ఐ యామ్ నాట్ ఎ క్రూక్
ఆ నేడు 17 నవంబర్, 1973
రిచర్డ్ నిక్సన్ 1969 నుంచి 1974 వరకు అమెరికా 37వ అధ్యక్షునిగా పని చేశారు. ఆరోపణలతో తనకు తానుగా పదవి నుంచి దిగిపోయిన తొలి అమెరికా అధ్యక్షుడు కూడా ఈయనే. చంద్రుడిపైకి అంతరిక్షయానం, వియత్నాం యుద్ధం, ‘వాటర్‌గేట్’ కుంభకోణం... నిక్సన్ హయాంలోనే యు.ఎస్.కు కీర్తిని, అపకీర్తిని తెచ్చిపెట్టాయి. 1972 అధ్యక్ష ఎన్నికల ప్రచారం జరుగుతున్నప్పుడు వాషింగ్టన్‌లోని ‘వాటర్‌గేట్ కాంప్లెక్స్’లో ఉన్న డెమొక్రాటిక్ పార్టీ కార్యాలయంలోకి రిపబ్లికన్ పార్టీకి చెందిన నిక్సన్ మనుషులు ఐదుగురు అద్దాలను బద్దలు కొట్టి మరీ ప్రవేశించారు.
ఈ ఘటన రాజకీయ కుంభకోణంగా పేరుమోసి చివరికి ‘వాటర్‌గేట్ స్కామ్’గా చరిత్రలో పేరుమోసింది. 1973 నవంబర్ 17న అమెరికా అధ్యక్షుడి హోదాలో నిక్సన్ పాత్రికేయుల ‘ప్రశ్న-సమాధానం’ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘తమ అధ్యక్షుడు నేరస్థుడా (క్రూక్) కాదా అని తెలుసుకునే హక్కు ఉంది. నేను క్రూక్‌ని కాదు’’ అని అనడం అమెరికా రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక సందర్భంగా నిలిచిపోయింది.