర్‌ దర్యాప్తు చేస్తుండడం వల్ల  ట్రంప్‌ అభిశంసన విషయాన్ని డెమొక్రాట్లు ప్రస్తుతానికి పక్కనపెట్టారు. అభిశంసన అంశంపై ఒక నిర్ణయానికి వస్తే నవంబర్‌ లో జరగబోయే ఎన్నికల్లో వ్యతిరేక ప్రభావం ఉంటుందన్న భయం కూడా డెమొక్రాట్లను వెంటాడుతోంది. అదే సందర్భంలో టామ్‌  స్టీవర్‌ వంటి డెమొక్రటిక్‌ పార్టీ కార్యకర్తలు  మాత్రం అభిశంసన అంశాన్ని ఎజెండాలోకి తెచ్చే బా«ధ్యతను తమపై వేసుకున్నారు. 
    
ముల్లర్‌ నిర్వహిస్తోన్న దర్యాప్తు తీరుపై జనామోదం గతం కంటే తగ్గింది. 48 శాతం నుంచి ఇప్పుడు  41 శాతానికి తగ్గినట్టు సిఎన్‌ఎన్‌ తెలిపింది. ముల్లర్‌ విచారణకు హాజరుకమ్మని కోరితే, ట్రంప్‌ తప్పనిసరిగా అంగీకరించి విచారణను ఎదుర్కోవాలని దాదాపు 70 శాతం కోరుతున్నారు. 

చదవండి: ట్రంప్‌ వాదనలో నిజమెంత ?

Advertisement
Advertisement